గోదావరి ప్రాజెక్టుల కిందనే యాసంగి నీళ్లు

గోదావరి ప్రాజెక్టుల కిందనే  యాసంగి నీళ్లు
  • 28.95 లక్షల ఎకరాలకు నీళ్లివ్వాలని ‘శివమ్​’ ప్రతిపాదన
  • సాగర్, కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ​ ఆయకట్టుకు క్రాప్​ హాలిడే

హైదరాబాద్, వెలుగు: గోదావరి బేసిన్​లోని ప్రాజెక్టుల కిందనే యాసంగి సీజన్​లో నీళ్లివ్వాలని ఇరిగేషన్​ శాఖ నిర్ణయించింది. కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టుల్లో నీళ్లు లేకపోవడంతో వాటి కింద ఆయకట్టు ప్రతిపాదించలేదు. బుధవారం జలసౌధలో ఈఎన్సీ(జనరల్) మురళీధర్​అధ్యక్షతన జరిగిన స్టేట్​ లెవల్ కమిటీ ఫర్​ ఇంటిగ్రేటెడ్​వాటర్​ మేనేజ్​మెంట్(శివమ్) మీటింగ్​లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. యాసంగి సీజన్​లో 28.95 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. నిరుడు యాసంగి సీజన్​లో 33.46 లక్షల ఎకరాలకు నీళ్లివ్వగా ఈసారి 4.51 లక్షల ఎకరాల ఆయకట్టు తగ్గింది. ఈసారి 11,57,014 ఎకరాల్లో వరి, 17,38,565 ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లు ఇవ్వనున్నారు. మొత్తం 28,95,579 ఎకరాలకు 215 టీఎంసీల నీటిని విడుదల చేయాలని నిర్ణయించారు. నాగార్జున సాగర్​ ఎడమ కాలువ ఆయకట్టుకు ఈసారి చుక్క నీళ్లు ఇవ్వడం లేదు. 


దీంతో సాగర్ ​ఆయకట్టుకు అనధికారికంగా క్రాప్​ హాలిడే ప్రకటించినట్టు అయ్యింది. ఒక్క ఎస్సారెస్పీ కిందనే ఈ సీజన్​లో 11.55 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టులో 78.66 టీఎంసీల నీళ్లు నిల్వ ఉండగా అందులో 6.50 టీఎంసీలు తాగునీటి అవసరాలకు కేటాయించారు. ఎస్సారెస్పీ స్టేజీ1 కింద 8.28 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వనున్నారు. అందులో 4.41 లక్షల ఎకరాల వరి, 3.87 లక్షల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీటిని వార బందీ పద్ధతి(ఆన్​అండ్​ఆఫ్)లో విడుదల చేస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద ఈ సీజన్​లో 93 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. నిజాంసాగర్​కింద1.24 లక్షల ఎకరాలు, దేవాదుల కింద 2.02 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తారు.

కృష్ణా బేసీన్​లో నీళ్లు లేవు..

కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టులకు ఈ ఏడాది పెద్దగా వరద రాలేదు. దీంతో యాసంగిలో ఏ ఒక్క ప్రాజెక్టు కింద చుక్క నీటిని విడుదల చేసే అవకాశం లేకుండా పోయింది. నాగార్జున సాగర్​లో 157 టీఎంసీలు మాత్రమే నిల్వ ఉన్నాయి. దీంతో ఈ ప్రాజెక్టు ఎడమ కాలువ కింద ఉన్న 6.40 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఎండీడీఎల్​కు ఎగువ నీళ్లు లేకపోవడం, రానున్న ఎండాకాలంతో పాటు వచ్చే సీజన్​లోని జూన్, జులై నెలల తాగునీటి అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు. శ్రీశైలంలో 57 టీఎంసీలే ఉన్నాయి.. ఇందులో ఎండీడీఎల్​కు ఎగువన ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకే సరిపోతాయి. ఈ ప్రాజెక్టు ఆధారంగా ఉన్న ఏఎమ్మార్​ ఎస్ఎల్బీసీకి ఈసారి నీళ్లు ఇవ్వడం లేదు. ఫలితంగా కల్వకుర్తి ఆయకట్టుకు ఈసారి నీళ్లు ఇచ్చే పరిస్థితి లేదు. కృష్ణా బేసిన్​లోని నెట్టెంపాడు కింద 5 వేల ఎకరాలకు, మూసీ కింద 30 వేల ఎకరాలకు, జూరాల కింద 23 వేల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇవ్వాలని నిర్ణయించారు. గోదావరి బేసిన్​లోని శ్రీరాం సాగర్, నిజాంసాగర్, మిడ్​మానేరు, లోయర్​మానేరు, ఎల్లంపల్లి, సింగూరు ప్రాజెక్టుల్లో సరిపడా నీళ్లుండటంతో వాటి కింది ఆయకట్టుకు నీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. స్కివమ్​ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదముద్ర వేసిన వెంటనే ఆన్​అండ్​ఆఫ్(8 రోజులు నీటి విడుదల.. 7 రోజులు బంద్) పద్ధతిలో నీటిని విడుదల చేయనున్నారు. యాసంగి సీజన్​లో రైతులు ప్రతి చుక్క నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచిస్తూ ఇరిగేషన్​ ఇంజనీర్లు ఆయకట్టు ప్రాంతంలో అవగాహన కార్యక్రమాలునిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు.