భద్రాచలంలో కాంటూర్​ లెవెల్స్​ వివరాలు సేకరిస్తున్న అధికారులు

భద్రాచలంలో కాంటూర్​ లెవెల్స్​ వివరాలు సేకరిస్తున్న అధికారులు
  • చివరిసారి 2006లో లెవెల్స్​ తీసుకున్న అధికారులు
  • మొన్నటి వరదలు, ముంపు నేపథ్యంలో మరోసారి సర్వే 
  • భవిష్యత్​లో ముప్పు నుంచి తప్పించుకునేందుకే ..

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో నీటి పారుదల శాఖ అధికారులు కాంటూర్​  లెవెల్స్​ సేకరిస్తున్నారు. జూలై 16 తెల్లవారుజామున భద్రాచలం వద్ద గోదావరి 71.3 అడుగులకు చేరుకుని, 24 లక్షల 43వేల 684 క్యూసెక్కుల వరద ప్రవహించింది. 36 ఏండ్ల తర్వాత ఇంత పెద్ద ఎత్తున వరద రాగా, భద్రాచలం చుట్టూ ఉన్న కరకట్ట పట్టణాన్ని రక్షించింది. అయినా కరకట్టను ఆనుకుని ప్రవాహం ఉండటంతో భవిష్యత్​లో ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండేందుకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. రానున్న రోజుల్లో టౌన్​కు ఎలాంటి ఆపద కలగకుండా యాక్షన్​ ప్లాన్ ​తయారు చేసే పనిలో పడింది. 1986 వచ్చిన వరద కంటే మొన్న తక్కువ అడుగులే వచ్చినా, ముంపు మాత్రం ఆ స్థాయిలోనే ఉండడంతో కాంటూర్ ​లెవెల్స్​ సేకరిస్తున్నారు. భద్రాచలానికి మొదటి, రెండో, మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేసిన సమయంలో ఏ టైంలో ఎన్ని గ్రామాలు ముంపునకు గురయ్యాయన్నది తెలుసుకునేందుకు ఈ సర్వే చేస్తున్నారు. 2006లో కూడా కాంటూర్​ లెవెల్స్ తీసుకున్నా అప్పుడు పోలవరం, సీతమ్మసాగర్​ బ్యారేజ్​కాపర్​ డ్యాంలు లేవు. పోలవరం బ్యాక్​వాటర్​తో పాటు, సీతమ్మసాగర్ ​బ్యారేజీ నిర్మాణం వల్ల అశ్వాపురం, మణుగూరు, పినపాక, చర్ల, దుమ్ముగూడెం మండలాలు ఎదుర్కొన్న ముంపు దృష్ట్యా కాంటూర్ ​లెవెల్స్ ​మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో ఫ్లడ్ ​మాన్యువల్ ప్రమాద హెచ్చరిక ప్రకారం ముంపు గ్రామాల లిస్ట్​ ఉండేది. మొన్నటి వరదలు ఊహించిన దాని కంటే ఎక్కువే రాగా, ఈ నీటి మట్టాల ఆధారంగానే కాంటూర్​ లెవెల్స్ ​రూపొందించనున్నారు. చర్ల మండలం సుబ్బంపేట నుంచి భద్రాచలం వరకు గోదావరికి ఎడమవైపు, జానంపేట నుంచి బూర్గంపాడు వరకు కుడివైపు ఆయా గ్రామాల్లో ఎన్ని గ్రామాలు..ఎన్ని అడుగులకు ముంపునకు గురయ్యాయో? తెలుసుకుంటున్నారు. ఈ బాధ్యతలను ఇరిగేషన్ ​డిపార్ట్​మెంట్​జీవీఆర్​కంపెనీకి అప్పగించింది. ఈ టీం దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద ఆదివారం కాంటూర్ ​లెవెల్స్​సేకరించింది. మరో రెండు రోజులు భద్రాచలంలో సర్వే కొనసాగనుంది. సుబ్బంపేట నుంచి భద్రాచలం వరకు ప్రస్తుతం సర్వే చేస్తున్నామని, తాలిపేరు ఈఈ రాంప్రసాద్​ తెలిపారు. గోదావరికి అవతలి వైపు కూడా సర్వే జరుగుతుందని వెల్లడించారు.

 ఎంత ఎత్తులో కట్టాలో తెలుస్తుంది
దుమ్ముగూడెం,-అశ్వాపురం మండలాల మధ్య గోదావరిపై రాష్ట్ర ప్రభుత్వం సీతమ్మసాగర్ బ్యారేజీ కడుతోంది. 37.27 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 1.5 కిలోమీటర్ల పొడవు, 70 మీటర్ల ఎత్తుతో ఈ బ్యారేజీ నిర్మాణం కొనసాగుతోంది. దీనివల్ల అశ్వాపురం, మణుగూరు, పినపాక, దుమ్ముగూడెం, చర్ల మండలాలకు బ్యాక్​ వాటర్ ఎఫెక్ట్ ఉంటుంది.  ఈ మండలాల రక్షణ కోసం బ్యారేజీకి  కుడివైపు 40 కిలోమీటర్లు, ఎడమవైపు 55 కిలోమీటర్ల పొడవునా కరకట్టలు నిర్మిస్తోంది. మొన్నటి గోదావరి వరదల నీటిమట్టాల వల్ల ఎఫెక్ట్ అయిన గ్రామాల లిస్టు తయారైతే, కట్టలు ఎంత ఎత్తులో నిర్మించాలనే దానిపై పూర్తి స్పష్టత వస్తుంది. భవిష్యత్​లో ఎంతటి వరద వచ్చినా ముంపు లేకుండా చూడటం ఈ కరకట్టల లక్ష్యం. ఇప్పటికే భూసేకరణ కూడా పూర్తి కావొచ్చింది.