- వ్యక్తి మృతి.. ఏడుగురికి గాయాలు
- నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలో ఘటన
- సిద్దిపేట జిల్లాలో ఏడేండ్ల బాలిక, మంచిర్యాలలో యువకుడు మృతి
నర్సాపూర్ (జి), వెలుగు : ట్రాక్టర్, టాటా ఏస్ వాహనాలు ఢీకొనడంతో ఒకరు చనిపోగా మరో ఏడుగురికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలం రాంపూర్ వద్ద హైవేపై మంగళవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కొరటికల్ గ్రామానికి చెందిన 11 మంది టాటా ఏస్ వాహనంలో కామోల్ గ్రామంలో అంత్యక్రియలకు హాజరయ్యారు. అనంతరం తిరిగి వెళ్లే క్రమంలో రాంపూర్ గ్రామం వద్దకు రాగానే వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఓవర్ టేక్ చేసే క్రమంలో టాటా ఏస్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ రాజేశ్వర్ (50)తో పాటు ఏడుగురికి గాయాలు అయ్యాయి. గమనించిన స్థానికులు గాయపడిన వారిని హాస్పిటల్‌కు తరలించారు.
అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ రాజేశ్వర్ చనిపోయాడు. విషయం తెలుసుకున్న నిర్మల్ ఎస్పీ జానకీ షర్మిల ఘటనాస్థలాన్ని సందర్శించ వివరాలు సేకరించారు. మృతుడు కుమారుడు సంజీవ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు నర్సాపూర్ ఎస్సై గణేశ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఏడేండ్ల బాలిక మృతి
గజ్వేల్, వెలుగు : రెండు బైక్‌లు ఢీకొనడంతో ఏడేండ్ల బాలిక చనిపోయింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగరాజుపల్లిలో మంగళవారం జరిగింది. గజ్వేల్ ఇన్స్‌పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం... మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన చిన్నబోయిన స్వామి, కావ్య దంపతులకు కుమారుడు శ్రీహర్ష, కుమార్తె సాహితి (7) ఉన్నారు. మంగళవారం స్వామి పిల్లలిద్దరినీ తీసుకొని బైక్‌పై తన అత్తగారి ఊరైన లింగరాజుపల్లికి బయలుదేరాడు.
గ్రామ సమీపంలోకి రాగానే వేగంగా వచ్చిన మరో బైక్ ఢీకొట్టింది. ప్రమాదంలో సాహితి అక్కడికక్కడే చనిపోగా.. స్వామి, శ్రీహర్ష తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు గాయపడిన వారిని గజ్వేల్ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. సాహితి తల్లి కావ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఇన్స్‌పెక్టర్ తెలిపారు.
లారీ ఢీకొని ఒకరు మృతి, మరొకరికి గాయాలు
జన్నారం రూరల్, వెలుగు : లారీ, బైక్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఓ యువకుడు చనిపోగా, మరొకరికి గాయాలు అయ్యాయి. ఈ ప్రమాదం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో మంగళవారం జరిగింది. ఎస్సై అనూష వివరాల ప్రకారం.. మండలంలోని సింగరాయిపేటకు చెందిన అడాయి మారుతి (25), అదే గ్రామానికి చెందిన కుమ్రం నాగరాజు జన్నారంలో పనిచేస్తున్నారు. మంగళవారం పనిలేకపోవడంతో బైక్‌పై ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో చింతగూడ – మహమ్మదాబాద్ గ్రామాల మధ్యకు రాగానే ఎదురుగా వచ్చిన లారీ బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదంలో మారుతి అక్కడికక్కడే చనిపోగా, నాగరాజుకు గాయాలయ్యాయి. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
