పాలమూరు ప్రాజెక్టును మూడేండ్లలో కంప్లీట్‌‌‌‌ చేస్తం.. 90 టీఎంసీలతోనే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తం: మంత్రి ఉత్తమ్

పాలమూరు ప్రాజెక్టును మూడేండ్లలో కంప్లీట్‌‌‌‌ చేస్తం.. 90 టీఎంసీలతోనే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తం: మంత్రి ఉత్తమ్
  • ఉమ్మడి ఏపీ కన్నా బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ హయాంలోనే ఏపీ జలదోపిడీ ఎక్కువైంది
  • జగన్‌‌‌‌తో అలయ్ బలయ్ చేసుకొని నీటి దోపిడీకి సహకరించిన్రు 
  • కమీషన్ల కోసం కాళేశ్వరాన్ని కట్టిన కేసీఆర్​.. ‘పాలమూరు’ను పక్కన పెట్టిండు
  • పాలమూరు ప్రాజెక్టు సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడమే పెద్దతప్పు
  • ప్రాజెక్టుకు ఇంకా 39 వేల ఎకరాల భూములు కావాలె.. 90% ఎక్కడ పూర్తయినట్టు?
  • ఖర్చు కూడా రూ.84 వేల కోట్లు దాటుతుంది
  • కృష్ణాలో 1050 టీఎంసీల్లో 763 టీఎంసీలకు కొట్లాడుతున్నం
  • బయట తోలుతీస్తమనేటోళ్లు.. అసెంబ్లీలో చర్చ నుంచి తప్పించుకున్నరని ఫైర్​
  • కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​

హైదరాబాద్, వెలుగు: పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును మూడేండ్లలో పూర్తి చేసి తీరుతామని ఇరిగేషన్‌‌‌‌ శాఖ మంత్రి ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ 90 టీఎంసీలతోనే ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కృష్ణా జలాల అంశంపై శనివారం అసెంబ్లీలో ఉత్తమ్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌రెడ్డి పవర్​పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. 

ఒక్క పాలమూరు-రంగారెడ్డినే కాకుండా.. కృష్ణా బేసిన్‌‌‌‌లోని అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు. 45+45 టీఎంసీలంటూ 2014లో కేసీఆర్​ ఇచ్చిన జీవో ఆధారంగానే ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. డ్రింకింగ్​ వాటర్​ కోసం 7.15 టీఎంసీలతోనే ప్రాజెక్టును నిర్మిస్తామంటూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ వాళ్లే సుప్రీంకోర్టులో కేసు వేశారని అన్నారు.

తమ ప్రభుత్వం ఫస్ట్​ ఫేజ్‌‌లో 45 టీఎంసీలు, సెకండ్​ ఫేజ్‌‌లో 45 టీఎంసీలతో ప్రాజెక్టును కడతామని కేంద్రానికి లేఖ రాసిందే తప్ప.. 45 టీఎంసీలే చాలంటూ చెప్పలేదని ఉత్తమ్​ చెప్పారు. పాలమూరు ప్రాజెక్టుకు 21 క్లియరెన్సులు రావాల్సి ఉండగా.. బీఆర్‌‌‌‌ఎస్​ హయాంలో వచ్చింది కేవలం 4 అనుమతులేనని, ఇంకా 17 అనుమతులు పెండింగ్‌‌లోనే ఉన్నాయన్నారు. 

తాము మాత్రం కచ్చితంగా ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతామన్నారు. కాగా, పోలవరం -నల్లమలసాగర్‌‌‌‌కు సెంట్రల్​ వాటర్​ కమిషన్​ (సీడబ్ల్యూసీ) అనుమతిచ్చిందనడం పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. అది సీడబ్ల్యూసీలోని ఒక వింగ్​.. మరో వింగ్‌‌కు రాసిన ఇంటర్​ డిపార్ట్‌‌మెంటల్​ కమ్యూనికేషన్​ మాత్రమేనని చెప్పారు. 

 బీఆర్ఎస్​ హయాంలోనే పెరిగిన జల దోపిడీ
కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును ప్రాధాన్యంగా నిర్మించిన గత బీఆర్‌‌‌‌ఎస్​ ప్రభుత్వం.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనపెట్టిందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు తీరని నష్టం చేసిందే గత బీఆర్‌‌‌‌ఎస్‌‌​ ప్రభుత్వమని  మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంతో పోలిస్తే తెలంగాణ వచ్చాక.. కేసీఆర్​ హయాంలోనే ఏపీ ఎక్కువగా కృష్ణా జలాల దోపిడీ చేసిందని చెప్పారు. 

ఉమ్మడి రాష్ట్రంలో శ్రీశైలం నుంచి   ఏపీ 730 టీఎంసీల జలాలను తరలిస్తే.. రాష్ట్రం వచ్చాక 2014 నుంచి 2023 వరకు 1200 టీఎంసీల చొప్పున అక్రమంగా తరలించుకుపోయిందని తెలిపారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, ఏపీకి 512 టీఎంసీలు ఇవ్వాలని సంతకాలు పెట్టొచ్చిన ఘనత బీఆర్​ఎస్​ వాళ్లకే దక్కిందన్నారు.

2014 నుంచి 2020 వరకు 66:34 రేషియోలో నీళ్ల వాటాకు ఒప్పుకున్నారని, 2020లో ట్రిబ్యునల్​ తీర్పు వచ్చేదాకా అవే కేటాయింపులను ఫాలో కావాలని పర్మినెంట్‌‌​ సంతకాలు చేసొచ్చారని అన్నారు.  రూ.95 వేల కోట్లు ఖర్చు పెట్టి గత బీఆర్ఎస్​ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, కృష్ణా జలాలకు సంబంధించి అత్యంత కీలకమైన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు మాత్రం అనుమతుల నుంచి నిధుల వరకూ అన్నీ ఆలస్యం చేసిందని ఫైర్​ అయ్యారు. 

2014కు ముందు ఏపీ శ్రీశైలం నుంచి రోజూ 4.47 టీఎంసీలను తరలించుకునే ప్రాజెక్టులను నిర్మిస్తే.. 2014లో బీఆర్​ఎస్​ అధికారంలోకి వచ్చాక ఏపీ ఏకంగా 13.17 టీఎంసీలకు కెపాసిటినీ పెంచుకుందన్నారు. రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ ప్రాజెక్టును కట్టేందుకు ఏపీ ప్రయత్నిస్తుంటే.. కేసీఆర్​ ప్రభుత్వం మౌనముద్ర వహించిందని మండిపడ్డారు. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాకే రాయలసీమ లిఫ్ట్​ ప్రాజెక్టును ఆపించామన్నారు. 

సోర్సు మార్చడమే చారిత్రక తప్పిదం
పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టును మార్చి బీఆర్‌‌‌‌ఎస్​ అతిపెద్ద తప్పు చేసిందని మంత్రి ఉత్తమ్​ విమర్శించారు. ‘‘పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టును 2013లో ఉమ్మడి ఏపీలోనే ప్రారంభించినం. జూరాల నుంచి నీళ్లు తీసుకునేలా జీవో ఇచ్చినం. కానీ, గత బీఆర్ఎస్‌‌ ప్రభుత్వం సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చి రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది. 

జూరాలను సోర్సుగా వాడుకుంటే.. రోజూ 2.8 టీఎంసీల చొప్పున 25 రోజుల పాటు 70 టీఎంసీల వరకు నీటిని తరలించే అవకాశం ఉండేది. 320 మీటర్ల ఎత్తు నుంచే నీటిని లిఫ్ట్​ చేసుకునే వెసులుబాటు ఉండేది. రూ.32,200 కోట్ల ఖర్చుతో మొత్తం ప్రాజెక్ట్​ పూర్తయ్యేది. 121 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్లను నిర్మించుకొని 10 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చే అవకాశం దక్కేది.

కానీ, గత బీఆర్‌‌‌‌ఎస్​ ప్రభుత్వం సోర్సును శ్రీశైలానికి మార్చడం ద్వారా రోజూ తరలించే నీటి కెపాసిటీ 1.5 టీఎంసీలకు తగ్గింది. కింది నుంచి 245 మీటర్ల ఎత్తు నుంచి నీటిని ఎత్తిపోయాల్సి వస్తుంది. అంటే ఎత్తు అదనంగా వంద మీటర్లు పెరిగింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.84,622 కోట్లకు చేరింది. రిజర్వాయర్ల కెపాసిటీ 68 టీఎంసీలకు తగ్గింది. అంత చేసినా 12.30 లక్షల ఎకరాల ఆయకట్టునే చూపించారు’’ అని ఉత్తమ్‌‌ విమర్శించారు. 

రూ.7,469.38 కోట్లు ఖర్చు చేస్తే.. కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు, కోయిల్​సాగర్​ లిఫ్ట్‌‌లు పూర్తయ్యేవని, 8.65 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవని.. ఆ ప్రాజెక్టులు పూర్తయితే ట్రిబ్యునల్‌‌లో గట్టిగా పోరాడేందుకు అవకాశం ఉండేదన్నారు. 

90 శాతం ఎక్కడ పూర్తి చేసిన్రు ?
పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 90 శాతం పూర్తి చేశామని బీఆర్ఎస్​ నేతలు చెప్పుకుంటున్నారని, కనీసం 35 శాతం పనులు కూడా చేయలేదని మంత్రి ఉత్తమ్​ మండిపడ్డారు. రోజూ 2 టీఎంసీలు తరలించే కాళేశ్వరం ప్రాజెక్టు కెపాసిటీని 3 టీఎంసీలకు పెంచిన గత బీఆర్‌‌‌‌ఎస్​ ప్రభుత్వం.. పాలమూరు –రంగారెడ్డి ప్రాజెక్టు కెపాసిటీని 1.5 టీఎంసీల నుంచి ఒక్క టీఎంసీకి తగ్గించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

పాలమూరు ప్రాజెక్టుకు బీఆర్‌‌‌‌ఎస్​ ఖర్చు చేసింది కేవలం రూ.26,262 కోట్లని చెప్పారు. అడ్మినిస్ట్రేటివ్​ అప్రూవల్​ రూ.35,200 కోట్లకు ఇస్తే.. డీపీఆర్​ సమర్పించే నాటికి ఖర్చు రూ.55,083 కోట్లకు పెరిగిందని తెలిపారు. 

ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలంటే ఇంకా 39 వేల ఎకరాల భూములను సేకరించాలన్నారు. అదంతా కావాలంటే మొత్తం ఖర్చు రూ.84 వేల కోట్లు దాటుతుందని చెప్పారు. అలాంటప్పుడు పాలమూరు పనులు 90 శాతం ఎక్కడ పూర్తయ్యాయని ప్రశ్నించారు. 2023 ఎన్నికలకు ముందు ఆదరాబాదరాగా ఒక్క పంపును ఆన్​చేసి.. తెల్లారే బంద్​పెట్టారని మండిపడ్డారు.

గత పదేండ్లలో గోదావరి బేసిన్‌‌లోని ప్రాజెక్టులపై కేసీఆర్​ ప్రభుత్వం రూ.1,25,527 కోట్లు ఖర్చు చేస్తే.. కృష్ణా బేసిన్‌‌లో కేవలం రూ.41,375.81 కోట్లే వ్యయం చేసిందన్నారు. కాళేశ్వరం అదనపు టీఎంసీ కోసమే ఏకంగా రూ.27,232 కోట్లను కేటాయించిందన్నారు. పాలమూరు ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్​ మోసం, దగా చేసిందని మండిపడ్డారు.

నీటిపై చర్చ అనగానే తప్పించుకున్నరు..
కృష్ణా నదీ జలాలపై అసెంబ్లీలో చర్చ అనగానే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ సభ్యులు తప్పించుకొని పోయారని మంత్రి ఉత్తమ్​ ఎద్దేవా చేశారు. బయట కూర్చుని తోలుతీస్తామని హెచ్చరించేటోళ్లు.. ఇక్కడకు వచ్చి మాత్రం సమాధానం చెప్పడం లేదని కేసీఆర్‌‌‌‌‌‌‌‌పై పరోక్ష విమర్శలు చేశారు. 

ప్రాజెక్టుల విషయంలో తెలివి తక్కువ పనులు చేసింది బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్​ వాళ్లేనని తెలిపారు. పిల్లల భవిష్యత్తును తాకట్టుపెట్టి.. ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేని తెలంగాణ ద్రోహులు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలని మండిపడ్డారు.

ఇంత ముఖ్యమైన చర్చ జరుగుతుంటే కూడా సభకు రాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కారానికి కేంద్రం వేసిన కమిటీపైనా ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని ఫైర్‌‌‌‌‌‌‌‌ అయ్యారు. జల వివాదాలను పరిష్కరించుకునేందుకు తాము ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధమేనని తేల్చి చెప్పారు. అదే సమయంలో రాష్ట్రానికి హక్కుగా రావాల్సిన ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు.

763 టీఎంసీల కోసం కొట్లాడుతున్నం
కృష్ణా జలాల్లో తెలంగాణకు 763 టీఎంసీల కోసం బ్రజేశ్​ ట్రిబ్యునల్‌‌లో ఫైట్​ చేస్తున్నామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. తాను వాదనలకు స్వయంగా హాజరయ్యానని చెప్పారు. గోదావరి డైవర్షన్స్‌‌లో వచ్చే 45 టీఎంసీలు సహా 2013 నవంబర్​ 29న బ్రజేశ్​ ట్రిబ్యునల్​ అదనపు కేటాయింపులు కలిపి 1050 టీఎంసీల్లో 71 శాతం నీళ్ల కోసం పోరాడుతున్నామని తెలిపారు. 

బచావత్​ ట్రిబ్యునల్​ అవార్డు తర్వాత ఉమ్మడి ఏపీలో పలు ప్రాజెక్టులను అప్పటి ప్రభుత్వం చేపట్టిందని గుర్తు చేశారు. తెలంగాణలో ఎస్‌‌ఎల్‌‌బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, పాలమూరు– రంగారెడ్డిలాంటి ప్రాజెక్టులను చేపట్టిందన్నారు.

ఏపీ రీజియన్‌‌లో తెలుగు గంగ ప్రాజెక్ట్​, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టును చేపట్టిందని చెప్పారు. మరోవైపు జూరాలలో కేటాయించిన 65.64 టీఎంసీల జలాలను ఏనాడూ పూర్తి స్థాయిలో వాడుకోలేదని తెలిపారు. సగటున వాడుకున్నది 41 టీఎంసీలేనన్నారు. 

అదే సమయంలో బీఆర్‌‌‌‌ఎస్​ హయాంలోనే పోతిరెడ్డిపాడు హెడ్​రెగ్యులేటర్​ కెపాసిటీ పెంపు, ఎస్‌‌ఆర్‌‌‌‌ఎంసీ లైనింగ్​, రాయలసీమ లిఫ్ట్‌‌లాంటి ప్రాజెక్టులను ఏపీ చేపట్టిందన్నారు. ‘బేసిన్లు లేవ్​.. భేషజాల్లేవ్’​ అనుకుంటూ 2019లో నాటి ఏపీ సీఎం జగన్‌‌తో ప్రగతిభవన్​లో అలయ్​బలయ్​ చేసుకున్నారని కేసీఆర్‌‌‌‌పై మండిపడ్డారు.