
- కృష్ణా జలాలను తరలించుకువెళ్లినా మాట్లాడలేదు
- తెలంగాణ నీటి వాటాను ఏపీకి కట్టబెట్టారు
- 1.81 లక్షల కోట్లతో కట్టిన కాళేశ్వరం కూలిపోయింది
- ఏడాదిలోగా ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులు పూర్తి
- రెండేండ్లలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును కంప్లీట్ చేస్తామని వెల్లడి
నాగర్ కర్నూల్, వెలుగు: కృష్ణాజలాలను అక్రమంగా ఏపీ తరలించుకెళ్లినా మాజీ సీఎం కేసీఆర్ పదేండ్లు కళ్లు మూసుకున్నారని.. అతని దుర్మార్గం వల్ల ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాలకు తీరని అన్యాయం జరిగిందని ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటాను వాడుకోలేక ఏపీకి కట్టబెట్టారని అన్నారు. కమీషన్ల కోసం కేసీఆర్, హరీశ్‌రావు కట్టిన ప్రాజెక్టులు ఎందుకు పనికి రాకుండా పోయాయని, రాష్ట్రానికి లక్షల కోట్ల అప్పు మిగిలిందని ధ్వజమెత్తారు.
గురువారం నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో పాలమూరు,- రంగారెడ్డి ప్రాజెక్ట్ పంపుహౌస్‌లు, రిజర్వాయర్లు, కెనాల్ పనులను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి ఆయన పరిశీలించారు. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ప్రాజెక్టులోని ఎల్లూరు లిఫ్ట్‌ను సందర్శించారు. ఆ తర్వాత కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో సాగునీటి రంగం విధ్వంసానికి గురైందని, నీటివాటాలను వదిలేయడంతోపాటు నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన విమర్శించారు. మొత్తం 811 టీఎంసీల కృష్ణా జలాల్లో 512 టీఎంసీలు కేటాయించగా.. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని కేసీఆర్, హరీశ్ రావు రాతపూర్వకంగా అంగీకరించారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బ్రిజేశ్ ట్రిబ్యునల్ముందు రాష్ట్ర అభ్యంతరాలను ఉంచామని, 70 శాతం వాటా తెలంగాణకు కేటాయించాలని డిమాండ్చేసినట్టు చెప్పారు. కృష్ణా జలాలను అక్రమంగా తరలించుకు వెళ్లేందుకు ఏపీ పలు ప్రాజెక్టులు కట్టినా కేసీఆర్ నోరు మెదపలేదని, పోతిరెడ్డిపాడు, మల్యాల ప్రాజెక్టుల సామర్థ్యాన్నీ రెండింతలకు పెంచినా పట్టించుకోలేదన్నారు. కృష్ణానదిపై టెలీమెట్రీలు పెట్టకుండా పదేండ్లు గడిపారని, తమ ప్రభుత్వం ఈ విషయంలో కేఆర్ఎంబీపై ఒత్తిడి పెంచిందన్నారు. టెలీమెట్రీల వ్యయాన్ని భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.
కాళేశ్వరం అవినీతితో ప్రాజెక్టులపై ప్రభావం
రూ.38వేల కోట్ల అంచనా వ్యయంతో తుమ్మడిహెట్టి దగ్గర నిర్మించాల్సిన ప్రాణహిత- చేవేళ్ల ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా మరోచోటికి మార్చారని ఉత్తమ్ ఆరోపించారు. కమీషన్ల కక్కుర్తితో ప్రాజెక్టును సర్వనాశనం చేశారన్నారు. అధిక వడ్డీలకు అప్పు తెచ్చి రూ.1.81 లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, ఆ వడ్డీలు కట్టలేక ఇప్పుడు సతమతమవుతున్నామన్నారు. కేసీఆర్, హరీశ్అవినీతి వల్ల రూ.70వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందన్నారు. ఆ డబ్బు సక్రమంగా ఖర్చు చేసి ఉంటే దేవాదుల, సీతారామ, ఎస్ఎల్బీసీ, నెట్టెంపాడు, భీమా, కల్వకుర్తి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులు పూర్తయ్యేవని అన్నారు.
పాలమూరు,-రంగారెడ్డి ప్రాజెక్టుకు పదేండ్లలో రూ.27,500 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరానికి కూడా నీరివ్వలేదన్నారు. ఈ ప్రాజెక్టులో మానవ, సాంకేతిక తప్పిదాలకు తావు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయాలని ఆఫీసర్లకు సూచించినట్లు తెలిపారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లోపల గల్లంతైన ఆరుగురి ఆచూకీ కోసం అన్ని ప్రయత్నాలు చేశామని, జీఎస్ఐ సూచనలతో డేంజర్‌జోన్‌లో పనులు నిలిపివేశామని తెలిపారు. ఆరుగురి కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున సాయాన్ని అందించామన్నారు.
ప్రాజెక్టుల పనులు వేగవంతం
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని కేఎల్ఐ, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను ఏడాదిలోగా పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టును రెండేండ్లలో పూర్తి చేయాలని నిర్ణయించామన్నారు. ఉదండాపూర్ వరకు సాగునీరు చేరేలా పనులను వేగవంతం చేస్తామన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్ట్ సాగు విస్తీర్ణంపై ప్రభావం పడకుండా డిండి లిఫ్ట్‌కు నీటిని తరలిస్తామన్నారు. అంతకు ముందు నార్లాపూర్, ఏదుల, వట్టెం పంప్‌హౌజ్, రిజర్వాయర్, మెయిన్ కెనాల్, హెడ్‌రెగ్యులేటర్ పనులను పరిశీలించారు.
నార్లాపూర్‌లో సబ్ స్టేషన్ లేకుండా డ్రై రన్ ఎలా చేశారని మంత్రి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. భూ సేకరణ, ఆర్అండ్ఆర్ అంశాలపై చర్చించారు. మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, ఎమ్మెల్సీ కె. దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రాజేశ్‌రెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి, లిఫ్ట్ ఇరిగేషన్ అడ్వైజర్ పెంటారెడ్డి, ఈఎన్సీ, సీఈలు, కలెక్టర్లు బాదావత్ సంతోష్, ఆదర్శ్‌సురభి పాల్గొన్నారు.