రాబోయే ఐదేండ్లలో 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు

రాబోయే ఐదేండ్లలో 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు
  •     సీఎం, మంత్రుల నిర్ణయమిదే...
  •     పెండింగ్​ ప్రాజెక్టులకే  అధిక ప్రాధాన్యత  
  •     నల్గొండలో పాత, కొత్త ప్రాజెక్టులు, 
  •     లిఫ్ట్​ స్కీంలు కంప్లీట్​ చేస్తాం 
  •     మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి

నల్గొండ, వెలుగు : ఐదేండ్లలో రాష్ట్రంలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించబోతున్నామని ఇరిగేషన్ ​మినిస్టర్ ​నలమాద ఉత్తమ్​కుమార్​రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆర్​అండ్​బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీనియర్ ​నేత జానారెడ్డి, ఎమ్మెల్యేలు బాలూ నాయక్​, బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ తీన్మార్​మల్లన్నతో కలిసి సాగర్​ఎడమ కాల్వకు, లో లెవెల్ ​కెనాల్​కు నీటి విడుదల చేశారు. తర్వాత మంత్రి ఉత్తమ్​ మీడియాతో మాట్లాడుతూ...ప్రతి ఏడాది 6 నుంచి 6.50 లక్షల ఎకరాల చొప్పున ఐదేండ్లలో 30 నుంచి 35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు స్థీరీకరించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం రేవంత్​రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులంతా కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఈ ఏడాది బడ్జెట్​లో సాగునీటి రంగానికి కేటాయించిన రూ.22 వేల కోట్లలో రూ.10,828 కోట్లు పెండింగ్ ​ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఖర్చు పెడతామన్నారు. మిగితా11 వేల కోట్లు ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులు, వడ్డీలు, ఎస్టాబ్లిష్​మ్మెంట్​ఖర్చుల కోసం కేటాయించామన్నారు.

బీఆర్ఎస్​ఒక్క ఎకరాకు నీళ్లివ్వలే.. 

పదేండ్లలో బీఆర్ఎస్ ప్రాజెక్టుల పేరుతో రూ.లక్షా 81 వేల కోట్లు ఖర్చుపెట్టి నామమాత్రపు ఆయకట్టు మాత్రమే క్రియేట్​ చేసిందని మంత్రి ఉత్తమ్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.98 వేల కోట్లు ఖర్చు పెట్టి 98 ఎకరాలు కూడా సాగులోకి తీసుకరాలేదన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు రూ.31 వేల కోట్లు ఖర్చు పెడితే ఒక్క ఎకరా ఆయకట్టు కూడా సృష్టించలేదని విమర్శించారు. సీతారామా సాగర్​ ప్రాజెక్టుకు రూ.8 వేల కోట్లు ఖర్చు పెట్టి కూడా ఒక్క ఎకరాకూ  నీళ్లివ్వలేదన్నారు. మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా నాసిరకంగా నిర్మించారని, నిపుణుల కమిటీ సైతం అదే తేల్చిందన్నారు.  

కాంగ్రెస్ రాగానే కాలం వచ్చింది...

కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాలం వచ్చిందని, చాలా గ్యాప్ తర్వాత నాగార్జునసాగర్ నుంచి నీళ్లు వదలిపెట్టడం ఇదే తొలిసారి కాగా, పదేండ్లలో ఇంత ఎర్లీగా సాగర్ ​నీళ్లు ఎప్పుడూ వద లిపెట్టలేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు. నల్గొండ, ఖమ్మం జిల్లా, ఏపీలో ఆయకట్టుకు కుడి, ఎడమ కాల్వల ద్వారా నీళ్లిస్తామని, కాల్వల పొడవునా ఉన్న చెరువులు, కుంటలను నింపుతామన్నారు. వారం రోజుల్లో సాగర్​ రిజర్వాయర్ ​పూర్తిగా నిండే అవకాశం ఉందన్నారు.  

ఉమ్మడి జిల్లా ప్రాజెక్టులకు టాప్​ప్రియార్టీ...

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్​లో ఉన్న సాగు, తాగునీటి ప్రాజెక్టులకు టాప్​ ప్రియార్టీ ఇస్తామని, ఐదేండ్లలో ఎస్ఎల్బీసీ, బ్రహ్మణ వెల్లంల, ఏఎమ్మార్పీ లైనింగ్​పనులు, డిండి లిఫ్ట్​ఇరిగేషన్, ​గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాగార్జునసాగర్​, దేవరకొండ, మిర్యాలగూడ, నల్గొండ, హుజూర్​నగర్​, కోదాడ నియోజకవర్గాల్లో పాత, కొత్త ప్రాజెక్టులతో పాటు, నెల్లికల్లుతో సహా అన్ని లిఫ్ట్ ​ఇరిగేషన్ స్కీంలు పూర్తిచేస్తామన్నారు. గంధమల్ల రిజర్వాయర్​ 1.5 టీఎంసీకి తగ్గించి, మళ్లీ టెండర్లు పిలుస్తామని, ఆ పనులు కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్​ తెలిపారు. 

నాగార్జునసాగర్​లో పెరుగుతున్న ఇన్​ఫ్లో 

నాగార్జునసాగర్ ​ప్రాజెక్టులోకి భారీగా వరద వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ ​పూర్తిస్తాయిలో నిండండంతో 10 గేట్లు 20 ఫీట్ల మేర ఎత్తి 5,51,500 క్యూసెక్కులను సాగర్​లోకి వదులుతున్నారు. సాగర్​ పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా, శుక్రవారం సాయంత్రం వరకు 550.89 అడుగులకు చేరింది. ఎడమ కాల్వకు 778 క్యూసెక్కులు, కుడికాల్వకు 5,292 క్యూసెక్కుల, ఎస్ఎల్బీసీకి 1650 క్యూసెక్కులు, మెయిన్​పవర్​ద్వారా 23,744 క్యూసెక్కుల విడుదల చేస్తున్నారు. శ్రీశైలం నుంచి 4,61,792 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తుండగా, 3,14,464 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. ఇదే వరద కొనసాగితే నాలుగైదు రోజుల్లోనే సాగర్​ పూర్తిస్థాయిలో నిండే అవకాశముందని ఇరిగేషన్​ఆఫీసర్లు చెప్పారు. 

మూడేండ్లలో ప్రాజెక్టులు పూర్తి చేస్తాం : మంత్రి కోమటిరెడ్డి

మూడేండ్లలో శ్రీశైల సొరంగ మార్గం ప్రాజెక్టు కంప్లీట్​ చేస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. గ్రావిటీ ద్వారా నీళ్లందించే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును జానారెడ్డి పట్టుబట్టి సాధించారని, అంజయ్య సీఎంగా ఉన్నప్పుడు ఈ ప్రాజెక్టు ప్రారంభించారని, తర్వాత కాంగ్రెస్​ హయాంలో పనులు చేపట్టామన్నారు. కానీ, గత బీఆర్ఎస్​ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పదేండ్ల నుంచి పనులు నిలిచిపోయాయని చెప్పారు.

గంధమల్ల రిజర్వాయర్​ కోసం ఎంపీగా ఉన్నప్పుడు గత ప్రభుత్వంలో ఎంత కొట్లాడినా పట్టించుకోలేదని, కానీ, ఇప్పుడు ఉత్తమ్​దాన్ని కూడా పూర్తిచేస్తామని చెప్పడం సంతోషాన్నిస్తోందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులు, రోడ్లు యుద్ధప్రాతిపాదికన పూర్తిచేస్తామని, గురువర్యులు, సీనియర్​ నేత జానారెడ్డి సూచన మేరకు తెలంగాణలో జిల్లాను అగ్రస్థానంలో నిలబెడ్తామన్నారు.  కలెక్టర్​ సి.నారాయణ రెడ్డి, ఇరిగేషన్​ ప్రిన్సిపాల్​ సెక్రటరీ రాహుల్ ​బొజ్జా పాల్గొన్నారు.