యువతకు AI.. ప్రమాదమా లేదా అవకాశమా ?

యువతకు AI.. ప్రమాదమా లేదా అవకాశమా ?

ఒకప్పుడు మనిషికి మనిషే పోటీగా ఉండేది. కానీ,  వేగంగా సాంకేతికత అభివృద్ధి చెందుతున్న ఈ పోటీ ప్రపంచంలో మానవునికి పోటీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్ రూపంలో  ఏర్పడుతోంది. రోజురోజుకీ ప్రపంచం నలుమూలల తన హవాను విస్తరించుకుపోతున్నది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకప్పుడు ఏఐ కేవలం ఐటి రంగానికే  పరిమితమైనప్పటికి,  నేడు బ్యాంకింగ్, కన్సల్టింగ్ ఇలా అన్ని రంగాలలో తన ప్రాధాన్యతను సంతరించుకున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు.

హైదరాబాద్​లాంటి మహానగరాలు టెక్నాలజీ  హబ్​లుగా రూపాంతరం చెందుతున్న తరుణంలో  ఏఐ ప్రభావం తెలుగు రాష్ట్రాల విద్యార్థులు, ఉద్యోగులపై  భారీగా పడుతుండడం ఒక చర్చనీయాంశంగా మారిపోయింది.  మనుషులు  చేసే రొటీన్  కోడింగ్,  డేటా ఎంట్రీ,  టెలీ మార్కెటింగ్ లాంటి పనులు ఏఐ తక్కువ వ్యవధిలో పూర్తిచేసి పెడుతుంది. 

లావాదేవీల పర్యవేక్షణ  
కన్సల్టింగ్ రంగంలో  నివేదికల తయారీ లాంటి  పనులను సైతం సెకన్ల వ్యవధిలో  జరిగిపోతుండడంతో మధ్య నుంచి దిగువ స్థాయి ఉద్యోగులలో ఉద్యోగ భద్రతకి సంబంధించి ఆందోళన మొదలైంది.  కానీ ఇక్కడ ఏఐ అంటే మనిషికి ప్రత్యామ్నాయంగా వచ్చిన శక్తిగా కాకుండా మనిషి పని సామర్థ్యాన్ని పెంచే ఒక సాధనంగా గుర్తించాలి. 

అయితే  ఏఐ అనేది రానున్న రోజులలో తన ప్రాధాన్యతను ఇంకా పెంచుకునే ఆస్కారం ఉన్నందున తెలుగు రాష్ట్రాల యువత తమ చదువును డిగ్రీ పట్టాలకే పరిమితం చేయకుండా పరిశ్రమలు,  సాంకేతికత  అవసరాలకనుగుణంగా తమ నైపుణ్యాలను పెంపొందించుకుంటేనే ఉద్యోగ భద్రతను ఆశించవచ్చు.

ఏఐ వల్ల  ఉద్యోగాల రూపాలు మారవచ్చు. కానీ కొత్త  అవకాశాలు కూడా పెరుగుతాయి.  ఇందుకోసం నిరంతర అభ్యాసం, స్వీయ అభివృద్ధిలాంటివి అలవాటు చేసుకోవాలి.  ప్రభుత్వం,  విద్యాసంస్థలు విద్యావిధానాన్ని కేవలం థియరీకే పరిమితం చేయకుండా ఏఐ ఆధారిత కరిక్యులంని  ప్రవేశపెట్టాలి.  అవసరమైన చోట  శిక్షణ కార్యక్రమాలను చేపట్టాలి.

కొత్త సవాళ్లు - అవకాశాలు 
ఐటి, సాఫ్ట్​వేర్ రంగాలలో గతంలో డెవలపర్లు రోజంతా చేసే కోడింగ్ పనులను,  ఇప్పుడు 'కో- పైలట్' వంటి ఏఐ టూల్స్ నిమిషాల్లో చేస్తున్నాయి. దీని వల్ల 'కోడర్ల' అవసరం తగ్గవచ్చు, కానీ సిస్టమ్ ఆర్కిటెక్ట్స్, 'ఏఐ ఎథిక్స్ నిపుణుల'కు డిమాండ్ పెరుగుతుంది. 

బ్యాంకింగ్,  ఫైనాన్స్ రంగాలలో ఏఐ అల్గారిథమ్స్​తో  రుణం ఇచ్చేముందు  కస్టమర్  క్రెడిట్ స్కోరును,  రిస్కును  మరింత కచ్చితంగా అంచనా వేయడం జరుగుతుంది.  తెలుగు రాష్ట్రాల్లోని బ్యాంకింగ్ ఉద్యోగులు ఇప్పుడు డేటా విశ్లేషణ వైపు దృష్టి  మళ్లించాల్సిన అవసరం ఉంది.

కన్సల్టింగ్,  మార్కెటింగ్  రంగాలలో  మార్కెట్ ట్రెండ్స్,  కస్టమర్ ప్రవర్తనను ఏఐ ద్వారా  విశ్లేషణ చేయడం వల్ల  తెలుగులో కంటెంట్ మార్కెటింగ్  చేస్తున్నవారికి, ఏఐ టూల్స్ ద్వారా భాషాపరమైన లోపాలు లేని కంటెంట్‌ను సృష్టించడం ఇప్పుడు సులభం.

అయితే  మన  విద్యా వ్యవస్థలో తరగతి గదిలో నేర్చుకుంటున్న పాఠాలకు, పరిశ్రమల్లో వాడుతున్న అధునాతన టెక్నాలజీకి మధ్య భారీ వ్యత్యాసం ఉండడంతో  స్కిల్ గ్యాప్ అనేది  ఒక సవాలని  చెప్పవచ్చు.   ఏఐపై అతిగా ఆధారపడటం వల్ల మనిషిలో  వైవిధ్యంగా  ఆలోచించే  శక్తి తగ్గే  ప్రమాదం ఉండటం ఇంకో సవాలు.

ఏఐని ఒక అవకాశంగా భావించాలి
ఏఐ ఇచ్చిన సమాచారంలో  నాణ్యతను కూడా సరిచూసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి.  మనతో పాటు జీవిస్తున్న ఏఐని ఒక అవకాశంగా  భావించి  కనీసం ప్రతి ఆరు నెలలకు మార్కెట్ లోకి  వచ్చిన  ఒక కొత్త టూల్ లేదా టెక్నాలజీ నేర్చుకునేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. 

ఏఐని ఒక  ప్రత్యర్థిగా  కాకుండా ఒక వ్యక్తిగత  సహాయకునిగా చూడాలి.  నిత్యంచేసే  రిపిటేటివ్  పనులను ఏఐ ద్వారా నిర్వర్తిస్తూ మిగిలిన సమయాన్ని వ్యూహాత్మక ఆలోచనాలకు  వెచ్చించాలి.  ఏఐ తన సామర్థ్యాన్ని ఎంత విస్తరించినప్పటికీ యంత్రాలకు ఎమోషన్స్ ఉండవనే విషయాన్ని దృష్టిలో  పెట్టుకోవాలి.

కావున యంత్రాల ద్వారా చేయలేని పనులైన జట్టు నిర్వహణ,  క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం,  నాయకత్వ లక్షణాలు మొదలగు సామర్థ్యాలను అలవర్చుకోవాలి.  పాఠశాల,  కళాశాల స్థాయిలోనే ప్రాథమిక ఏఐ నైపుణ్యాలను పాఠ్యాంశాల్లో  చేర్చేవిధంగా చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారు తక్కువ  ఖర్చుతో  అప్‌డేట్ చేసుకోవడానికి ప్రభుత్వం, పరిశ్రమలు కలిసి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి 
రొటీన్ పనులు చేసే డేటా ఎంట్రీ ఆపరేటర్లు, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌లు,  కొంతవరకు ఐటీ టెస్టింగ్ విభాగాల్లో ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉంది. దీనితో మధ్యతరగతి ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరగవచ్చు. ఏఐ పనిచేయడానికి డేటా వ్యక్తిగత వివరాల నుంచి లభ్యం కావడంతో వ్యక్తిగత  గోప్యత ప్రమాదంలో పడుతోంది.

అలాగే ఏఐని ఉపయోగించి తయారు చేసే డీప్‌ఫేక్స్ కూడా సమస్యలను సృష్టించవచ్చు. కావున సాంకేతికతను అభివృద్ధి చేసే క్రమంలో,  మానవ  విలువలు,  నైతికతకు భంగం వాటిల్లవచ్చు. చివరగా, టెక్నాలజీ మారుతున్నకొద్దీ మనం కూడా మారాలి.

ఏఐని చూసి భయపడకుండా దానిని ఒక ఆయుధంగా మలచుకొని, తెలుగు రాష్ట్రాల యువత ప్రపంచ స్థాయిలో రాణించేలా సిద్ధం కావాలి. ఆ మార్పు వైపు అడుగులు వేయడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం. సముద్రంలో అల వచ్చినప్పుడు మనం ఆందోళన చెందితే  మునిగిపోతాం, అదే సరైన బోటును సిద్ధం చేసుకుంటే అల పైనే ప్రయాణించి ముందుకు వెళ్తాం. 

తెలుగు రాష్ట్రాల  యువత ఏఐని ఒక సముద్రపు అలలాగ భావించి  తమలోని సృజనాత్మకతకు విచక్షణను జోడించి, ఏఐతో కలిసి అడుగులు వేయడం ద్వారా ఒక అద్భుతమైన భవిష్యత్తును  నిర్మించుకోవచ్చు.

డా. ఎండి ఖ్వాజా మొయినుద్దీన్