‘కేసులు నిలుస్తాయని పెట్టరు..కేసులు నిలవాలని పెట్టరు..కేసుల కోసమే కేసులు పెడ్తారు..మనిషిని లొంగదీయడానికి పెడ్తారు’. ఇవి ‘ఒక్క కేసు చాలు’ అన్న నా కవితా ఖండికలోని చరణాలు. కోర్టుల్లో చాలా కేసులు నిలవవు. కేసుల్లో బలం లేకపోయినా సరైన ఆధారాలు లేకుండా పోలీసులు కేసులని పెడుతుంటారు. దానికి కారణాలెన్నో. ఫిర్యాదుదారుల నుంచి ఒత్తిడి, రాజకీయ నాయకుల నుంచి ఒత్తిడి, ప్రజల నుంచి ఒత్తిడి కూడా కారణం కావొచ్చు. కారణాలు ఏవి ఉన్నా అలా కోర్టుల్లో నిలవని కేసులని పెట్టకూడదు. సుప్రీంకోర్టు కూడా ఇదే అభిప్రాయాన్ని మహిన్ కుమార్ బిస్వాస్@ బుంబా వర్సెస్ ది స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కేసులో వ్యక్తం చేసింది. బలమైన అనుమానాలు లేకుండా కేసు దాఖలు చేయడం వల్ల కోర్టుల్లో అనవసర పనిభారం పెరుగుతుందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఈ తీర్పుని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్మన్మోహన్, జస్టిస్ కోటీశ్వర్సింగ్లు డిసెంబర్ 2, 2025న వెలువరించారు. మహిన్ కుమార్ దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్‌ను ట్రయల్ కోర్టు, అదేవిధంగా హైకోర్టు కొట్టి వేశాయి. ఈ తీర్పుకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ముందు అప్పీలును దాఖలు చేశాడు. కేసు విషయాల్లోకి వస్తే మిస్ మమతా అగర్వాల్ అమలేందు బిస్వాస్ దగ్గర ఆస్తిని కిరాయికి తీసుకుంది. ఆమె, ఆమె స్నేహితురాలు అదేవిధంగా ఓ పనివాడిని మహిన్ కుమార్ ఆ ఆస్తిలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నాడని, బెదిరించాడని అదేవిధంగా తన అనుమతి లేకుండా తన ఫొటోలు, వీడియో తీసి తన గోప్యతలోకి చొరబడ్డాడని ఆమె ఫిర్యాదు చేసింది. దర్యాప్తు పూర్తిచేసి నిందితుడిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్లు 344, 354 సి, 506 కింద చార్జ్‌షీట్‌ను దాఖలు చేశారు పోలీసులు.
సాక్ష్యాలు ద్వారా శిక్ష
న్యాయపాలన ఉన్న దేశంలో సేకరించిన సాక్ష్యాలు ద్వారా శిక్ష పడటానికి అవకాశం ఉండాలన్న విషయం కూడా పోలీసులు గమనించి చార్జిషీటు దాఖలు చేయాలని కోర్టు అభిప్రాయపడింది. నేరారోపణలను కోర్టు నమోదు చేసే క్రమంలో కూడా ఈ విషయాలను కోర్టులు పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థ పరిగణనలోకి తీసుకోవాలని కోర్టు అభిప్రాయపడింది. న్యాయవ్యవస్థ సమగ్రతను కాపాడటానికి బలమైన ఆధారాలు, అనుమానాలు ఉన్న కేసులను మాత్రమే అధికారిక విచారణకి వెళ్లేవిధంగా చూడాలి. ఫిల్టర్లాగ వ్యవహరించాలి. బలమైన అనుమానం లేని కేసుల్లో చార్జిషీట్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృథా చేయకూడదని, బలమైన కేసుల విచారణకి అవి అవరోధంగా మారకూడదని కోర్టు అభిప్రాయపడింది. ఇది చార్జిషీట్ దాఖలు చేసే సమయంలో పోలీసులు గమనించాల్సింది. అదేవిధంగా నేరారోపణలని నమోదు చేసే సమయంలో కోర్టులు కూడా జాగరూకతతో ఉండాలి. గతంలో తప్పుడు శిక్షలు పడిన వ్యక్తులకి, తప్పుడు అరెస్టు చేసిన వ్యక్తులకి నష్టపరిహారం చెల్లించే విషయాన్ని సుప్రీంకోర్టు కట్ట వెల్లామ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు కేసులో పరిశీలించింది.
తప్పుడు అరెస్టు, తప్పుడు శిక్షల్లో నష్టపరిహారం
తప్పుగా అరెస్టయినా, విచారణ చేసినా, దోషులుగా నిర్ధారించిన వ్యక్తులకు నష్టపరిహారం చెల్లించేవిధంగా చర్యలు తీసుకోవడం అవశ్యమని సుప్రీంకోర్టు కట్ట వెల్లామ్ కేసులో అభిప్రాయపడింది. ఈ నష్టపరిహారం రాజ్యం చెల్లించాలా వద్దా అనే ప్రశ్నని సుప్రీంకోర్టు ఈ కేసులో పరిశీలించింది. అనేకమంది నిందితులను బలిపశువులుగా మార్చినా చివరికి నిర్దోషులుగా విడుదలవుతున్నారు. తప్పుడు సాక్ష్యాలుతో తయారుచేసిన క్రిమినల్ కేసులో 12 సంవత్సరాలుగా ఒక వ్యక్తి జైలులో ఉండటాన్ని సుప్రీంకోర్టు ఈ కేసులో గమనించింది. మైనర్‌పై అత్యాచారం, హత్య చేశాడని వాళ్లపై ఉన్న ఆరోపణ. అందులో ఆరుగురి పైన మరణ శిక్ష ఉంది. దాని నీడలో వాళ్లున్నారు. అందులో ఒకరి మరణ శిక్షని సుప్రీంకోర్టు రద్దు చేసింది. అతనిపై ఉన్న సాక్ష్యాలన్నీ పోలీసులు తయారుచేసినవని కోర్టు అభిప్రాయపడింది. తన ప్రాథమిక హక్కులకి భంగం కలిగించారని, తమకు నష్టపరిహారం చెల్లించాలని అతను సుప్రీంకోర్టుని కోరినాడు. అతని అరెస్టు చేసింది 2013లో. థానే సెషన్స్‌కోర్టు మరణశిక్షను విధించింది 2019లో, 2025లో సుప్రీంకోర్టు అతని మరణశిక్షను రద్దు చేసింది. తనను తప్పుగా జైలులో ఉంచడం ద్వారా రాజ్యాంగం తనకు ప్రసాదించిన జీవించే హక్కుకి భంగం కలిగిందని అతను సుప్రీంకోర్టు ముందు వాదించాడు.
నిలిచే కేసులనే పెట్టాలి
ఆర్టికల్ 21 ప్రకారం రాజ్యాంగం ప్రసాదించిన హక్కులకు భంగం వాటిల్లిందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అతను దారుణమైన నేరాలకు పాల్పడినట్టు తప్పుడు ఆరోపణలు, చట్టవిరుద్ధంగా అరెస్టు చేయడం జరిగింది. అందుకని అతను నష్టపరిహారానికి అర్హుడే. రాజ్యం దాని అధికారులు చేసిన దుష్ప్రవర్తనకు రాజ్యం బాధ్యత వహించాలి. పిటిషనర్ తరఫున హాజరైన న్యాయవాదులు కూడా ఇలాంటి వ్యక్తుల కోసం నష్టపరిహారం చెల్లించేవిధంగా మార్గదర్శకాలను రూపొందించాలని సుప్రీంకోర్టును కోరారు. 2018లో లా కమిషన్ కూడా ఈ విషయాన్ని ప్రస్తావించింది. సుప్రీంకోర్టు ఈ విషయంలో మార్గదర్శకాలను ఏర్పరచాలని ఈ కేసులో నిర్ణయించింది. కేసులో బలం లేనప్పుడు శిక్షపడే అవకాశం లేనప్పుడు కేసులు దాఖలు చేయడం ఎంత తప్పో, అలాంటి కేసుల్లో శిక్షలు వేయడం అంతకన్నా పెద్ద తప్పు. ఈ రెండు తీర్పులు క్రిమినల్ కేసు దర్యాప్తులో, విచారణలో ప్రధాన పాత్ర పోషిస్తాయని అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, ఇది అమలుకావడానికి ఎంత సమయం పడుతుందన్న విషయంలో స్పష్టత లేదు. కేసులు నిలుస్తాయనే పెట్టాలి. నిలిచే కేసులనే పెట్టాలి. కేసుల కోసం మాత్రమే పెట్టడం మానెయ్యాలి. తప్పుడు కేసులకి నష్టపరిహారం సాధ్యమైతే ఈ తప్పుడు కేసులు పెట్టడానికి పోలీసులు జంకుతారు.
చార్జిషీట్లు దాఖలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి
ఆ తరువాత మహిన్కుమార్ కోర్టులో డిశ్చార్జ్ దరఖాస్తుని దాఖలు చేశాడు. ట్రయల్ కోర్టు, కలకత్తా హైకోర్టు ఆ దరఖాస్తుని తోసిపుచ్చాయి. అయితే, 354 సి ప్రకారం ఉండాల్సిన ఆధారాలు లేవని హైకోర్టు న్యాయమూర్తి అభిప్రాయపడినాడు. ఆమెను బెదిరించినట్టు, ఆమెను గాయపరిచినట్టు, ఆమె గౌరవానికి భంగం కలిగినట్టు కూడా ఎలాంటి ఆధారాలు లేవు. తన ఫొటోలు ముద్దాయి తీశాడన్న ఆరోపణలు తప్ప కేసులో ఎలాంటి ఆధారాల్లేవు. తమ ఆరోపణలని బలపరిచేవిధంగా ఫిర్యాదుదారు ఆమె అనుచరులు పోలీసులకి ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏ రకంగా చూసినా ఆ కేసులోని సెక్షన్లను బలపరచడానికి ఎలాంటి ఆధారాలు లేవు. నిజానికి ఆమె ఆ ఆస్తిని కిరాయికి తీసుకుందామని అనుకుంది. కానీ, ఇంకా కిరాయికి తీసుకోలేదు. ఆమె కిరాయిదారు అని చెప్పడానికి ఎలాంటి డాక్యుమెంట్లను ప్రాసిక్యూషన్ దాఖలు చేయలేదు. దానికి భిన్నంగా ఆ ఆస్తి యజమాని ముద్దాయి తండ్రి ప్రకారం ఆమె కిరాయిదారు కాదు. ఈ కారణాలను పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈ కేసు నుంచి అతడిని డిశ్చార్జ్ చేసింది. డిశ్చార్జ్ చేస్తూ కోర్టు ఈ పరిశీలనను చేసింది. పార్టీల మధ్య సివిల్ వివాదాలు ఉన్నప్పుడు, అవి పెండింగ్‌లో ఉన్నప్పుడు, పోలీసులు చార్జిషీట్లు దాఖలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని కోర్టు నొక్కి చెప్పింది.
- డా. మంగారి రాజేందర్
జిల్లా జడ్జి (రిటైర్డ్)

