
నాగ్‌పూర్ : ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ నేపథ్యంలో ఇండియా చివరి సన్నాహాక సిరీస్‌లోకి అడుగుపెట్టింది. ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా గురువారం తొలి మ్యాచ్ జరగనుంది. అనుభవజ్ఞులైన స్టార్ ప్లేయర్ల ఫామ్, ఫిట్‌నెస్‌తో పాటు నిర్దిష్టమైన ప్లేస్‌కు సరిపోయే ప్లేయర్ల ఎంపికపై దృష్టి సారించనుంది. తద్వారా టీమ్ బ్యాలెన్స్‌ను కాపాడటంతో పాటు సరైన జట్టుతో ‘చాంపియన్స్’లో బరిలోకి దిగాలని భావిస్తోంది.
రెడ్ బాల్ క్రికెట్‌లో ఘోరంగా నిరాశపర్చిన కెప్టెన్ రోహిత్, కోహ్లీ ఫామ్‌పై సర్వత్రా ఆందోళన నెలకొన్న నేపథ్యంలో వీళ్లు ఎలా ఆడతారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. రంజీల్లోనూ ఈ ఇద్దరు నిరాశపర్చడంతో వీళ్లపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. 2023 వరల్డ్ కప్‌లో కోహ్లీ (765), రోహిత్ (597) టాప్ స్కోరర్లుగా ఉన్నారు. కానీ అప్పట్నించి ఆ స్థాయిలో మళ్లీ ఆడిన దాఖలాల్లేవు.
పంత్ X రాహుల్
చాంపియన్స్ నేపథ్యంలో టీమ్ తుది కూర్పుపై కూడా భారీ కసరత్తులు జరుగుతున్నాయి. టాప్–3లో రోహిత్, గిల్, కోహ్లీ ప్లేస్‌లకు ఢోకా లేదు. ఐదో నంబర్‌లో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్‌గా రిషబ్ పంత్, రాహుల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. 2023 వరల్డ్ కప్‌లో పంత్ లేనప్పుడు రాహుల్ మిడిలార్డర్ భారాన్ని మోశాడు. ఏకంగా 452 రన్స్‌తో సూపర్ ఫామ్ చూపెట్టాడు. టాప్, లోయర్ ఆర్డర్‌కు మధ్య మంచి వారధిగా కనిపించాడు. కానీ మిడిల్ ఓవర్స్‌లో స్ట్రయిక్ రొటేషన్ బలహీనత అతన్ని వెంటాడుతోంది.
ఇక పంత్ ధనాధన్ ప్లేయర్. బౌలర్లను లెక్క చేయకుండా భారీ షాట్లు కొడుతూ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచడంలో దిట్ట. దీంతో జట్టులో అతను ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారాడు. ఈ నేపథ్యంలో ఇద్దరిలో ఎవర్ని ఆడించాలన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. ఒకవేళ నాలుగో నంబర్‌లో శ్రేయస్ అయ్యర్‌ను తప్పించి ఈ ఇద్దర్ని కొనసాగించినా ఆశ్చర్యం లేదు. ఆల్‌రౌండర్స్‌గా హార్దిక్, జడేజాకు పోటీ తక్కువే. బౌలింగ్‌లో పేసర్ షమీ, రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫామ్‌కు ఈ సిరీస్ పరీక్షగా నిలవనుంది. ఈ ఇద్దరు ఇంజ్యురీస్ నుంచి కోలుకుని వచ్చారు. అర్ష్‌దీప్ ప్లేస్ ఖాయం కాగా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి డెబ్యూ చేసే చాన్స్ ఉంది. స్పిన్నర్లలో సుందర్, అక్షర్ పటేల్‌లో ఒకరికే చాన్స్ దక్కొచ్చు.
తుది జట్టు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, రాహుల్ / రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, జడేజా, అక్షర్ పటేల్ / సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, షమీ.
ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), డకెట్, ఫిల్ సాల్ట్, జో రూట్, హ్యారీ బ్రూక్, లివింగ్‌స్టోన్, జాకబ్ బెతెల్, బ్రైడన్ కార్సీ, ఆర్చర్, రషీద్, సకీబ్ మహ్ముద్.
పిచ్, వాతావరణం
వర్షం ముప్పు లేదు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. టాస్ గెలిస్తే బౌలింగ్ ఎంచుకునే చాన్స్.
94 వన్డేల్లో 14 వేల మార్క్ అందుకోవడానికి కోహ్లీకి కావాల్సిన రన్స్. సచిన్ (18,426), సంగక్కర (14, 234) ముందున్నారు.
5 ఈ ఫార్మాట్‌లో మరో ఐదు వికెట్లు తీస్తే షమీ 200 క్లబ్‌లో చేరతాడు. ఈ ఘనత సాధించిన ఎనిమిదో బౌలర్‌గా నిలుస్తాడు.
2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఇండియా విన్ లాస్ రికార్డు ఇది. ఇంగ్లండ్ 4–7తో ఉంది.2-_3
రూట్ రీ ఎంట్రీ..
ఇప్పటికే టీ20 సిరీస్ చేజార్చుకున్న ఇంగ్లండ్ ప్రతీకారంపై దృష్టి పెట్టింది. ఇందుకోసం బలమైన జట్టునే బరిలోకి దింపుతోంది. అయితే ఊహించని రీతిలో 15 నెలల తర్వాత జో రూట్ మళ్లీ వన్డేల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నాడు. 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత రూట్ ఈ ఫార్మాట్‌కు దూరమయ్యాడు. ఎక్కువగా టెస్ట్‌లపై ఫోకస్ చేశాడు. పేసర్ మార్క్ వుడ్‌కు రెస్ట్ ఇచ్చిన ఇంగ్లండ్ ముగ్గురు ఫ్రంట్ లైన్ పేసర్లతో ఆడనుంది. సకీబ్ మహ్ముద్, ఆర్చర్, కార్సీ ఫైనల్ టీమ్‌లోకి వచ్చారు. లివింగ్‌స్టోన్, రూట్, బెతెల్ పార్ట్ టైమ్ స్పిన్నర్లుగా వ్యవహరించనున్నారు. బ్యాటింగ్‌లో బట్లర్, డకెట్, రూట్, సాల్ట్, బ్రూక్‌పైనే ఎక్కువ భారం పడనుంది. స్పిన్నర్ రషీద్ నుంచి ఇండియాకు ముప్పు పొంచి ఉంది.
ఇంగ్లండ్, చాంపియన్స్ ట్రోఫీపైనే ఫోకస్: రోహిత్
తన క్రికెట్ భవిష్యత్‌పై వస్తున్న ఊహాగానాలకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తెరదించాడు. ప్రస్తుతానికైతే ఇంగ్లండ్‌తో మూడు వన్డేల సిరీస్, చాంపియన్స్ ట్రోఫీపైనే ఎక్కువగా దృష్టి పెట్టానని స్పష్టం చేశాడు. ఈ సమయంలో కెరీర్ గురించి మాట్లాడటం సరైంది కాదన్నాడు. ‘ఇంగ్లండ్‌తో సిరీస్, చాంపియన్స్ ట్రోఫీ ఉన్న టైమ్‌లో నా కెరీర్ భవిష్యత్ ప్రణాళికల గురించి మాట్లాడటం సందర్భోచితం కాదు.
నా ఫ్యూచర్‌కు సంబంధించిన నివేదికలు చాలా ఏళ్లుగా వస్తున్నాయి. వాటి గురించి మాట్లాడటానికి నేను ఇక్కడికి రాలేదు. ఇప్పుడైతే రెండు ప్రధాన సిరీస్‌లపైనే నా ఫోకస్ ఉంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం’ అని హిట్‌మ్యాన్ పేర్కొన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో రోహిత్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 6.20 సగటుతో 31 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ఊహాగానాలు వచ్చాయి.
మ. 1.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్