
- దేశం విడిచి పారిపోయాడంటూ కామెంట్లు
- ఎక్కడికీ పోలేదంటున్న పాకిస్థాన్ పీఎంవో
ఇస్లామాబాద్: ఇండియా, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో.. ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్ కనిపించకుండా పోయారు. అసిమ్ మునీర్ ‘మిస్సింగ్ ఇన్ యాక్షన్’ అయ్యాడని పలు నివేదికలు పేర్కొనగా.. మరికొన్ని రిపోర్టులు మాత్రం ఆయన రావల్పిండిలో దాక్కున్నాడని చెప్తున్నాయి. తన కుటుంబంతో సహా దేశం విడిచి పారిపోయాడని మరికొన్ని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇవన్నీ పుకార్లే అని కొన్ని మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి.
ఇండియాతో యుద్ధం వస్తుందనే వార్తల నేపథ్యంలో ఒక ప్రైవేట్ విమానంలో కుటుంబంతో సహా అసిమ్ మునీర్ బ్రిటన్ లేదా న్యూజెర్సీకి పారిపోయినట్లు ప్రచారం జరుగుతున్నది. మునీర్ మిస్సింగ్‌పై పాకిస్థాన్ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. గ్రాడ్యుయేట్ అధికారుల ఫొటోను పాకిస్థాన్ పీఎంవో ఎక్స్‌లో షేర్ చేసింది. ఆ ఫొటోలో పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ అబోట్టాబాద్‌లో ఉన్నట్లు పేర్కొన్నది. అందులో ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసిమ్ మునీర్, పీఎంఏ కాకుల్‌లోని అధికారులు తదితరులు ఉన్నారు.