అభివృద్ధి పనుల్లో  ప్రొటోకాల్ పాటించరా?

అభివృద్ధి పనుల్లో  ప్రొటోకాల్ పాటించరా?
  • ఎమ్మెల్యే ముఠా గోపాల్​ను నిలదీసిన బీజేపీ నాయకులు
  • అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు.. స్వల్ప ఉద్రిక్తత
  • శంకుస్థాపన చేయకుండానే వెనుదిరిగిన ఎమ్మెల్యే 

ముషీరాబాద్,వెలుగు: ముషీరాబాద్ సెగ్మెంట్ లో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక బీజేపీ కార్పొరేటర్లను భాగస్వామ్యం చేయడం లేదని, కనీసం సమాచారం కూడా ఇవ్వట్లేదని ఆ పార్టీ నాయకులు మంగళవారం ఎమ్మెల్యే ముఠాగోపాల్ ను నిలదీశారు. వివరాల్లోకి వెళ్తే.. ముషీరాబాద్ డివిజన్ పటాన్ బస్తీలో డ్రైనేజీ పైప్ లైన్ పనులను ప్రారంభించేందుకు ఎమ్మెల్యే ముఠా గోపాల్ వాటర్ బోర్డు డీజీఎం వాహెబ్, టీఆర్ఎస్ నాయకులతో కలిసి వచ్చారు. అదేటైమ్​లో బీజేపీ నాయకులు అక్కడికి చేరుకున్నారు. స్థానిక బీజేపీ కార్పొరేటర్ సుప్రియకు సమాచారం ఇవ్వకుండా పనులు ఎలా ప్రారంభిస్తారని, ప్రొటోకాల్ పాటించారా? అంటూ ఎమ్మెల్యే, అధికారులను ప్రశ్నించారు. అధికారులు సమాచారం ఇచ్చారని అనుకున్నానని ఎమ్మెల్యే సర్దిచెప్తుండగా.. అక్కడ ఉన్న టీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. పరస్పర దాడులకు యత్నించడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. దీంతో  పనులను ప్రారంభించకుండానే ఎమ్మెల్యే వెళ్లిపోయారు.  సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనుల విషయంలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని ముషీరాబాద్ కార్పొరేటర్ సుప్రియా గౌడ్ ఆరోపించారు. సెగ్మెంట్ లోని 5 డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లు గెలిచినందునే ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రొటోకాల్ పాటించనీయకుండా అధికారులను బెదిరిస్తున్నారని ఆమె
ఆరోపించారు.