మీడియాకు స్వేచ్ఛ ఉన్నదా: పసునూరి శ్రీనివాస్

మీడియాకు స్వేచ్ఛ ఉన్నదా: పసునూరి శ్రీనివాస్

ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో పత్రికా రంగం ప్రజల పక్షాన నిలిచింది. కానీ, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతే పత్రికా రంగం మొత్తం తన ముఖ కవళికల్ని మార్చుకునే ప్రయత్నాలు చేపట్టినట్టుగా అనిపిస్తోంది. ఒకప్పుడు అధికార పార్టీ పాలనా తప్పిదాలను ఎత్తిచూపే ప్రధాన పత్రికలు సైతం అదే పార్టీని ఆకాశానికి ఎత్తడం ఆరంభించాయి. అధికార పార్టీ అవినీతిని, కుంభకోణాల్ని వెలికి తీసే పత్రికలు నేడు కనుమరుగవ్వడం ఆందోళన కలిగిస్తోంది.

రాష్ట్రంలో ఒకటో, రెండో పత్రికలు మాత్రమే ధైర్యంగా ప్రజల పక్షాన, సమస్యల పరిష్కారం కోసం  పనిచేస్తుంటే భరించలేకపోతున్నారు. తాజాగా వెలుగు దిన పత్రికపై కేటీఆర్ బహిరంగంగానే బ్యాన్ ప్రకటించి ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేశారు. ఎంతోమంది విలేఖరుల్ని కేసీఆర్ బహిరంగంగా దూషించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. క్యూ న్యూస్ ఆఫీసుపై గత నాలుగేళ్లుగా భౌతిక దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ నియంతృత్వంపై వార్తాప్రసారాలు చేసిన కారణంగా తీన్మార్ మల్లన్న  వంటి వాళ్లను  జైల్లో పెడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టినవారిపై, ప్రతిపక్ష పార్టీ నాయకులపై రాష్ట్రవ్యాప్తంగా వేలాది కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు.

ప్రభుత్వ ప్రకటనలకు ఎగనామం పెట్టి ప్రజాపక్షం వహిస్తున్న కొన్ని పత్రికలను పీడించడం దుర్మార్గం. ప్రజాపక్షాన గొంతు వినిపించే సీనియర్​ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఎగ్గొట్టడం మరొక దారుణం. వచ్చిన తెలంగాణలో మీడియాను లొంగదీసుకోవడమో, లేదా భయపెట్టి లొంగదీసుకోవడమో, వినకుంటే అణచివేయడమో జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఇవాళ ఊహించని విధంగా తెలంగాణలో మీడియా నిర్బంధంలోకి జారిపోతుండడం చూసి ప్రజాస్వామ్యవాదులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కేసీఆర్ తన ప్రభుత్వ తప్పులను చూపుతున్న మీడియాపై అక్కసు వెలగక్కకుండా, వాస్తవాల్ని గ్రహించి ప్రజాసమస్యలపై దృష్టి పెడితే బాగుంటుంది. - పసునూరి శ్రీనివాస్​, మెట్​పల్లి, జగిత్యాల జిల్లా