కాంగ్రెస్​తో కారు పార్టీ పొత్తుకు చాన్స్​ ఉందా! : డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్

కాంగ్రెస్​తో కారు పార్టీ పొత్తుకు చాన్స్​ ఉందా! : డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్

కాంగ్రెస్‌‌కు దగ్గరయ్యేందుకు టీఆర్‌‌ఎస్‌‌ ఎత్తుగడలు వేస్తున్నదనే గుసగుసలు వినిపిస్తున్నా.. అందుకు పక్కా ఆధారాలు లేవు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే పార్లమెంట్‌‌లో ఏర్పాటు చేసిన సమావేశాలకు టీఆర్‌‌ఎస్ పార్టీ హాజరైన మాట వాస్తవమే. ఇది ఒక పెద్ద అడుగు. అయితే అధికారికంగా పొత్తుపై ఇంకా ఎలాంటి సూచన బయటకు రాలేదు. ఈడీ నుంచి విచారణకు పిలుపు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత తనతో చేరాలని కాంగ్రెస్ పార్టీని బహిరంగంగా కోరారు. సోనియా గాంధీని పొగిడారు. ఇది తీవ్ర భయాందోళనల మధ్య కవిత నుంచి వచ్చిన స్పందనగా చూడాలి, కేసీఆర్ వ్యూహాత్మక ప్రణాళిక కాదని తెలుస్తోంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. 

బీఆర్ఎస్​అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​అసెంబ్లీ వేదికగా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‍ ను, ఆయన నేతృత్వంలో సాగిన 10ఏళ్ల యూపీఏ పాలనపై పొగడ్తల వర్షం కురిపించారు. మన్మోహన్ సింగ్ సాధించిన విజయాలను, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేండ్లుగా చేస్తున్న పాలనతో పోల్చారు. కేసీఆర్​మంత్రివర్గంలోని కీలక మంత్రి అయిన కేటీఆర్​కూడా రాహుల్​గాంధీ అదానీ విషయంపై పార్లమెంట్​లో మాట్లాడిన విధానాన్ని ఇటీవల ఓ ప్రెస్​మీట్​లో కోట్​చేశారు. ఇవన్నీ కాంగ్రెస్​తో పొత్తుకు అనుకూలంగా కనిపిస్తున్న విషయాలు కాగా.. 2014 నుంచి కేసీఆర్, గాంధీల మధ్య అంతులేని శత్రుత్వం ఉన్నది. తెలంగాణ ఆవిర్భవించిన తర్వాత కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటారని సోనియా గాంధీ భావించారు. కానీ 2014 ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్‌‌ను మట్టికరిపించారు. గాంధీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటు తెలంగాణను కోల్పోయి, అటా ఆంధ్రాలో జీరో పార్టీగా మారి కాంగ్రెస్​చాలా నష్టపోయింది. దురదృష్టం ప్రజలను వింత స్నేహితులను వెతుక్కునేలా చేస్తుందని షేక్స్​పియర్​అన్నట్లు.. కాంగ్రెస్​కు మిత్రులు కావాలి. ఈడీ విచారణను ఎదుర్కొంటున్న కవితకు ప్రతిపక్ష పార్టీల మద్దతు, బలం కావాలి. అందుకే కేసీఆర్ – గాంధీల మధ్య స్నేహం కుదిరితే పరస్పర ప్రయోజనం ఉన్నది.

డైలమాలో కేసీఆర్‌‌‌‌?

రిస్క్ చేసి ఒంటరిగా పోటీ చేయడం మంచిదేమో కేసీఆర్ బేరీజు వేసుకోవాలి. ప్రస్తుతం ఇటు ప్రభుత్వానికి, అటు పార్టీకి మొత్తం బాస్ కేసీఆరే. కానీ కూటమిలో చేరితే ఆయన ఢిల్లీకి తలవంచి మరో ఉద్ధవ్ థాక్రే అవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు బీఆర్ఎస్ జాతీయ పార్టీని కేసీఆర్ డంప్ చేయాల్సి ఉంటుంది. కవిత హఠాత్తుగా కాంగ్రెస్‌‌తో పొత్తుకు పిలుపునిచ్చారా? లేక రహస్య వ్యూహాలు ఏమైనా ఉన్నాయా అనేది ఇంకా తెలియదు. అయితే కూటమి అన్నప్పుడు లాభనష్టాలు ఉంటాయనేది వాస్తవం. బీఆర్‌‌ఎస్‌‌ తగినంత బలంగా లేదన్న విషయం బయటకు వచ్చింది. అది భవిష్యత్తుకు మంచి సంకేతం కాదు. ఇప్పటి వరకు కేసీఆర్ ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారు. బీజేపీ త్రిముఖ పోరును కోరుకుంటోంది. కానీ కాంగ్రెస్-తో కేసీఆర్ పొత్తు పెట్టుకుంటే.. అక్కడ మిగులు నాయకులుగా మారినవారు... బీజేపీకి డజన్ల కొద్దీ తరలివస్తారు. బీఆర్‌‌ఎస్‌‌-–కాంగ్రెస్‌‌ కూటమి రూట్‌‌ మ్యాప్‌‌ త్వరలో తేలనుంది. ఈడీ -కవిత తదుపరి సమావేశం కేసీఆర్ – -కాంగ్రెస్ పొత్తు భవిష్యత్తుపై కొంత సూచన ఇవ్వొచ్చు.

పొత్తుతో ప్రతికూలతలు

బీఆర్ఎస్​ కాంగ్రెస్​ పొత్తు పెట్టుకుంటే తెలంగాణలో కాంగ్రెస్​ కేవలం 40 ఎమ్మెల్యే స్థానాలకే పరిమితం కావాల్సి ఉంటుంది. మిగతా 80 ఎమ్మెల్యే స్థానాల్లో కాంగ్రెస్ ఉండదు, ఆ పార్టీ అక్కడ తుడిచిపెట్టుకుపోతుంది. ఉత్తరప్రదేశ్, తమిళనాడు, బీహార్‌‌లలో కాంగ్రెస్‌‌ ఇలా పొత్తుకు వెళితేనే అక్కడ తుడిచిపెట్టుకుపోయింది. అందుకే హస్తం పార్టీ రాజస్థాన్‌‌, చత్తీస్‌‌గఢ్‌‌ తదితర రాష్ట్రాల్లో ఒంటరిగానే పోరాడుతోంది. ప్రస్తుతం టీఆర్‌‌ఎస్‌‌కు దాదాపు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. కాంగ్రెస్‌‌తో పొత్తు పెట్టుకుంటే దాదాపు 80 మంది ఎమ్మెల్యేలకే పరిమితం కావాల్సి వస్తుంది. చాలా మంది టీఆర్‌‌ఎస్‌‌ నేతలకు టిక్కెట్లు, రాజకీయ అవకాశాలు లేకుండా పోతాయి. అప్పుడు వాళ్లు బీజేపీ వైపు చూడవచ్చు. 2018లో గెలిచిన సీట్లను కాంగ్రెస్ డిమాండ్ చేయవచ్చు. తద్వారా బీఆర్‌‌ఎస్‌‌లోకి ఫిరాయించిన వారికి టిక్కెట్లు లేవని ఎద్దేవా చేయవచ్చు. దీంతో కాంగ్రెస్‌‌, బీఆర్‌‌ఎస్‌‌కు ఇద్దరికీ ఇబ్బందులు తప్పవు. ఈ రెండూ మిత్రపక్షాలుగా మారితే తెలంగాణలో సహజ ప్రతిపక్షంగా బీజేపీ అవతరిస్తుంది. కాంగ్రెస్, బీఆర్‌‌ఎస్ నేతలు టికెట్లు రాకుండా బీజేపీలోకి దూసుకుపోతారు. కేసీఆర్ రాజీనామా చేసి కాంగ్రెస్ నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేయవచ్చు. కాంగ్రెస్‌‌, కేసీఆర్‌‌లకు ఒకరి అవసరం మరొకరు ఉండవచ్చు. కానీ ఇద్దరూ ఒకరినొకరు విశ్వసించరు. కేసీఆర్ చేసిన మోసాన్ని నివారించడానికి, కాంగ్రెస్ అనేక ఎమ్మెల్యే సీట్లను డిమాండ్ చేసే అవకాశం ఉంది. అధికారంలో వాటా లేదా సీఎం పదవికి మొదటి అవకాశం కూడా డిమాండ్ చేయవచ్చు. - డా. పెంటపాటి పుల్లారావు,పొలిటికల్​ ఎనలిస్ట్