
Bitcoin Rally: మారుతున్న ప్రపంచంతో పాటు పెట్టుబడి మార్గాలు, వ్యూహాలు కూడా మారిపోతున్నాయి. దాదాపు దశాబ్ధకాలం కిందట పెద్దగా ఎవ్వరి దృష్టిని ఆకర్షించని బిట్‌కాయిన్ అనే కరెన్సీ ప్రస్తుతం ప్రపంచ పెట్టుబడిదారులకు కొత్త ఆశాజ్యోతిగా మారింది. దేశాలు ముద్రించే ఫియట్ కరెన్సీల వల్ల ద్రవ్యోల్బణం ఏర్పడుతున్నట్లు భావించిన ఒక వ్యక్తి ఆలోచన నుంచి పుట్టిందే ఈ క్రిప్టో కరెన్సీ బిట్‌కాయిన్. ఆధునిక యుగంలో ఇన్వెస్టర్లు ఈ కొత్త సాధనాన్ని ఊహించని శిఖరాలకు తమ డిమాంద్ తో చేర్చారు.
ఆగస్ట్ 14న బిట్‌కాయిన్ తన సరికొత్త జీవితకాల రేటు లక్ష 24వేల డాలర్ల మార్కును అధిగమించింది. ఇప్పుడు ఇన్వెస్టర్లు ఈ క్రిప్టో కరెన్సీ చూడని చార్ట్స్ లోకి తమ పెట్టుబడులను మళ్లించి ప్రయాణించాలని చూస్తున్నారు. 2025 ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 30 శాతం కంటే ఎక్కువ పెరిగింది బిట్‌కాయిన్. రానున్న సెప్టెంబర్ సమావేశంలో యూఎస్ ఫెడ్ వడ్డీరేట్లను తగ్గించవచ్చనే అంచనాలు కూడా ఇన్వెస్టర్లను క్రిప్టోల దిశగా నడిపిస్తున్నాయి.
ALSO READ : మెర్సిడెస్ సీఎల్‌ఈ కాబ్రియోలెట్‌లో కూపే లాంచ్
ప్రస్తుతానికి బిట్‌కాయిన్ తన బుల్ జోరును కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. జూలైలో లక్ష 23వేల 153ను టచ్ చేసిన బిట్‌కాయిన్ ప్రస్తుతం ఆ రికార్డును కూడా బద్ధలు కొట్టి ముందుకు సాగటానికి పెరుగుతున్న డిమాండ్ ఒక కీలక అంశంగా నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు క్రిప్టోలను ఒక ఆర్థిక పెట్టుబడి మార్గంగా మార్చేందుకు జరుగుతున్న ప్రక్రియ ఇన్వెస్టర్ల నమ్మకాన్ని సంపాదించటానికి కారణంగా నిపుణులు అంటున్నారు.
అమెరికా బిట్‌కాయిన్ ఈటీఎఫ్స్ లాంచ్ తర్వాత ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడి సంస్థ బ్లాక్ రాక్ అందులో భారీగా ఇన్వెస్ట్ చేయటం కీలకమైన మలుపుగా మారింది. అలాగే క్రిప్టోల మార్కెట్ ఏకంగా 4 ట్రిలియన్ డాలర్ల కంటే ఎక్కువ విలువైనదిగా మారటం.. చాలా మంది దీనిని పెట్టుబడి ఎంపికగా అంగీకరించటం బుల్ ర్యాలీకి మరో కారణంగా నిపుణులు చెబుతున్నారు. పైగా బంగారం, వెండిలో పెట్టుబడులు పెడుతున్న ఇన్వెస్టర్లు కూడా వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాలతో క్రిప్టోల్లోనే పెట్టుబడి పెడుతున్నట్లు తేలింది.
బిట్‌కాయిన్ ఇంకా పెరుగుతుందా..?
సమీప కాలంలో బిట్‌కాయిన్ ఒకవేళ లక్ష 25వేల డాలర్ల మార్కును చేరుకుని అక్కడ నిలదొక్కుకోగలికితే.. అది లక్ష 50వేల డాలర్ల మార్గం దిశగా బిట్‌కాయిన్ ప్రయాణానికి నాంది పలుకుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ప్రధానంగా దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు ఎక్కువ ప్రయోజనకరమని.. ఇంట్రాడే ట్రేడింగ్స్, స్వింగ్ ట్రేడింగ్స్ చేసేవారికి కాదని అంటున్నారు.
ఒక వేళ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తే ర్యాలీ ఉన్నప్పటికీ రిస్క్ పెరిగిపోతుందని అందువల్ల ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ముందుకెళ్లాలని జియోటాస్ క్రిప్టో ఎక్స్ఛేంజీ సీఈవో విక్రమ్ సుబ్బురాజ్ కొత్త ఇన్వెస్టర్లను హెచ్చరిస్తున్నారు. అలాగే ప్రస్తుత ర్యాలీ తర్వాత మీ లక్ష్యాలకు అనుగుణంగా లాభాల స్వీకరించి ముందుకెళ్లాలంటున్నారు. అలాగే అనుకోని ప్రతికూలతలకు సిద్ధంగా ఉండేందుకు లిక్విడిటీతో పాటు హెడ్జింక్ కూడా ముఖ్యమని విక్రమ్ సుబ్బురాజ్ ఇన్వెస్టర్లకు సూచిస్తున్నారు.