దేశానికి చెబుతున్నతెలంగాణ మోడల్ ఇదేనా? : కూరపాటి వెంకటనారాయణ

దేశానికి చెబుతున్నతెలంగాణ మోడల్ ఇదేనా? : కూరపాటి వెంకటనారాయణ

తెలంగాణ వస్తేనే అన్ని వర్గాల ఆర్థిక, సాంస్కృతిక, సామాజిక రాజకీయ అభివృద్ధి జరుగుతుందని జయశంకర్ సార్​తో పాటు అనేకమంది భావించారు. అట్లనే 60 ఏండ్ల తొలి, మలి దశ పోరాటాల్లో  ఉద్యమ కారులు, మేధావులు, విద్యార్థులు, సబ్బండ వర్గాలు ప్రాణాలకు తెగించి కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నారు. వచ్చిన తెలంగాణను రెండు మూడు ఆధిపత్య సామాజిక వర్గాల నేతలు, కొన్ని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు గుప్పిట్లోకి తీసుకొని ఆగం చేస్తున్నారు. భూదందాలు, అవినీతి, కార్యక్రమాల్లో ఆరితేరిన వారందరినీ ఒక్క వేదిక పైకి తీసుకువచ్చి రాజకీయ, అధికార పదవులు, అవకాశాలన్నీ పంచిపెట్టిన ప్రభుత్వ పెద్దలు.. పేదలకు మాత్రం మద్యం, సంక్షేమ వాసన, ఎన్నికల తాయిలాలు పంచింది. ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేట్ సంస్థలు, అవినీతి అధికారులు ఏకమై తెలంగాణ భూ, ఆర్థిక వనరులను తలా పిడికెడు తిలాపాపం చందాన వాటాలు వేసుకుంటున్నారు. మిగతా -80 శాతం ప్రజలు మాత్రం పాలకులు ఎరచూపిన దళిత బంధు, రైతుబంధు, కళ్యాణ లక్ష్మి , కిట్లు, బతుకమ్మ చీరలు, ఆసరా పెన్షన్లు, కంటి వెలుగు, ఆత్మగౌరవ భవనాలు, ఆత్మీయ విందు భోజనాల కోసం ఆశగా చూస్తూనే ఉన్నారు. మీరు దేశానికి చెబుతున్న తెలంగాణ మోడల్​ఇదేనా? అనే అనుమానం కలుగుతున్నది.తెలంగాణ మోడల్ అభివృద్ధిలో పేద మహిళలు కాన్పు కోసం సర్కారు దవాఖానకు పోయి మరణిస్తున్నారు. కుటుంబ నియంత్రణ చేసుకునే మహిళలు ఆసుపత్రిలోనే చనిపోతున్నారు. ఐసీయూలో పేషెంట్ ను ఎలుకలు కొరుకుతాయి. రాష్ట్ర ఏర్పాటుకు ముందు సాధారణంగా జీవించిన మన లీడర్లు గత తొమ్మిదేండ్లలో ఒక్కొక్కరు వందల ఎకరాలు భూములు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఫామ్ హౌస్ లు, కార్పొరేట్ వ్యాపారాలు, భూ దందాలు, ఇసుక దందాలు, మైనింగ్ దందాలు చేస్తూ కోట్లకు పడగలెత్తారు. ఇదే సమయంలో ధరణి వ్యవస్థ ప్రవేశపెట్టి పేద, మధ్య తరగతి కుటుంబాలు, రైతులు వ్యవసాయ, ఇండ్ల స్థలాల హక్కుల కోసం నిత్యం ఆఫీసుల చుట్టూ తిరుగుతూ భయం భయంగా బతుకుతున్నారు. 

ఓట్ల కొనుగోలు

హుజూరాబాద్, మునుగోడు ఉప ఎన్నికల సందర్భంగా ఓట్ల కొనుగోలు మార్కెట్​కు తెరలేపారు. ఓటర్లకు ఆత్మ గౌరవ సభలు, కులాల సభలు, ఏర్పాటు చేసి విందు, మందు, భోజనాల ఏర్పాటు చేసే సంస్కృతి తీసుకొచ్చారు. లక్షల రూపాయలతో ప్రతిపక్ష ప్రజాప్రతినిధులను, నాయకులను కుల సంఘాల నాయకులను చేరదీసుకోవడం బహుశ తెలంగాణలోనే సాధ్యమేమో! ఓటుకు ఐదారు వేల రూపాయలు పంపిణీ చేయడం లాంటి ప్రజాస్వామ్య కూని ప్రయత్నాలను దేశంలో ఎక్కడైనా విన్నామా? చూశామా? ఇది మన ఆదర్శ తెలంగాణలోనే సాధ్యమైంది.   తొమ్మిదేండ్లలో ఐదు లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రజలపై మోపింది మన ప్రభుత్వం. హైదరాబాదు భూముల అమ్మకం, ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తేవడం తెలంగాణలో సృష్టించిన వినూత్న మోడల్​లో మరో విశేషం. ఎన్నికైన ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను, ఇతర ప్రజాప్రతినిధులను ఒత్తిడితో లొంగదీసుకుని పాలక పార్టీలో విలీనం చేసుకోవడం, లేదా కోవర్టులుగా మార్చుకోవడం ద్వారా ప్రజల సమస్యల గురించి మాట్లాడే గొంతుకలు లేకుండా చేసి కుటుంబ సభ్యులు నియంత్రణలో ప్రభుత్వాన్ని నడపడమే తెలంగాణ మోడల్. 40 ఏండ్ల నుంచి రాజకీయాలు చేస్తూ అధికారాన్ని అనుభవించిన వివిధ ప్రాంతీయ పార్టీలకు అన్ని రకాల సాయం అందించగలిగే శక్తి యుక్తులను అనతి కాలంలోనే సంపాదించుకున్నది మన తెలంగాణ పార్టీ. ఇది ఒక అద్భుత మోడల్ అని చెప్పొచ్చు.

స్పందించాల్సిన టైమ్​ వచ్చింది..

తెలంగాణ ప్రజలు, ఉద్యమకారులు ముఖ్యంగా పేద వర్గాలకు అనేక హామీలు గుప్పించి, పథకాలు ప్రకటించి ఇవ్వకుండా, సహజ వనరులను, బడ్జెట్ వనరులను అన్యాక్రాంతం చేయడం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ ఆకాంక్షలు, పాలకులు ఇచ్చిన హామీలు ఎండమావులుగా మిగిలిపోయాయి. అయినా ఇది ఒక అద్భుత అభివృద్ధి మోడల్ అని పతాక శీర్షికలో ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణలో ఎంత విధ్వంసం జరుగుతుందో విజ్ఞులైన మేధావులు విశ్లేషించుకోవాలి. బాధితులైన ప్రజలు, విద్యార్థులు, మేధావులు తగిన విధంగా స్పందించే సమయం ఆసన్నమైంది. ఉద్యమ చైతన్య స్ఫూర్తిని తిరిగి పొందాల్సిన సందర్భం వచ్చింది. అంతరిస్తున్న ప్రజాస్వామ్య విలువలు, నీరుగారుతున్న సమాజ అభివృద్ధి సంస్థలను కాపాడుకోవాలి. నిత్యం అభివృద్ధి మిషతో దోపిడీకి గురవుతున్న సహజ వనరులను, సంపదను, ఆర్థిక వనరులను భావితరాల కోసం రక్షించడం మన ధర్మం. తెలంగాణ ఆకాంక్షలు, అస్థిత్వం, నదుల నీటి పంపకాలు, ఆస్తుల పంపకాలు గాలికి వదిలేసి తెలంగాణ వనరులను కుప్ప చేసుకొని ఇతర రాష్ట్రాల్లో వెదజల్లి ఆ ప్రాంతాలను కూడా ఇలాంటి దురదృష్టకర ఫ్యూడల్ నమూనాలాగా చేస్తామనడం తెలంగాణ ప్రజలు, మేధావులు సహిస్తున్నారా? మౌనం వహిస్తారా ఆలోచించాల్సిన సమయం వచ్చింది.

సామాజిక న్యాయం ఏది?

రాష్ట్ర క్యాబినెట్​లో ప్రస్తుతం17 మంది మంత్రులు ఉన్నారు.  కేసీఆర్​ కుటుంబం నుంచి ముగ్గురు సహా మొత్తం10 శాతం జనాభా ఉన్న 3 సామాజిక వర్గాలకు11 అతి ముఖ్యమైన మంత్రి పదవులు ఉన్నాయి. 90 శాతం జనాభా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు మంత్రి పదవులు అయిదు(బీసీలు–3, ఎస్సీ – 1, ఎస్టీ –1, మైనార్టీ – 1). రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రాతినిధ్యం వహించే మంత్రులు ముగ్గురా? 0.4 శాతం జనాభా లేని ఓ సామాజిక వర్గానికి చెందిన వారేమో 4 మంత్రి పదవులు. అందులోనూ అవి ఎంతో కీలకమైనవి? కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో రాజకీయ రంగంలో సామాజిక న్యాయం ఎక్కడున్నట్టు? అన్ని శాఖలను, ప్రభుత్వ వ్యవస్థలను కుటుంబ, బంధు వర్గ కబంధహస్తాల్లో బిగించి రాష్ట్రాన్ని నియంత్రిస్తున్నారు. ఇలాంటి తెలంగాణ మోడల్ ను దేశంలో ఎలా అమలు చేస్తారు? సర్కారు పట్టించుకోక, నిధులు లేక, నియామకాలు జరపక తెలంగాణలో విద్యావ్యవస్థ అధ్వానంగా తయారైంది. నివాస యోగ్యతలేని రెసిడెన్షియల్ హాస్టల్స్, చాలీచాలని సౌలత్​లు, పురుగుల అన్నం, నీళ్ల చారు తెలంగాణ రాష్ట్ర సంక్షేమ హాస్టళ్ల ప్రత్యేకతలు. ప్రైవేటీకరణను అడ్డుకుంటామంటున్న పాలకులు రాష్ట్రంలో11 ప్రైవేటు వర్సిటీలకు పర్మిషన్​ఇస్తూ.. కావాల్సిన వాళ్లకు కట్టబెట్టి, అందులోనూ రిజర్వేషన్లు లేకుండా చట్టాలు తయారు చేసి విద్యను ప్రైవేటీకరించారు. 

 తెలంగాణ ఏర్పడ్డ తొమ్మిదేండ్లలో మద్యం అమ్మకాలు 500 శాతం, మద్యం రేట్లు 250 శాతం, మద్యం షాపులు 300 శాతం, పబ్బులు వెయ్యి శాతం, బెల్ట్ షాపులు వెయ్యి శాతం పెరిగి, సర్కారు ఆమ్దానీ అన్ని మార్గాల కంటే మద్యం ద్వారా ఎక్కువ వస్తున్నది. పేద ప్రజల జేబులు కత్తిరించి, కుటుంబాలను సామాజికంగా, ఆర్థికంగా ఆగం చేసే మద్యం వ్యాపారం తెలంగాణ మోడలే కదా!

-కూరపాటి వెంకటనారాయణ, రిటైర్డ్ ప్రొఫెసర్, కేయూ