- 55 రన్స్ తేడాతో బెంగళూరుపై గెలుపు
- ఆర్సీబీ హ్యాట్రిక్ విజయాలకు చెక్
- చెలరేగిన అభిషేక్, క్లాసెన్,
బ్యాటింగ్‌లో దుమ్మురేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్ లీగ్ దశను విజయంతో ముగించింది. ఇషాన్ కిషన్ (79), అభిషేక్ శర్మ (56), హెన్రిచ్ క్లాసెన్ (51) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్ 55 రన్స్ తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ గెలిచిన హైదరాబాద్ 20 ఓవర్లలో 255/4 స్కోరు చేయగా.. ఛేజింగ్‌లో బెంగళూరు 20 ఓవర్లలో 200/4 స్కోరు చేసి ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ గెలిచినా పాయింట్ల పట్టికలో మూడో ప్లేస్‌లోనే ఉంది.
హైదరాబాద్, వెలుగు: బ్యాటింగ్‌లో దుమ్మురేపిన సన్‌రైజర్స్ హైదరాబాద్.. ఐపీఎల్–19 లీగ్ దశను విజయంతో ముగించింది. ఇషాన్ కిషన్ (46 బాల్స్‌లో 8 ఫోర్లు, 3 సిక్స్‌లతో 79), అభిషేక్ శర్మ (22 బాల్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లతో 56), హెన్రిచ్ క్లాసెన్ (24 బాల్స్‌లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 51) దంచికొట్టడంతో.. శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో హైదరాబాద్ 55 రన్స్ తేడాతో బెంగళూరుపై గెలిచింది. టాస్ గెలిచిన హైదరాబాద్ 20 ఓవర్లలో 255/4 స్కోరు చేసింది. ఛేజింగ్‌లో బెంగళూరు 20 ఓవర్లలో 200/4 స్కోరు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (19 బాల్స్‌లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44), రజత్ పటీదార్ (39 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) మెరుగ్గా ఆడారు. ఇషాన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
దంచుడే.. దంచుడు
హోమ్ గ్రౌండ్‌లో బ్యాటింగ్ పిచ్‌పై ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు పరుగుల సునామీ సృష్టించారు. తొలి ఓవర్‌లో హెడ్ (26) 4, అభిషేక్ సిక్స్‌తో టచ్‌లోకి వచ్చారు. ఆ వెంటనే హెడ్ మరో ఫోర్ కొడితే.. మూడో ఓవర్‌లో అభిషేక్ 4, 4 రాబట్టాడు. నాలుగో ఓవర్‌లో 4, 4, 4 కొట్టిన హెడ్‌ను రసిక్ సలామ్ దార్ (2/52) ఔట్ చేశాడు. దాంతో తొలి వికెట్‌కు 45 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇషాన్ కిషన్ కుదురుకోవడానికి టైమ్ తీసుకోవడంతో తర్వాతి ఓవర్‌లో 7 రన్సే వచ్చాయి. ఆరో ఓవర్‌లో ఇషాన్, అభిషేక్ ఫోర్‌తో పవర్‌ప్లేలో హైదరాబాద్ 63/1 స్కోరు చేసింది. ఫీల్డింగ్ పెరిగిన తర్వాత అభిషేక్ రెండు సిక్స్‌లతో సుయాష్ శర్మ (1/36)కు స్వాగతం పలికాడు. 8వ ఓవర్‌లో 6, 6, 4తో అభిషేక్ 20 బాల్స్‌లో ఫిఫ్టీ పూర్తి చేశాడు. కానీ తర్వాతి ఓవర్‌లోనే సుయాష్ బౌలింగ్‌లో ఔట్ కావడంతో రెండో వికెట్‌కు 52 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇక్కడి నుంచి ఇషాన్, క్లాసెన్ స్కోరు బోర్డును పరుగెత్తించారు. ఇషాన్ కొట్టిన రెండు ఫోర్లతో ఫస్ట్ టెన్‌లో హైదరాబాద్ 116/2 స్కోరుతో నిలిచింది. క్రునాల్ పాండ్యా (1/24) వేసిన 11వ ఓవర్‌లో ఇషాన్ సిక్స్ బాదితే.. హాజిల్‌వుడ్ వేసిన 13వ ఓవర్‌లో క్లాసెన్ 6, 6, 4, 6తో 27 రన్స్ దంచాడు. 14వ ఓవర్‌లో చెరో సిక్స్‌తో 15 రన్స్ చేశారు. 15వ ఓవర్‌లో ఫోర్‌తో ఇషాన్ 31 బాల్స్‌లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఇదే ఓవర్‌లో క్లాసెన్ 4, 6 బాదాడు. 16వ ఓవర్‌లో ఇషాన్ 6, 4, 4 రాబట్టగా, క్లాసెన్ 23 బాల్స్‌లో ఫిఫ్టీ అందుకున్నాడు. అయితే 17వ ఓవర్‌లో క్రునాల్.. క్లాసెన్‌ను ఔట్ చేసి మూడో వికెట్‌కు 113 రన్స్ పార్ట్‌నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఈ దశలో వచ్చిన నితీశ్ రెడ్డి (29 నాటౌట్) రెండు సిక్స్‌లతో ఖాతా తెరిచాడు. ఇషాన్ కూడా బ్యాట్ ఝుళిపించడంతో నాలుగో వికెట్‌కు 45 రన్స్ జతయ్యాయి.
కోహ్లీ ఫెయిల్..
ఛేజింగ్‌లో బెంగళూరుకు వెంకటేశ్ అయ్యర్ మెరుపు ఆరంభం ఇచ్చినా.. మిగతా బ్యాటర్లు సద్వినియోగం చేసుకోలేదు. 4, 6తో తొలి ఓవర్‌ను మొదలుపెట్టిన వెంకటేశ్ ఉన్నంతసేపు దూకుడుగా ఆడాడు. కానీ రెండో ఎండ్‌లో కోహ్లీ (15) రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చినా విఫలమయ్యాడు. నాలుగో ఓవర్‌లో 6, 4, 6, 6తో 23 రన్స్ దంచిన వెంకటేశ్ ఐదో ఓవర్‌లో ఈషాన్ మలింగ(2/33)కు వికెట్ ఇచ్చాడు. దాంతో తొలి వికెట్‌కు 60 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది. ఇదే ఓవర్‌లో దేవదత్ పడిక్కల్ (21) 4, 6 బాదినా.. ఆరో ఓవర్‌లో షకీబ్ (1/31) విరాట్ వికెట్ తీశాడు. ఆర్సీబీ 75/2తో పవర్‌ప్లేను ముగించింది. ఇక్కడి నుంచి వేగంగా ఆడిన పడిక్కల్‌ను 9వ ఓవర్‌లో మలింగ వెనక్కి పంపాడు. రజత్ పటీదార్‌తో కలిసి క్రునాల్ పాండ్యా (41 నాటౌట్) మెల్లగా ఆడటంతో తొలి పది ఓవర్లలో ఆర్సీబీ 100/3 స్కోరు చేసింది. 11వ ఓవర్‌లో ఫోర్‌తో క్రునాల్ బ్యాట్ ఝుళిపించాడు. తర్వాతి ఓవర్లలోనూ బౌండ్రీలు రాబట్టాడు. మధ్యలో పటీదార్ సింగిల్స్‌తో స్ట్రయిక్ రొటేట్ చేశాడు. తర్వాతి ఐదు ఓవర్లలో 49 రన్స్ రావడంతో స్కోరు 149/3కి పెరిగింది. 16వ ఓవర్‌లో పటీదార్ ఇచ్చిన క్యాచ్‌ను కవర్స్‌లో కమిన్స్ వదిలేశాడు. ఆ వెంటనే పటీదార్ రెండు ఫోర్లు దంచాడు. 17వ ఓవర్‌లో 8 రావడంతో విజయ సమీకరణం 18 బాల్స్‌లో 88 రన్స్‌గా మారింది. 19వ ఓవర్‌లో పటీదార్ ఔట్ కావడంతో నాలుగో వికెట్‌కు 84 రన్స్ జతయ్యాయి. క్రునాల్ 4, టిమ్ డేవిడ్ (15 నాటౌట్) 6, 4 కొట్టినా.. ఆర్సీబీ విజయానికి చాలా దూరంలో ఆగిపోయింది.
సంక్షిప్త స్కోర్లు
హైదరాబాద్: 20 ఓవర్లలో 255/4 (ఇషాన్ 79, అభిషేక్ 56, క్లాసెన్ 51, రసిక్ సలామ్ 2/52). బెంగళూరు: 20 ఓవర్లలో 200/4 (రజత్ 56, వెంకటేశ్ 44, ఈషాన్ మలింగ 2/33).
ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ (281) రికార్డులకెక్కాడు. రోహిత్ శర్మ (280)ని అధిగమించాడు.
ఐపీఎల్‌లో హైదరాబాద్ 250కి పైగా స్కోరు చేయడం ఇది ఆరోసారి. పంజాబ్ (3) రెండో ప్లేస్‌లో ఉంది.
