ఈశ్వరీబాయి సేవలు అసమానం .. ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా ..

ఈశ్వరీబాయి సేవలు అసమానం ..  ఈశ్వరీబాయి జయంతి సందర్భంగా ..

తెలంగాణ తరతరాలుగా దోపిడీకి గురైనది.  తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం లభించాలని,  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం నిలవాలంటే  ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని ఉద్యమించిన తొలి తరం మహిళా నాయకుల్లో  ఈశ్వరీబాయిని ప్రముఖ నాయకురాలిగా పేర్కొనాలి.  సికింద్రాబాద్​లోని ఒక సామాన్య దళిత కుటుంబంలో ఈశ్వరీబాయి జన్మించింది. విద్యాధికురాలు, బహు భాషా కోవిదురాలైన ఈశ్వరీబాయి ఐదారు భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగేవారు.

అపారమైన మేధస్సు ఆమె సొంతం. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గణాంకాలతో సహా వివరించి ఆయా ప్రభుత్వాలపై తనదైన శైలిలో విరుచుకుపడేవారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో తనదైన కీలక పాత్రను పోషించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమించిన తొలి తరం నాయకురాలిగా ఆమె పాత్రను పలువురు నేటికీ కీర్తిస్తారు. 

అలుపెరగని దళిత ఉద్యమనేత

ప్రత్యేక తెలంగాణ తొలి దశ ఉద్యమంలో  తెలంగాణ ప్రజా సమితి నాయకురాలిగా తెలంగాణ వ్యాప్తంగా ఈశ్వరీబాయి పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకొచ్చారు. తెలంగాణ హక్కుల సాధనకు పలు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు సందర్భంలో జరిగిన ఒప్పందాలను ఆనాటి పాలకులు తుంగలో తొక్కుతున్నారంటూ ధ్వజమెత్తారు. వాటి అమలు కోసం అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు.  ఒక ఇండిపెండెంట్ కార్పొరేటర్​గా రాజకీయ రంగంలోకి ప్రవేశించి అంచెలంచెలుగా ఎదిగి రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు. పాలనాపరమైన కీలక నిర్ణయాలకు ఆమె కేంద్ర బిందువయ్యారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేర్కొన్నట్లు పొలిటికల్ పవర్ ఈజ్ ది మాస్టర్ కీ అనే స్ఫూర్తితో అధికారాన్ని సామాజిక సాధికారతకు ఉపయోగించిన అసమాన నాయకురాలిగా ఈశ్వరీబాయి అందరికీ గుర్తుంటారు. అరవయ్యవ దశకంలో సమాజంలో ఉన్న దారుణమైన కుల వివక్ష, అంటరానితనం, మహిళల పట్ల ఉన్న వివక్షతలపై అలుపెరుగని పోరాటం చేశారు. ఈశ్వరీబాయిని దళిత ఉద్యమ నేతగా ఎంతగా చెప్పుకుంటామో అంతే స్థాయిలో తెలంగాణ ప్రాంతం కోసం పోరాడిన నాయకురాలిగా పేర్కొనాలి. ఈ రెండింటితోనూ ఆమెకు విడదీయరాని అనుబంధం ఉంది.

మహిళా హక్కుల కోసం తపన

మహిళా హక్కుల కోసం ఈశ్వరీబాయి ఎంతో  పరితపించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆమె అరవయ్యవ దశకం నుంచి తొంబైవ దశకం వరకు అత్యంత ప్రభావవంతమైన నాయకురాలిగా  పేర్కొనవచ్చు. అణగారిన వర్గాల ప్రజాప్రతినిధిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లోనూ ఎక్కడ వివక్ష, అణచివేత, దౌర్జన్యాలు జరిగినా నేనున్నానంటూ బాధితులకు ఈశ్వరీబాయి భరోసాను ఇచ్చేవారు.

దళిత, గిరిజనులపై అఘాయిత్యాలకు పాల్పడేవారిని ఈశ్వరీబాయి సింహంలా భయపెట్టేవారు.  ఆ స్థాయిలో ఆమె పోరాటపటిమ ఉండేది. అందుకే నేటికీ ఆమె పోరాట స్ఫూర్తిని పలువురు గుర్తు చేస్తుంటారు. ఈశ్వరీబాయి కుమార్తె శ్రీమతి గీతారెడ్డి తన తల్లి చూపిన మార్గంలో రాజకీయాల్లో ప్రవేశించి ప్రజాసేవ చేస్తున్నారు. ఈశ్వరీబాయి పేరిట పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈశ్వరీబాయి తెలంగాణ కోసం చేసిన పోరాటం, సేవలకు గుర్తింపుగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రభుత్వం ఆమె జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నది. 

 నేలపూడి స్టాలిన్ బాబు, సామాజిక రాజకీయ విశ్లేషకులు.