ఐఎస్ ఉగ్ర సంస్థ హెడ్ హతం: కొడుకులతో కలిసి పేల్చేసుకుని..

ఐఎస్ ఉగ్ర సంస్థ హెడ్ హతం: కొడుకులతో కలిసి పేల్చేసుకుని..

యూఎస్ సేనలు వెంబడించడంతో పేల్చుకుని చచ్చాడు

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటన

దీపావళి ముందు రోజు… నరక చతుర్దశి. అంటే ప్రజల్ని హింసపెట్టిన రాక్షసుడు నరకాసురుడిని హతమార్చిన రోజు.

అనూహ్యంగా అదో రోజున గ్లోబల్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు, ప్రపంచమంతా నరమేధం సృష్టిస్తున్న నరరూప రాక్షసుడు, ఎంతో మందిని కర్కశంగా చంపిన ఐఎస్ ఉగ్రవాద సంస్థ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీ హతమయ్యాడు.

సిరియాలో నిన్న రాత్రి అమెరికా సేనలు జరిపిన వేటలో బగ్దాదీని చంపినట్లు ఆదివారం ఉదయం నుంచి వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సాయంత్రం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా వైట్ హౌస్ లో ప్రకటించారు. బగ్దాదీ హతమవడం నిజమేనని చెప్పారు. అతడు కుక్క చావు చచ్చాడని, ఇప్పుడు ప్రపంచం చాలా సురక్షితంగా ఉంటుందని అన్నారు ట్రంప్. యూఎస్ చేపట్టిన ఈ స్పెషల్ ఆపరేషన్ లో బగ్దాదీతో పాటు పదుల సంఖ్యలో ఉగ్రవాదులు హతమయ్యారని చెప్పారు.

టన్నెల్ చివరన చిక్కి.. భయంతో ఏడుస్తూ..

సిరియాలో ఐఎస్ హెడ్ బగ్దాదీ టార్గెట్ గా అమెరికా సేనలు వేటకు దిగాయని, అతడిని కార్నర్ చేశారని ట్రంప్ చెప్పారు. ‘ఆర్మీ వెంబడించడంతో బగ్దాదీ తన ముగ్గురు కుమారులతో కలిసి పరుగు పెట్టాడు. ఓ టన్నెల్ చివరన చిక్కుకుపోయాడు. ఎటూ తప్పించుకోలేని స్థితిలో ఇరుక్కున్నాడు. భయంతో వణుకాడు. ఏడుస్తూ తప్పించుకునే దారి కోసం అటూ ఇటూ దేవులాడాడు. అమెరికా సేనల చేతుల్లో చావు తప్ప మరో దారి కనిపించకపోవడంతో తనను తానే బాంబులతో (సూసైడ్ బాంబర్ జాకెట్ ను డిటోనేట్ చేసి) పేల్చుకున్నాడు బగ్దాదీ. అతడితో పాటు ముగ్గురు కొడుకులు కూడా ముక్కలు ముక్కలైపోయారు. హతమైనది బగ్దాదీనా కాదా అని తేల్చేందుకు చేసిన పరీక్షల్లో అది అతడేనని తేలింది’ అని ట్రంప్ వివరించారు.