
హిందువును పెళ్లి చేసుకుని, సింధూరం, మంగళసూత్రం ధరించి విమర్శలకు గురైన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, సినీనటి నుస్రత్ జహాన్‌కు ఆధ్యాత్మిక కేంద్రం కోల్‌కతా ఇస్కాన్ నుంచి ఆహ్వానం అందింది. కోల్‌కతలో గురువారం జరిగే రథయాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా రావాలని ఇస్కాన్ కోరింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈ రథయాత్రను ప్రారంభిస్తారు. 1971 నుంచి ఇస్కాన్ ఏటా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. తమ ఆహ్వానానికి అంగీకరించినందుకు నుస్రత్‌కు ఇస్కాన్ అధికార ప్రతినిధి రాధారమణదాస్ థ్యాంక్స్ చెప్పారు. సమాజంలో మార్పుకు ఆమె కొత్త మార్గం చూపిస్తున్నారని మెచ్చుకున్నారు. కోల్‌కతా ఇస్కాన్ రథయాత్ర సామాజిక మార్పుకు నాంది అని, రథాలు, దేవుడికి వేసే కొన్ని వస్త్రాలు ముస్లిం సోదరులు తయారు చేస్తారని రమణదాస్ చెప్పారు. చాలా ఏళ్ల నుంచి ముస్లింలే వాటిని తయారు చేస్తున్నారన్నారు. “ రథయాత్రను నిర్వహిస్తున్న ఇస్కాన్‌కు అభినందనలు. నాతో పాటు భక్తులు పెద్దఎత్తున కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలి. నేను ఇప్పటికే ముస్లిమే.. ఏం వేసుకోవాలి.. ఎలా ఉండాలనే విషయం నాకొకరు చెప్పాల్సిన అవసరంలేదు” అంటూ నుస్రత్ వీడియోను రిలీజ్ చేశారు.