
- రోడ్డు వెడల్పు చేయకుండానే ఐలాండ్స్నిర్మాణం
- ఇరుకుగా మారిన రోడ్డు... నిత్యం ప్రమాదాలు
- ఐలాండ్‌ను ఢీకొని యువకుడి మృతితో విషాదం
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల టౌన్బ్యూటిఫికేషన్లో భాగంగా ఎలాంటి ప్రణాళిక లేకుండా నిర్మిస్తున్న ఐలాండ్స్ ప్రయాణికులప్రాణాలు బలిగొంటున్నాయి. ఐబీ చౌరస్తా, వెంకటేశ్వర టాకీస్ చౌరస్తా, బెల్లంపల్లి చౌరస్తా, లక్ష్మీ టాకీస్చౌరస్తా నాలుగు చోట్ల ఐలాండ్స్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ఒక్కో ఐలాండ్‌కు రూ.కోటి చొప్పున మొత్తం రూ.4 కోట్లు వెచ్చిస్తున్నారు. జంక్షన్లతో పాటు ఐబీ చౌరస్తా నుంచి ఎంసీసీ వరకు డివైడర్లు, సెంట్రల్లైటింగ్సిస్టం ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌తో సంబంధం లేకుండా వాహనాలు వెళ్లేలా ఐలాండ్స్‌ను డెవలప్చేస్తున్నారు. రోడ్డు వెడల్పు చేయకుండా విశాలమైన ఐలాండ్స్‌ను నిర్మించడం వల్ల రోడ్డు ఇరుకుగా మారి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముందుగా రోడ్డు వైడెనింగ్పనులు చేపట్టిన తర్వాత ఐలాండ్స్‌ను అభివృద్ధి చేయాల్సి ఉన్నప్పటికీ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆ విషయం
పట్టించుకోలేదు.
ఆలస్యంగా... అస్తవ్యస్తంగా
వాస్తవానికి ఈ పనులు నాలుగేండ్ల కిందటే మంజూరయ్యాయి. ఫండ్స్అందుబాటులో ఉన్నప్పటికీ పనులు చేయకుండా రేపు మాపంటూ మొన్నటివరకు సాగదీశారు. రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇటీవల హడావుడిగా టెండర్లు నిర్వహించి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ట్రాఫిక్ సిగ్నల్స్‌తో సంబంధం లేకుండా ఐలాండ్స్నిర్మించాలన్న ఆలోచన మంచిదే కానీ ముందుగా రోడ్డు వెడల్పు చేయకపోవడం సమస్యగా మారింది. ఐలాండ్స్దగ్గర రోడ్డు ఇరుకుగా మారింది. బస్సులు, లారీలు జంక్షన్లు క్రాసింగ్అవుతున్నప్పుడు ఇతర వాహనాలు వెళ్లడానికి చోటు లేకుండాపోయింది. దీంతో రెండు వైపుల నుంచి స్పీడ్‌గా వచ్చిన వాహనాలు ఐలాండ్స్దగ్గరికి రాగానే సడెన్‌బ్రేకులు వేయాల్సి వస్తోంది. అయినా వెహికల్స్కంట్రోల్కాక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ముఖ్యంగా వెంకటేశ్వర టాకీస్చౌరస్తా, లక్ష్మీ టాకీస్చౌరస్తాల్లో వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు.
నాసిరకంగా పనులు....
రూ.4 కోట్లతో చేపడుతున్న ఐలాండ్స్అభివృద్ధి పనులు నాసిరకంగా జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. జంక్షన్ల చుట్టూ నిర్మించిన సిమెంట్ గోడలు క్వాలిటీగా లేవు. ఐలాండ్స్మధ్యలో మొక్కలు పెరిగేందుకు నాణ్యమైన ఎర్రమట్టిని పోయాల్సి ఉండగా, లక్సెట్టిపేట రోడ్డు వెడల్పు కోసం తవ్విన మట్టిని తీసుకొచ్చి నింపేశారు. నాసిరకం పనులకు రూ.4 కోట్లు ఖర్చవుతాయా అని పట్టణ ప్రజలు విస్తుపోతున్నారు. వీటికి రూ.2 కోట్లకు మించి ఖర్చు కావని, మిగతా రూ.2 కోట్లలో కాంట్రాక్టర్, అధికారులు, ప్రజాప్రతినిధులు వాటాలు పంచుకుంటున్నారని కాంగ్రెస్, బీజేపీ లీడర్లు ఆరోపిస్తున్నారు.
ఐలాండ్‌కు ఢీకొని యువకుడి మృతి
ఆదివారం రాత్రి 1.30 గంటల ప్రాంతంలో లక్ష్మీ టాకీస్ చౌరస్తాలోని ఐలాండ్‌కు బైక్‌ఢీకొని రాజీవ్‌నగర్‌కు చెందిన నల్లూరి రవితేజ(21) చనిపోయాడు. రోడ్డు సగం వరకు ఆక్రమించి ఐలాండ్నిర్మించడం, రాత్రివేళ సరైన లైటింగ్లేకపోవడం, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. బైక్‌పై స్పీడ్‌గా వచ్చిన రవితేజకు అక్కడ ఐలాండ్ కనిపించకపోవడంతో నేరుగా వెళ్లి దానికి ఢీకొన్నాడు. బలయమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితికి చేరాడు. వెంటనే అతడి ఫ్రెండ్స్ హాస్పిటల్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. రవితేజ డిగ్రీ ఫైనలియర్ చదువుతున్నాడు. చేతికందిన కొడుకు మృతి చెందడాన్ని తల్లిదండ్రులు తట్టుకోలేకపోతున్నారు. తండ్రి అర్జయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు నమోదు చేశారు. ఐలాండ్ వద్ద రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో అందులో కంకర డస్ట్ నింపారు. ఆదివారం మధ్యాహ్నం అక్కడ స్కూటీ స్కిడ్అయ్యి తల్లీకొడుకులకు తీవ్రగాయాలయ్యాయి.