కాల్పుల విరమణ వాయిదా.. గాజాలోని 300 టార్గెట్లపై ఇజ్రాయెల్ దాడులు

కాల్పుల విరమణ  వాయిదా..  గాజాలోని 300 టార్గెట్లపై ఇజ్రాయెల్ దాడులు

గాజా/జెరూసలెం: ఇజ్రాయెల్, హమాస్ మిలిటెంట్ గ్రూప్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలు ఒకరోజు వాయిదా పడింది. నాలుగు రోజులు కాల్పుల విరమణ పాటించేందుకు ఇరుపక్షాలు బుధవారం అంగీకరించాయి. డీల్​లో భాగంగా హమాస్ 50 మంది బందీలను విడిచిపెట్టేందుకు ఒప్పుకోగా.. ప్రతిగా 150 మంది పాలస్తీనియన్ ఖైదీల రిలీజ్​కు ఇజ్రాయెల్​ ఓకే చెప్పింది. అదనంగా విడుదల చేసే ప్రతి 10 మంది బందీలకు ఒకరోజు చొప్పున కాల్పుల విరమణను పొడిగించేందుకు కూడా అంగీకరించింది.

అయితే, అగ్రిమెంట్​పై ఇంకా సంతకాలు చేయకపోవడం వల్ల ఒప్పందం అమలు శుక్రవారానికి వాయిదా పడినట్లు ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తాచీ హనెగ్బీ వెల్లడించారు. ఈ క్రమంలో గడిచిన 24 గంటల్లో గాజాలో హమాస్​కు చెందిన 300 టార్గెట్లను ఇజ్రాయెల్​ పేల్చేసింది. జబాలియాలో ఇజ్రాయెల్ సైనికులపై దాడికి బయలుదేరిన మిలిటెంట్ల గ్రూప్​ను డ్రోన్ల ద్వారా గుర్తించి హతమార్చింది. బీట్ హనూన్ లోని ఒక మసీదులో, ఇంటిలో, వ్యవసాయ క్షేత్రంలో హమాస్ టన్నెళ్లను గుర్తించి ధ్వంసం చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది.