ఇజ్రాయెల్ ప్రధానికి కరోనా పాజిటివ్

ఇజ్రాయెల్ ప్రధానికి కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. మన దగ్గర వైరస్ వ్యాప్తి  సద్దుమణిగినా.. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. చైనా, దక్షిణ కొరియా, ఇజ్రాయెల్ లాంటి దేశాల్లో కొత్త వేరియంట్ బీఏ1.2 వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో ఇవాళ ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ కరోనా బారినపడ్డారు. ఆయనకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆ దేశపు మీడియా వెల్లడించింది.

ఇండియా పర్యటన డౌటే?

ఇజ్రాయెల్ ప్రధానిగా ఎన్నికయ్యాక నఫ్తాలీ బెన్నెట్ తొలిసారిగా భారత పర్యటనకు సిద్ధమైన సమయంలో ఇప్పుడు కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన ఇండియా టూర్ వాయిదా లేదా రద్దయ్యే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్ 3 నుంచి 5 వరకు ఆయన భారత్ లో పర్యటించాల్సి ఉంది. దీనిపై గత వారమే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ పర్యటన గురించి ప్రకటన విడుదల చేసింది. ప్రధాని మోడీ ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ మొదటిసారి భారత్ లో పర్యటించనున్నారని పేర్కొంది. ‘‘ఇజ్రాయెల్, భారత్ ల మైత్రి 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. అలాగే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 వసంతాలు పూర్తి అయింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెన్నెట్ ను మోడీ భారత్ కు ఆహ్వానించారు’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. వ్యవసాయం, ఇరిగేషన్, వాణిజ్యం, విద్య, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి తదితర రంగాల్లో ద్వైపాక్షిక బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ పర్యటన దోహదపడుతుందని విదేశాంగ శాఖ అభిప్రాయపడింది. అయితే ఈ సమయంలో ఆయనకు కరోనా రావడంతో పర్యటన జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.