బార్డర్‌లోని లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

బార్డర్‌లోని లెబనాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక

జెరూసలెం/బీరుట్ : దక్షిణ లెబనాన్​లో బార్డర్​కు సమీపంలో ఉన్న ప్రజలంతా ఇండ్లు ఖాళీ చేసి ఉత్తర ప్రాంతానికి వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ మంగళవారం హెచ్చరించింది. హెజ్బొల్లాపై గ్రౌండ్​ అటాక్స్ చేపట్టినందున ప్రజలు దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్నది హెజ్బొల్లా టెర్రరిస్టులతోనే తప్ప లెబనాన్ ప్రజలతో కాదని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) అధికార ప్రతినిధి డేనియల్ హగారి స్పష్టం చేశారు.

 2006లో ఇజ్రాయెల్–హెజ్బొల్లా యుద్ధం ముగింపు కోసం యూఎన్ తీర్మానం మేరకు దక్షిణ లెబనాన్ సరిహద్దులో బఫర్ జోన్ ఏర్పాటు చేశారని, కానీ ఇప్పుడు ఆ ప్రాంతంలో హెజ్బొల్లా టెర్రరిస్టులు తిష్ట వేశారన్నారు. ‘‘దక్షిణ లెబనాన్ బార్డర్ గ్రామాల్లో ఉన్న ప్రజలు అవాలీ నదికి ఉత్తరం వైపు వెళ్లిపోయి ప్రాణాలు కాపాడుకోవాలి. అలాగే లిటానీ నదికి దక్షిణాన ఉన్న ప్రజలు కూడా ఉత్తరం వైపు తరలిపోవాలి” అని చెప్పారు.

ఆపరేషన్ ‘నార్తర్న్ యారోస్’ షురూ.. 

లెబనాన్​లోని హెజ్బొల్లా స్థావరాలను ధ్వంసం చేసేందు కు తమ బలగాలు ఆపరేషన్ ‘నార్తర్న్ యారోస్’ను ప్రారంభించాయని మంగళవారం ఐడీఎఫ్ ప్రకటించింది. సోమవారం రాత్రి లెబనాన్ లోకి ప్రవేశించిన ఐడీఎఫ్ బలగాలు మంగళవారం పరిమిత స్థాయిలో దాడులు మొదలుపెట్టాయని వెల్లడించింది. పోయిన ఏడాది అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్​లోకి చొరబడి మారణహోమానికి పాల్పడిన తరహాలో హెజ్బొల్లా కూడా ఇజ్రాయెల్​పై దాడికి ప్లాన్ చేసిందని డేనియల్ హగారి ఆరోపించారు. ఇందుకోసం ‘కాంకర్ ది గలిలీ’ పేరుతో ఆపరేషన్ కు సిద్ధమైందని, దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు కానివ్వబోమని స్పష్టం చేశారు. అయితే, ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్​లోకి ప్రవేశించాయన్నది అబద్ధమని హెజ్బొల్లా వెల్లడించింది.