
గాజాస్ట్రిప్: గాజాలో ఉన్న సొరంగాలను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ ఆర్మీ దాడులు ముమ్మరం చేసింది. అక్కడే తలదాచుకుంటున్న లక్షలాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. తాగడానికి నీళ్లు, తినడానికి తిండి లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది మంది ప్రజలు గోదాముల్లో చొరబడి ఆహార పదార్థాలు తీసుకెళ్లిపోతున్నారు. వార్‌లో సెకండ్ స్టేజ్‌కు చేరుకున్నామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇప్పటికే ప్రకటించారు.
అయినా, గాజా వదిలిపెట్టి వెళ్లేందుకు సుమారు 23 లక్షల మంది ఇష్టపడటం లేదు. చేసేదేమీ లేక.. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏర్పాటు చేసిన నిత్యావసర సరుకుల గోదాముల్లోకి వెళ్లి గోధుమలు, పిండి ఇలా ఏది దొరికితే అది ఎత్తుకెళ్లిపోతున్నారని యూనైటెడ్ నేషన్స్ ఏజెన్సీ ఆదివారం వెల్లడించింది. షెల్టర్లలో వేలాది మంది గాజావాసులు తలదాచుకున్నట్లు పాలస్తీనాలోని యూఎన్ ప్రతినిధులు తెలిపారు. ఈజిప్టు నుంచి అరకొర సాయం అందుతున్నదని వివరించారు.
8వేల మంది పాలస్తీనీయులు మృతి
గడిచిన 24 గంటల్లో 450 మిలిటెంట్లు హతమార్చినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ఆదివారం ప్రకటించింది. చనిపోయిన వారిలో హమాస్ కమాండర్లు కూడా ఉన్నారని తెలిపింది. రాత్రికి రాత్రి గాజాలోని మరిన్ని ప్రాంతాలను చుట్టుముడుతామని తెలిపింది. ఫ్యూయెల్ సప్లై ఆపేసినట్లు వివరించింది. గాజాలో మరిన్ని టన్నెల్స్, రహస్య ప్రదేశాలు ఉన్నాయని తెలిపింది.
గాజా సిటీ హాస్పిటల్‌ను వెంటనే ఖాళీ చేయాల్సిందిగా గాజా అధికారులు ఆదేశించారు. 12 వేల మంది ఆశ్రయం పొందుతున్న అల్ఖుద్స్ హాస్పిటల్‌కు దాదాపు 50 మీటర్ల దూరంలో దాడులు జరిగిన నేపథ్యంలో ఈ అలర్ట్ జారీ చేసింది. వారం కిందే హాస్పిటల్స్‌ను ఖాళీ చేయాల్సిందిగా గాజావాసులకు ఇజ్రాయెల్ ఆర్మీ ఆదేశించింది.
వందలాది మంది వెంటిలేటర్‌పైనే ఉన్నారని, చిన్న పిల్లలకు ఆక్సిజన్ అందక చనిపోతున్నారంటూ డాక్టర్లు చెబుతున్నారు. ఖాన్ యూనిస్ సిటీలోని ఓ బిల్డింగ్‌పై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన వైమానిక దాడిలో 13 మంది చనిపోయారు. ఇప్పటి దాకా సుమారు 8వేల మంది పాలస్తీనియన్లు చనిపోయారు. 1,400 మంది ఇజ్రాయెలీలు చనిపోగా.. వారిలో 310 సైనికులు ఉన్నారు. 229 మంది బందీల్లో నలుగురిని టెర్రరిస్ట్‌లు వదిలిపెట్టారు.