గాజా హాస్పిటల్​పై ఇజ్రాయెల్ అటాక్.. 45 మంది పాలస్తీనీయులు మృతి

గాజా హాస్పిటల్​పై ఇజ్రాయెల్ అటాక్.. 45 మంది పాలస్తీనీయులు మృతి

గాజా స్ట్రిప్: గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక హాస్పిటల్ లక్ష్యంగా జరిపిన అటాక్​లో.. 45 మంది పాలస్తీనీయులు చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నారు. దాడులను గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. సాధారణ పౌరులను లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తున్నదని ఫైర్ అయింది. హాస్పిటల్​పై దాడులు చేయడం ఏంటని మండిపడింది. గాయపడిన వారికి చికిత్స అందిస్తున్న హాస్పిటల్స్​పై దాడుల చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ప్రకటించింది. ఈ దాడులు అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే అవుతుందని తెలిపింది. తాజా దాడులపై ఇజ్రాయెల్ స్పందించింది.

హమాస్ టెర్రరిస్టులు ప్రజలను రక్షణ కవచంలా ఏర్పాటు చేసుకుని తమపై దాడులకు పాల్పడుతున్నారని ఇజ్రాయెల్ ఆర్మీ పేర్కొన్నది. ప్రధానంగా హాస్పిటల్స్​లోనే హమాస్​లు తలదాచుకుంటున్నట్లు తమకు సమాచారం ఉందని వివరించింది. దవాఖానాలను సైనిక కార్యకలాపాల కోసం ఉపయోగిస్తున్నారని ఫైర్ అయింది. అందుకే గాజాలోని హాస్పిటల్​పై దాడి చేసినట్లు తేల్చి చెప్పింది. బందీలను వదిలేసి.. సీజ్ ఫైర్​కు ఒప్పుకుంటే దాడులు ఆపుతామని తెలిపింది. ఓడిపోయినట్లు హమాస్ టెర్రరిస్టులు ఒప్పుకోవాలని డిమాండ్ చేసింది. బందీల విడుదలపై హమాస్ టెర్రరిస్టులు స్పందించారు. గాజా నుంచి తమ సైన్యాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా ఉపసంహరించుకోవాలని హమాస్ డిమాండ్ చేస్తున్నది. యుద్ధాన్ని ముగిస్తే.. బందీలను అప్పగించేందుకు తాము సిద్ధమని ప్రకటించింది.