
- నిమిషాల వ్యవధిలోనే రెండు సార్లు అటాక్
- ముగ్గురు జర్నలిస్టులు సహా 15 మంది మృతి
- దాడులను ఖండించిన గాజా హెల్త్ మినిస్ట్రీ
- జర్నలిస్టుల మృతిపై మానవ హక్కుల సంఘాలు, మీడియా ఆందోళన
న్యూఢిల్లీ: గాజాపై ఇజ్రాయెల్ మిసైళ్ల వర్షం కురిపించింది. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు వైమానిక, యుద్ధ ట్యాంకులతో దాడులకు పాల్పడింది. సౌత్ గాజా ఖాన్ యూనిస్ సిటీలో ఉన్న నాసర్ మెడికల్ కాంప్లెక్స్ ను క్షిపణులతో పేల్చేసింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారు. మృతుల్లో ముగ్గురు జర్నలిస్టులు ఉన్నారని గాజా హెల్త్ మినిస్ట్రీ ప్రకటించింది. ముందుగా హాస్పిటల్ ఫోర్త్ ఫ్లోర్‌పై మిసైల్ దాడి జరిగింది.
వెంటనే స్పందించిన రెస్క్యూ టీమ్ ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది. గాయపడిన వారిని ట్రీట్మెంట్ కోసం తరలించింది. ఈ దాడి ఘటనను కవర్ చేసేందుకు పలువురు జర్నలిస్టులు అక్కడికి చేరుకున్నారు. అంతలోనే మరో మిసైల్ దూసుకొచ్చింది. దీంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. మృతుల సంఖ్య భారీగా పెరిగింది. పలువురు రెస్క్యూ సిబ్బంది, జర్నలిస్టులకు తీవ్ర గాయాలయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు.
అల్ జజీరా, రాయిటర్స్ జర్నలిస్టులు చనిపోయారని, మరొకరు ఏ మీడియా అనేది తెలియాల్సి ఉందని చెప్పారు. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గడిచిన 24 గంటల్లో 64 మంది చనిపోయారని, సుమారు 300 మంది గాయపడ్డారని వెల్లడించారు.
హాస్పిటల్‌పై దాడులను ఖండించిన గాజా
హాస్పిటల్‌పై జరిగిన దాడిపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు. ఈ దాడులను గాజా హెల్త్ మినిస్ట్రీ తీవ్రంగా ఖండించింది. ప్రజలు నివాసం ఉంటున్న బిల్డింగ్లు, హాస్పిటల్స్, శరణార్థి క్యాంపులే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతున్నదని మండిపడింది. గాజాలోని చాలా హాస్పిటళ్లను ఇజ్రాయెల్ పేల్చేసిందని తెలిపింది. దీంతో గాయపడిన వారికి సరైన మందులు, వైద్య సామాగ్రి దొరకడం లేదని పేర్కొన్నది. వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తున్నదని వివరించింది. సౌత్ గాజాలో నాసర్ హాస్పిటల్ చాలా పెద్దదని, ఇజ్రాయెల్ దాడులతో అది కూడా చాలా వరకు శిథిలమైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్‌లో ఇజ్రాయెల్ జరిపిన దాడిలో ముగ్గురు పౌరులు చనిపోయారు. పది మంది గాయపడ్డారని గుర్తుచేసింది.
ఆసుపత్రులలో నుంచే హమాస్ దాడులు: ఇజ్రాయెల్
హమాస్ టెర్రరిస్టులు హాస్పిటల్స్‌లో తిష్ట వేసి తమపై దాడులను చేస్తున్నారని ఇజ్రాయెల్ ముందు నుంచి ఆరోపిస్తూ వస్తోంది. క్షతగాత్రులు, రోగులను అడ్డం పెట్టుకుని దాడులకు దిగుతోందని మండిపడుతున్నది. తాము హమాస్ ఆపరేటింగ్ క్యాంపులపైనే అటాక్ చేస్తున్నట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ఇప్పటికే ప్రకటించింది. హాస్పిటల్ బేస్మెంట్లలో హమాస్ టెర్రరిస్టులు కమాండ్ అండ్ కంట్రోల్ రూం ఏర్పాటు చేసుకున్నారని తెలిపింది.
వాటిని నాశనం చేసేందుకే దాడులు చేస్తున్నట్లు చెప్పింది. కాగా, నాసర్ హాస్పిటల్‌పై జరిపిన దాడిలో ముగ్గురు జర్నలిస్టులు చనిపోవడంపై అంతర్జాతీయ మీడియా, మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. హాస్పిటల్స్, జర్నలిస్టులను టార్గెట్ చేయడం అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధం అని మండిపడ్తున్నాయి.