హమాస్​ను చీమల్లా నలిపేస్తం .. సరికొత్త గాజాను ఆవిష్కరిస్తం: నెతన్యాహు

హమాస్​ను చీమల్లా నలిపేస్తం .. సరికొత్త గాజాను ఆవిష్కరిస్తం: నెతన్యాహు
  • అదే తమ టార్గెట్ అని బెంజమిన్ నెతన్యాహు కామెంట్​

టెల్​అవీవ్/ గాజా: గాజాలో హమాస్ ఉనికి లేకుండా చేయడమే తమ లక్ష్యమని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోమారు తేల్చిచెప్పారు. మిలిటెంట్లతో పాటు వారు ఏర్పాటు చేసుకున్న పరిపాలనా వ్యవస్థను సమూలంగా తుడిచిపెట్టేస్తామని స్పష్టం చేశారు. ఇదంతా వ్యవస్థీకృతంగా చేస్తున్నామని, అందుకే ఆలస్యమవుతోందని వివరించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఇబ్బందులు ఎదుర్కొన్నా లక్ష్యం నెరవేరేదాకా కాల్పులు ఆపబోయేది లేదని చెప్పారు. గాజాలో కాల్పులు ఆపడమంటే హమాస్ కు లొంగిపోవడమేనని, అది ఎన్నటికీ జరగదని చెప్పారు.

హమాస్ చెరలో ఉన్న బందీలు ప్రతి ఒక్కరినీ క్షేమంగా ఇళ్లకు చేరుస్తామని, ఈ ప్రాసెస్ లో కొంత నష్టం వాటిల్లినా తట్టుకోవాల్సిందేనని చెప్పారు. కొన్ని సర్​ప్రైజ్​లు ఎదురవ్వొచ్చని, ఏదేమైనా సరే హమాస్ మిలిటెంట్లను చీమల్లా నలిపేస్తామని ఇజ్రాయెల్ ప్రజలకు మాటిస్తున్నానని తెలిపారు. హమాస్​ను ఓడిస్తామని, యుద్ధం తర్వాత కొత్త గాజాను ఆవిష్కరిస్తామని తెలిపారు. ఈమేరకు టెల్​ అవీవ్​లో జరిగిన కేబినెట్ మీటింగ్​లో నెతన్యాహు మాట్లాడారు. ఇజ్రాయెల్ ఇప్పుడు యుద్ధం మధ్యలో ఉందని చెప్పారు.

మొదటి దశలో శత్రువును దిగ్భందం చేశామని, రెండో దశలో వైమానిక దాడులు చేస్తున్నామని, మూడో దశలో గ్రౌండ్ అటాక్స్ తీవ్రం చేస్తామని వివరించారు. హమాస్ కు మద్దతుగా రావాలని ప్రయత్నిస్తే కనీవినీ ఎరుగుని దాడులతో విరుచుకుపడతామని హెజ్బొల్లా చీఫ్​ను నెతన్యాహు హెచ్చరించారు. 

ప్రపంచ దేశాలు మద్దతివ్వాలె..

హమాస్ మిలిటెంట్ల చేతుల్లో బంధీలుగా ఉన్న వారిని విడిపించడంలో ప్రపంచ దేశాలు మరింత చొరవ తీసుకోవాలని నెతన్యాహు అన్నారు. ఈ యుద్ధం కేవలం ఇజ్రాయెల్​ సమస్యే అనుకోవడం సరికాదని, ఇప్పుడు హమాస్ ను ఓడించకపోతే రేపు ఈ సమస్య వారిదాకా పాకుతుందని హెచ్చరించారు. అమెరికా ప్రెసిడెంట్​తో రోజూ మాట్లాడుతున్నానని, ఇతర దేశాలతో తన సహచరులు టచ్​లో ఉన్నారని చెప్పారు.

ఆన్​లైన్​లో ఇజ్రాయెల్​ ప్రచారం..

ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతిదాడుల్లో గాజాలో ఆస్తి, ప్రాణ నష్టం ఎక్కువగా ఉంది. పాలస్తీనియన్ల మరణాలను పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు దయనీయంగా చూపిస్తుండడంతో ఇజ్రాయెల్ అప్రమత్తమైంది. తమ దాడులను సమర్థించుకుంటూ ఆన్ లైన్ లో ప్రచారం మొదలు పెట్టింది. సరిహద్దులు దాటి ఇజ్రాయెల్ లోకి ఎంటరైన క్షణం నుంచి హమాస్ మిలిటెంట్లు చేసిన దారుణాలు, పాల్పడ్డ ఆకృత్యాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ప్రచారంలో పెట్టింది. మిలిటెంట్ల చేతుల్లో బంధీలుగా ఉన్న 230 మంది బాధితుల కుటుంబ సభ్యుల ఆవేదనను చాటిచెప్పేలా యాడ్స్ ఇస్తోంది.

కాలిపోయిన మృతదేహాలు, తెగిపడిన తలలు, రోడ్లపైన, కార్లలో పడి ఉన్న మృతదేహాల ఫొటోలతో హమాస్ మిలిటెంట్ల దారుణాలను ప్రపంచం ముందుంచేలా ప్రకటనలు ఇస్తోంది.  కాగా, హమాస్ కూడా ఇజ్రాయెల్ దాడులో చనిపోయిన వారి ఫొటోలతో ఆన్ లైన్  క్యాంపెయిన్ చేస్తోంది.