గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 64 మంది మృతి

గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు.. 64 మంది మృతి
  • హమాస్​ను అంతం చేస్తం: నెతన్యాహు

టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్  మరోసారి భీకర దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు దాడులు జరిపింది. ఈ అటాక్ లో 64 మంది చనిపోయారని పాలస్తీనా హెల్త్  అధికారులు తెలిపారు. డర్ అల్ బలాహ్, బీట్ లాహియా, ఖాన్ యూనిస్  నగరాలపై ఇజ్రాయెల్  బలగాలు అటాక్  చేశాయని వెల్లడించారు. బీట్ లాహియా, జాబాలియా శరణార్థి శిబిరాల నుంచి ప్రజలు ప్రాణ రక్షణ కోసం పరుగులు పెట్టారని పేర్కొన్నారు. 

కాగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్  గల్ఫ్  దేశాల పర్యటనతో హమాస్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి సీజ కొనసాగుతుందని, గాజాలో మానవతా సాయం మళ్లీ ప్రారంభమవుతుందని నిపుణులు ఆశించారు. అవేమీ జరగకపోగా.. ట్రంప్  పర్యటన ముగిసిన కొద్దిసేపటికే గాజాపై ఇజ్రాయెల్  విరుచుకుపడింది.

దాడులు మరింత తీవ్రం చేస్తం

హమాస్​తో యుద్ధం మరింత తీవ్రం చేస్తామని, హమాస్  టెర్రరిస్టులను పూర్తిగా తుదముట్టిస్తామని ఇజ్రాయెల్  ప్రధాని బెంజమిన్  నెతన్యాహు ఇటీవలే స్పష్టం చేశారు. గాజాను పాలిస్తున్న హమాస్  అంతమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ మేరకు నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘హమాస్​ను తుడిచిపెట్టేయాలనే బలమైన సంకల్పంతో మా బలగాలు ముందుకెళుతున్నాయి. ఇంకొద్ది రోజుల్లో గాజాలోకి ప్రవేశిస్తాయి” అని నెతన్యాహు పేర్కొన్నారు.