క్రియేటివిటీకి అంతరిక్షమే హద్దు : ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్

క్రియేటివిటీకి అంతరిక్షమే హద్దు : ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్
  • ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలి: ఇస్రో చైర్మన్ సోమనాథ్
  • స్పేస్ సెక్టార్​లో ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నామని వ్యాఖ్య
  • కార్టూన్లను అందరూ ఇష్టపడ్తరు: మంత్రి జూపల్లి
  • స్పేస్ టూన్ కార్టూన్ ఎగ్జిబిషన్​కు హాజరు

హైదరాబాద్/బషీర్ బాగ్, వెలుగు : క్రియేటివిటీకి అంతరిక్షమే హద్దు అని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ అన్నారు. ప్రతి ఒక్కరూ.. తాము ఎంచుకున్న రంగంలో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. స్పేస్ సెక్టార్​లో ఇండియా ఎన్నో అద్భుతాలు సృష్టిస్తున్నదని తెలిపారు. తక్కువ బడ్జెట్​తో ఎన్నో విజయాలు సాధిస్తున్నదని వివరించారు. హైదరాబాద్​లోని రవీంద్రభారతిలో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో తెలుగు రీజియన్ మళయాళీ అసోసియేషన్, హైదరాబాద్ ఫోరమ్ ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పేస్ టూన్ పేరుతో కార్టూన్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. 

ఈ కార్యక్రమానికి డాక్టర్ సోమనాథ్ హాజరై మాట్లాడారు. ‘‘నేను యువకుడిగా ఉన్నప్పుడు కార్టూన్లు వేసేవాణ్ని. నాకు కార్టూనిస్ట్​లు అంటే ఎంతో గౌరవం. వాళ్లు వేసే కార్టూన్స్​లో ఉండే చమత్కారం అందరినీ ఆశ్చర్యపరుస్తది. ఫేమస్ కార్టూన్ సిరీస్ టిన్ టిన్​లో వేసిన స్పేస్ షిప్ కార్టూన్స్​నన్ను ఎంతో ఆలోచింపజేసేవి. ఇస్రోకు చీఫ్ కావడం ఎంతో ఆనందంగా ఉంది’’అని సోమనాథ్ అన్నారు. 

స్పేస్ రంగంలో ఇండియా వేగంగా దూసుకెళ్లేందుకు కారణం సైంటిస్టులే అని తెలిపారు. కార్టూన్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన భాషా సాంస్కృతిక శాఖను డాక్టర్ సోమనాథ్ అభినందించారు. తర్వాత అంతరిక్ష పరిశోధనకు సంబంధించి స్టూడెంట్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. .

అందరినీ ఆలోచింపజేస్తాయి : మంత్రి జూపల్లి

కార్టూన్ అంటే మూడు అక్షరాలు.. మూడు గీతలే అయినప్పటికీ.. అందులో ముప్పై అర్థాలు దాగి ఉంటాయని మంత్రి జూపల్లి కృష్ణా రావు అన్నారు. కార్టూన్లు అందరినీ ఆలోచింపజేస్తాయని తెలిపారు. కార్టూన్.. అసామాన్యులనే కాకుండా.. సామాన్యులను కూడా ప్రభావితం చేయగల కళ అని అభిప్రాయపడ్డారు. శంకర్ పిళ్లై, ఆర్​కే.లక్ష్మణ్, ఈపీ ఉన్నీ వంటి ఎందరో ప్రఖ్యాత కార్టూనిస్టులు.. ఈ రంగాన్ని సుసంపన్నం చేశారని కొనియాడారు. 

సమకాలీన రాజకీయాలపై ఆర్కే లక్ష్మణ్ కార్టూన్లు చాలా కటువుగా ఉండేవన్నారు. కళాకారులతో పాటు కార్టూనిస్టులకు కూడా తెలంగాణ కేరాఫ్ అడ్రస్​గా నిలిచిందని తెలిపారు. కార్యక్రమంలో విద్యా, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, కేరళ కార్టూన్ అకాడమీ చైర్మన్ సుధీర్​నాథ్, హైదరాబాద్ ఫోరమ్ ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ అసోసియేషన్ చైర్మన్ శంకర్ పాల్గొన్నారు.