సెప్టెంబర్ 23న నిద్రలేవనున్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్​

సెప్టెంబర్ 23న నిద్రలేవనున్న  విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్​

న్యూఢిల్లీ: జాబిల్లిపై నిద్రాణ స్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్​లను మేలుకొలిపే ప్రక్రియను శనివారానికి వాయిదా వేసినట్లు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శుక్రవారం వెల్లడించింది. ఈ నెల 22న చంద్రుడిపై సూర్యోదయం అవుతుందని, ఆ తర్వాత ల్యాండర్, రోవర్ లను తిరిగి యాక్టివ్ చేస్తామని ఇస్రో సైంటిస్టులు గతంలో వెల్లడించారు. 

అయితే, అనుకోని కారణాల వల్ల ఈ ప్రాసెస్ ను శనివారానికి వాయిదా వేయాల్సి వచ్చిందని స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేశ్​ దేశాయ్ వివరించారు. చంద్రయాన్–3 ప్రాజెక్టులో భాగంగా పంపిన విక్రమ్ ల్యాండర్ ఆగస్టు 23న విజయవంతంగా జాబిల్లిపై దిగింది. ప్రజ్ఞాన్  రోవర్ బయటకు వచ్చి పలు పరిశోధనలను పూర్తిచేసింది. ఈలోగా చంద్రుడిపై సూర్యాస్తమయం కావడంతో విక్రమ్, ప్రజ్ఞాన్​లను ఇస్రో సైంటిస్టులు స్లీపింగ్​ మోడ్​లోకి పంపించారు. 14 రోజుల తర్వాత తిరిగి చంద్రుడిపై సూర్యోదయం కాగానే వీటిని యాక్టివ్ చేసేందుకు ప్లాన్ చేశారు.