సూర్యుడి వైపు ఆదిత్య ఎల్‌-1..!  మిషన్‌పై ఇస్రో కీలక అప్‌డేట్‌ 

సూర్యుడి వైపు ఆదిత్య ఎల్‌-1..!  మిషన్‌పై ఇస్రో కీలక అప్‌డేట్‌ 

సూర్యుడిపై పరిశోధనలకు ఉద్దేశించిన ఆదిత్య ఎల్‌-1 మిషన్‌పై భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఆదివారం (అక్టోబర్ 8న) కీలక అప్‌డేట్‌ అందించింది. అంతరిక్ష నౌక సక్రమంగానే పని చేస్తుందని, సూర్యుడి వైపు దూసుకుపోతోందని చెప్పింది. ఇప్పటికే భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసింది. అయితే.. సరైన మార్గంలో ఆదిత్య-ఎల్1ని ఉంచేందుకు కీలకమైన ఆపరేషన్‌ నిర్వహించినట్లు తెలిపింది. స్పెస్ క్రాఫ్ట్‌లోని ఇంజిన్లను 16 సెకన్ల పాటు మండించి.. ట్రాజెక్టరీ కరెక్షన్ మ్యాన్‌యూవర్ ను నిర్వహించినట్లు పేర్కొంది. అక్టోబర్​ 6వ తేదీన దిద్దుబాటు కార్యక్రమం జరిగిందని, ఈ ప్రక్రియలో స్వల్ప మార్పులు చేసినట్లు చెప్పింది.

ALSO READ : 16 సెకన్ల పాటు నిలిచిన ఆదిత్య ఎల్ 1..కారణమిదే

ఇలాంటి కరెక్షన్‌ను ఇస్రో చేపట్టడం ఇదే ఫస్ట్​ టైం. సెప్టెంబర్‌ 19వ తేదీన చివరిసారిగా ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ 1 ఇన్సర్షన్ మాన్యువర్‌ను పూర్తి చేసిన తర్వాత దాని ట్రాక్‌ను సరిచేయడానికి ఇది అవసరమని ఇస్రో పేర్కొంది. ట్రాన్స్-లాగ్రాంజియన్ పాయింట్ చుట్టూ హాలో ఆర్బిట్ చొప్పించాల్సి వచ్చినట్లు ఇస్రో చెప్పింది. ట్రాజెక్టరీ కరెక్షన్ చేయడంతో ఆదిత్య-ఎల్1 అంతరిక్ష వాహక నౌక.. ఉద్దేశించిన మార్గంలో కొనసాగుతోందనే విషయం నిర్ధారణకు వస్తుందని చెప్పింది. ఇంకొన్ని రోజుల్లో మాగ్నెటో మీటర్ మళ్లీ ఆన్ చేయనున్నట్లు వివరించింది. ఆదిత్య-ఎల్‌1 మిషన్‌ను సెప్టెంబర్ 2న ఇస్రో చేపట్టిన విషయం తెలిసిందే.

పీఎస్‌ఎల్‌ సీ-57 లాంచ్‌ వెహికిల్‌ నుంచి ఆదిత్య ఎల్‌-1ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. ఆంధ్రప్రదేశ్​లోని శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగం నిర్వహించింది. ఆ తర్వాత కక్ష్యను మార్చుకుంటూ సూర్యుడి వైపు బయలుదేరింది. దాదాపు 120 రోజుల పాటు ప్రయాణించి లాగ్రేంజియన్‌ పాయింట్‌కు చేరుకోనుంది. ఇది భూమికి 1.5 మిలియన్‌ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ నుంచి సూర్యుడిపై అధ్యయనం చేయనుంది. సౌర గాలులు, సౌర తుఫాన్లతో పాటు నక్షత్రాల అధ్యయనంలోనూ సహాయం అందించనుంది. నక్షత్రాలు, గెలాక్సీ, ఖగోళ శాస్త్రానికి సంబంధించి అనేక రహస్యాలను అర్థం చేసుకోవడంలో సహాయపడనుంది.