స్పేస్​లోకి మరో వెదర్ శాటిలైట్

స్పేస్​లోకి మరో వెదర్ శాటిలైట్
  • –వాతావరణం, భూఉపరితలం, సముద్రాలపై అధ్యయనం 
  • ఇన్ శాట్–3డీ, ఇన్ శాట్–3డీఆర్ సేవలకు కొనసాగింపుగా ప్రయోగం 

వాతావరణంపై అధ్యయనం చేసే ఇన్​శాట్ 3డీఎస్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. జియో సింక్రనస్  లాంచ్  వెహికల్ (జీఎస్ఎల్ వీ) ఎఫ్​ 14 రాకెట్  సాయంతో ఇన్​శాట్ 3డీఎస్  ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఏపీలోని శ్రీహరికోట నుంచి శనివారం సాయంత్రం ఈ ప్రయోగం జరిగింది. 2,274 కిలోల బరువున్న ఈ  ఇన్​శాట్ 3డీఎస్​ను వాతావరణ సమాచారం, విపత్తుల నిర్వహణ, భూ ఉపరితలం, సముద్రాలపై అధ్యయనం కోసం ప్రవేశపెట్టారు.

శ్రీహరికోట (ఏపీ): భూవాతావరణంపై అధ్యయనం చేసే ఇన్ శాట్–3డీఎస్ ఉపగ్రహాన్ని ఇస్రో విజయవంతంగా ప్రయోగించింది. జియోసింక్రనస్  లాంచ్  వెహికల్ (జీఎస్ఎల్వీ) ఎఫ్14 రాకెట్ సాయంతో ఇన్ శాట్–3డీఎస్ ను కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి శనివారం సాయంత్రం 5.35 గంటలకు ఈ ప్రయోగం జరిగింది. ఇన్ శాట్–3డీ థర్డ్  జనరేషన్  మెటియోరాలాజికల్  శాటిలైట్. ఇన్ శాట్–3డీ, ఇన్ శాట్– 3డీఆర్  ఉపగ్రహాలు అందిస్తున్న సేవలకు కొనసాగింపుగా ఇన్ శాట్– 3డీఎస్ ను ఇస్రో ప్రయోగించింది. వాతావరణ  సమాచారం అందించేందుకు, విపత్తుల నిర్వహణ, భూ ఉపరితలం, సముద్రాలపై అధ్యయనం చేసేందుకు ఈ ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టారు. అలాగే శాటిలైట్  ఎయిడెడ్  రీసర్చ్ అండ్  రెస్క్యూ సర్వీసెస్  కూడా ఈ ఉపగ్రహం అందిస్తుంది. 2,274 కిలోల బరువున్న ఇన్ శాట్–3డీఎస్  ఉపగ్రహాన్ని 51.7 మీటర్ల ఎత్తున్న జీఎస్ఎల్వీ ఎఫ్ 14 రాకెట్ దట్టమైన పొగలు జిమ్ముతూ నింగిలోకి తీసుకెళ్లింది. అనంతరం నిర్దేశించిన కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిందని ఇస్రో సైంటిస్టులు తెలిపారు. 2024లో ఇస్రోకు ఇది రెండో మిషన్. గత నెల 1వ తేదీన పీఎస్ఎల్వీ సీ58 (ఎక్స్ పోశాట్)  ప్రయోగాన్ని  ఇస్రో విజయవంతంగా చేపట్టింది. 

 ఇండియన్ వెదర్ శాటిలైట్లు గేమ్ చేంజర్లు

ఇండియన్  వెదర్  శాటిలైట్లు గేమ్  చేంజర్లు అని వాతావరణ, ఓషియన్  సైంటిస్ట్  స్పెషలిస్ట్, ఎర్త్ సైన్సెస్ శాఖ సెక్రటరీ  ఎం.రవిచంద్రన్  తెలిపారు. స్పేస్ లో ఉపగ్రహాలు నిఘా నేత్రాలని, తుఫాన్ లు ఎప్పుడు వస్తాయో చాలా కచ్చితంగా చెప్పడంలో ఆ శాటిలైట్లు మనకు చాలా సహకరించాయని ఆయన గుర్తుచేశారు. కాగా, 1970వ దశకంలో బంగాళాఖాతంలో తుఫాన్ ల కారణంగా 3 లక్షల  మంది చనిపోయారు. ఆ తర్వాత తుఫాన్ లను  కచ్చితంగా అంచనా వేసేందుకు సైంటిస్టులు వెదర్  శాటిలైట్లను అభివృద్ధి చేశారు. ఫలితంగా ఎప్పటికపుడు తుఫాన్ లను అంచనా వేసి వాతావరణ ఉపగ్రహాల సాయంతో మరణాలను గణనీయంగా తగ్గించగలిగారు. 

చెంగాళమ్మ ఆలయంలో సోమనాథ్  పూజలు 

ఇన్ శాట్ –3డీఎస్  ఉపగ్రహ ప్రయోగానికి ముందు ఇస్రో చైర్మన్  ఎస్.సోమనాథ్  శనివారం ఉదయం నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయాన్ని సందర్శించారు. జీఎస్ఎల్వీ–ఎఫ్​14 రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకుంటూ అమ్మవారికి ఆయన పూజలు చేశారు. అమ్మవారిని దర్శించిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. మిషన్  విజయవంతం కోసం చెంగాళమ్మ అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చానని చెప్పారు.  ఇస్రో చైర్మన్ తోపాటు పలువురు శాస్త్రవేత్తలు కూడా చెంగాళమ్మ టెంపుల్ ను దర్శించుకున్నారు.