అంతరిక్షంలో ఇండియాకు త్వరలో సొంత స్పేస్ స్టేషన్

అంతరిక్షంలో ఇండియాకు త్వరలో సొంత స్పేస్ స్టేషన్

అంతరిక్షంలో త్వరలోనే భారతదేశానికి సొంతంగా స్పేస్ స్టేషన్ ఏర్పాటుచేయబోతున్నామని ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ చైర్మన్ కె.శివన్ చెప్పారు. ఇందుకోసం ప్రయత్నాలు, పరిశోధనలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఢిల్లీలో అణుశక్తి, అంతరిక్ష పరిశోధన శాఖ సహాయమంత్రి జితేంద్ర సింగ్, ఇస్రో చైర్మన్ శివన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గగన్ యాన్ మిషన్ కు కొనసాగింపుగా ఈ ప్రతిష్టాత్మక ప్రయోగాన్ని చేయబోతున్నామని చెప్పారు.

అంతరిక్షంలో ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఒకటి మాత్రమే పూర్తిస్థాయిలో పనిచేస్తోంది. పలు దేశాలు ఏర్పాటుచేసిన స్పేస్ స్టేషన్లు కొన్ని పాక్షికంగా పనిచేస్తున్నాయి. మరికొన్ని ధ్వంసమయ్యాయి.

2022లో మానవ సహిత విమానాన్ని స్పేస్ లోకి పంపించేందుకు ఇస్రో ప్రయత్నాలు చేస్తున్నట్టు మంత్రి జితేంద్ర సింగ్ చెప్పారు. 2022లో దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ ప్రయోగం జరుపుతున్నామన్నారు. దీనిని మానిటర్ చేసేందుకు ప్రత్యేకంగా నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ను ఏర్పాటుచేశామన్నారు.

చంద్రయాన్ 1 కు కొనసాగింపుగా.. ఈ ఏడాది జులై 15న చంద్రయాన్ 2 ను నిర్వహిస్తున్నామని ఇస్రో తెలిపింది. ఈ ప్రయోగంలో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉంటాయని వివరించింది. సెప్టెంబర్ 5 లేదా 6 న స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై ఇంతవరకు ఏ దేశం అడుగుపెట్టని ప్రాంతంలో ల్యాండ్ అవుతుందని తెలిపింది.