ఇస్రో మరో విజయం.. పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగం సక్సెస్

 ఇస్రో మరో విజయం..  పుష్పక్ ల్యాండింగ్ ప్రయోగం సక్సెస్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో విజయం సాధించింది.  కర్ణాటకలోని చిత్రదుర్గలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్ (ATR)లో  'పుష్పక్' పునర్వినియోగ ప్రయోగ వాహనాన్ని విజయవంతంగా  చేపట్టింది. భారత వైమానిక దళం చినూక్ హెలికాప్టర్ ద్వారా పుష్పక్‌ను పైకి లేపి 4.5 కి.మీ ఎత్తు నుంచి విడుదల చేసినట్లు ఇస్రో తెలిపింది. దీంతో దేశ సాంకేతిక సామర్థ్యాలను విస్తృతం చేసుకోవడంతో పాటు అంతరిక్ష యాత్రల ఖర్చును భారీగా తగ్గించుకునేందుకు ఆర్‌ఎల్‌వీ దోహదపడనుంది.

పుష్పక్ ఆర్ఎల్వీని అభివృద్ధి చేయడానికి దాదాపు దశాబ్దా కాలం పట్టింది. మొదటిసారిగా 2016లో శ్రీహరికోట నుంచి దీనిని విజయవంతంగా ప్రయోగించారు. స్పేస్ లోకి వెళ్లి వచ్చిన తర్వాత రాకెట్.. బంగాళాఖాతంలోని వర్చువల్  రన్ వేపై సురక్షితంగా ల్యాండ్  అయింది. అయితే, దీనిని రికవరీ చేయలేదు. అనుకున్నట్లుగానే ఇది సముద్రంలో మునిగిపోయింది. అలాగే 2023 ఏప్రిల్ 2న కర్నాటకలోని చిత్రదుర్గ ఏరోనాటికల్  టెస్ట్  రేంజ్  నుంచి రెండోసారి విజయవంతంగా దీనిని ప్రయోగించారు. ఇండియన్  ఎయిర్  ఫోర్స్ కు చెందిన చినూక్  హెలికాప్టర్  సాయంతో దీనిని గాలిలోకి తీసుకుపోయి భూమి మీదకు జారవిడిచారు. 

‘పుష్పక్  విమాన్’ రామాయణంలో ఉందని, కుబేరుడికి ఇది వాహనమని సోమనాథ్ చెప్పారు. అందుకే ఆర్ఎల్వీకి పుష్పక్  అనే పేరు సరిగ్గా ఉంటుందనే ఆ పేరుపెట్టామని వివరించారు. భవిష్యత్తులో పుష్పక్   రాకెట్  ద్వారా మంచి ఆదాయం కూడా వస్తుందని  విక్రమ్  సారాభాయ్  స్పేస్  సెంటర్  అడ్వాన్స్  టెక్నాలజీ అండ్  సిస్టమ్స్  గ్రూప్  ప్రోగ్రాం డైరెక్టర్  సునీల్  తెలిపారు. కాగా, పుష్పక్ ఆర్ఎల్వీ  పొడవు 6.5 మీటర్లు, బరువు 1.75 టన్నులు ఉంటుంది. ఐఏఎఫ్​ హెలికాప్టర్  సాయంతో దీనిని ప్రయోగిస్తారు. దీనిని తయారు చేయడానికి కేంద్రం రూ.100 కోట్ల నిధులు కేటాయించింది.