
న్యూఢిల్లీ: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో మరో కీలక ముందడుగు పడింది. గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన పారాచూట్ డిప్లాయ్‌మెంట్ ట్రయల్స్‌ను ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. చండీగఢ్‌లోని ఆర్టీఆర్ఎస్లో చేపట్టిన ఈ పారాచూట్ పరీక్షలు విజయవంతమైనట్లు ప్రయోగానికి సంబంధించిన వీడియో విడుదల చేసింది ఇస్రో.
రాకెట్-స్లెడ్‌పై నిర్వహించిన ఈ పరీక్షలు మోర్టార్-ప్యాక్డ్ పారాచూట్‌లు హై-స్పీడ్ రీ-ఎంట్రీ సమయంలో సురక్షితంగా మోహరించగలవని నిరూపించాయని ఇస్రో పేర్కొంది. గగన్‌యాన్ సిబ్బంది ప్రయాణించే క్యాప్సూల్ భూమిపైకి తిరిగి వచ్చే సమయంలో దాని వేగాన్ని తగ్గించి స్థిరీకరించడానికి ఈ పారాచూట్‌ను రూపొందించింది ఇస్రో.
►ALSO READ | 400 కేజీల RDX, 14 మంది పాక్ టెర్రరిస్టులు వచ్చారు : ముంబై పోలీసులకు వాట్సాప్ వార్నింగ్స్
ఇస్రో వివరాల ప్రకారం.. గగన్ యాన్ పారాచూట్ పరీక్షలు 2025 ఆగస్టు 8, 10వ తేదీల మధ్య చండీగఢ్‌లోని టెర్మినల్ బాలిస్టిక్స్ రీసెర్చ్ లాబొరేటరీ (TBRL) రైల్ ట్రాక్ రాకెట్ స్లెడ్ (RTRS)లో జరిగాయని తెలిపింది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరిగాయి. పారాచూట్ వ్యవస్థ అధిక వేగంతో సురక్షితంగా తెరుచుకోగలదా..? క్యాప్సూల్ తిరిగి ప్రవేశించే పరిస్థితులను తట్టుకోగలదా అనే అంశాలను పరిశీలించారు. మొత్తం మూడు దశల్లో పారాచూట్ ప్రయోగాలు చేయగా.. ప్రతి ట్రయల్ విజయవంతమైనట్లు అధికారులు ధృవీకరించారు.