చరిత్రకు అడుగు దూరంలో.. చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌తో ల్యాండర్‌ అనుసంధానం

చరిత్రకు అడుగు దూరంలో.. చంద్రయాన్‌ 2 ఆర్బిటర్‌తో ల్యాండర్‌ అనుసంధానం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టిన ప్రతిష్ఠాత్మక చంద్రయాన్‌-3 కీలక దశకు చేరుకుంది. ల్యాండర్‌ మాడ్యూల్‌.. చందమామకు మరింత చేరువైంది. ప్రొపల్షన్ మాడ్యుల్ నుంచి ఇప్పటికే విడిపోయిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ ప్రస్తుతం.. చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తున్నాయి. ఈ క్రమంలో ఇస్రో శాస్త్రవేత్తలు సోమవారం కీలక ప్రకటన చేశారు. 

2019లో చంద్రయాన్‌-2 మిషన్‌లో భాగంగా ఇస్రో పంపించిన ఆర్బిటర్‌ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఆర్బిటర్‌తో చంద్రయాన్‌-3కి చెందిన ల్యాండర్‌ మాడ్యుల్‌ను విజయవంతంగా అనుసంధానించినట్లు ఇస్రో ట్వీట్‌ చేసింది. చంద్రయాన్ 3 ల్యాండర్ మాడ్యుల్‌కు చంద్రయాన్ 2 ఆర్బిటర్ స్వాగతం పలికిందన్నది ఆ ట్వీట్ సారాంశం.

"స్వాగతం.. మిత్రమా! చంద్రయాన్‌-2 ఆర్బిటర్.. చంద్రయాన్‌-3 ల్యాండర్‌ మాడ్యుల్‌ను స్వాగతిస్తోంది. ప్రస్తుతం ఈ రెండింటి మధ్య పరస్పర సమాచార మార్పిడి జరుగుతోంది. డేటాను ఎక్స్ఛేంజ్ చేసుకుంటున్నాయి. ల్యాండర్‌ మాడ్యుల్‌ను చేరుకునేందుకు బెంగళూరులోని ఇస్ట్రాక్(ISTRAC) కేంద్రానికి ఇప్పుడు మరిన్ని దారులు ఉన్నాయి.." అని ఇస్రో ట్వీట్ చేసింది.

కాగా, చంద్రయాన్‌-3 సాఫ్ట్‌ ల్యాండింగ్ ప్రక్రియ ప్రత్యక్ష ప్రసారాలు బుధవారం 5:20 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై కాలుమోపనుంది.

చంద్రయాన్‌-2

నాలుగేళ్ళ క్రితం 2019 జులై 22న ఇస్త్రో.. చంద్రయాన్‌-2 మిషన్‌ను ప్రయోగించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా ఆర్బిటర్‌, ల్యాండర్‌, రోవర్‌లతో కూడిన 'జీఎస్‌ఎల్వీ మార్క్‌-111 ఎం1' రాకెట్‌ భూమిపై నిప్పులు చిమ్ముతా నింగిలోకి దూసుకెళ్లింది. అయితే.. అది చంద్రుడి ఉపరితలంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగే చివరి క్షణాల్లో విఫలమైంది. కానీ ఆర్బిటర్‌ మాత్రం చంద్రుడి కక్ష్యలో విజయవంతంగా తిరుగుతోంది. మరో ఏడేళ్లు ఈ ఆర్బిటర్‌ సేవలు అందించనుంది. ఈ నేపథ్యంలోనే ఇస్రో.. చంద్రయాన్‌-3లో ఆర్బిటర్‌ను పంపలేదు.