
- భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్) ఫస్ట్ మాడ్యూల్ ను ఆవిష్కరించిన ఇస్రో
- నేషనల్ స్పేస్ డే సందర్భంగా ఢిల్లీ భారత మండపంలో ప్రదర్శన
న్యూఢిల్లీ:ఇండియాకు సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటు దిశగా ఇస్రో కీలక ముందడుగు వేసింది. భారతీయ అంతరిక్ష స్టేషన్ (బీఏఎస్) తొలి మాడ్యూల్ ను శుక్రవారం ఆవిష్కరించింది. బీఏఎస్ లో భాగంగా మొత్తం ఐదు మాడ్యూళ్లను పంపాల్సి ఉండగా, తొలి మాడ్యూల్ (బీఏస్01)ను 2028 నాటికల్లా అంతరిక్షానికి పంపనున్నట్టు ఇస్రో వెల్లడించింది. నేషనల్ స్పేస్ డే (ఆగస్ట్ 23) సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని భారత మండపంలో ప్రారంభమైన రెండు రోజుల వేడుకల్లో ఈ మేరకు ప్రదర్శనకు ఉంచిన బీఏఎస్01 సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలిచింది.
కాగా, వచ్చే 2035 నాటికి మొత్తం ఐదు మాడ్యూళ్లను 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ లోకి పంపి, బీఏఎస్ నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఇస్రో భావిస్తోంది. ప్రస్తుతం అంతరిక్షంలో అమెరికా సహా 5 దేశాల స్పేస్ ఏజెన్సీలు నిర్వహిస్తున్న ఐఎస్ఎస్, చైనా సొంత స్పేస్ స్టేషన్ ‘తియాంగాంగ్’ మాత్రమే ఉన్నాయి. బీఏఎస్ నిర్మాణంతో సొంత స్పేస్ స్టేషన్ కలిగి ఉన్న దేశంగా ఇండియా అవతరించనుంది.
బీఏఎస్ ప్రత్యేకతలు ఇవే..
భారతీయ అంతరిక్ష స్టేషన్ మాడ్యూల్ 10 టన్నుల బరువు, 3.8 మీటర్ల ఎత్తు, 8 మీటర్ల పొడవు ఉంటుంది. బీఏఎస్ ను పూర్తి స్వదేశీ టెక్నాలజీతోనే ఇస్రో నిర్మిస్తోంది. ఇందులో ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్ట్ సిస్టం(ఈసీఎల్ఎస్ఎస్), భారత్ డాకింగ్ సిస్టం, భారత్ బెర్తింగ్ మెకానిజం, ఆటోమేటెడ్ హ్యాచ్, జీరో గ్రావిటీ రీసెర్చ్, టెక్నాలజీ ప్రదర్శన వేదిక, వ్యూపోర్టులు ఉంటాయి. ఇంధనాన్ని, ఈసీఎల్ఎస్ఎస్ ఫ్లూయిడ్లను రీఫిల్ చేసుకునేందుకూ అవకాశం ఉంటుంది. అంతరిక్ష శకలాలు, ఉల్కాపాతం, రేడియేషన్ నుంచి బీఏఎస్ లోని ఆస్ట్రోనాట్లకు పటిష్టమైన రక్షణ ఉంటుంది. అంతరిక్షంలో మనుషుల ఆరోగ్యంపై పడే ప్రభావం, ఔషధాలు, గ్రహాంతర పరిశోధనలతోపాటు స్పేస్ టూరిజానికి కూడా బీఏఎస్ వేదిక కానుంది.