- 520 కి.మీ. ఎత్తులోని కక్ష్యలోకి 6 వేల కిలోల శాటిలైట్
- ఇప్పటివరకు భారత్ నుంచి ఇదే అతి పెద్ద పేలోడ్
- అమెరికన్ కంపెనీ శాటిలైట్‌తో స్పేస్ నుంచే స్మార్ట్ ఫోన్లకు ఇంటర్నెట్
శ్రీహరికోట(ఏపీ): ఇస్రో బాహుబలి రాకెట్ ‘లాంచ్ వెహికల్ మార్క్3(ఎల్వీఎం3)’ మరోసారి సత్తా చాటింది. అమెరికన్ కంపెనీ ‘ఏఎస్టీ స్పేస్ మొబైల్’కు చెందిన అతి భారీ ఉపగ్రహం ‘బ్లూబర్డ్ బ్లాక్–2’ను విజయవంతంగా కక్ష్యలోకి చేర్చింది. బుధవారం ఉదయం 8.55 గంటలకు ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్(షార్) నుంచి నిప్పులు కక్కుతూ నింగికి ఎగసిన ఎల్వీఎం3ఎం6 రాకెట్.. 15 నిమిషాల్లోనే శాటిలైట్ ను భూమికి 520 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి సక్సెస్ ఫుల్ గా ప్రవేశపెట్టింది. సుమారు 6,100 కిలోల బరువైన బ్లూబర్డ్ బ్లాక్ 2 కమ్యూనికేషన్ శాటిలైట్ ను పర్ఫెక్ట్ గా కక్ష్యలోకి చేర్చడం ద్వారా ప్రపంచంలోనే అతి భారీ శాటిలైట్ ప్రయోగాల్లో ఇస్రో కూడా సత్తా చాటినట్టయింది. ఇక భారత గడ్డపై నుంచి ఇప్పటివరకూ నిర్వహించిన ఉపగ్రహ ప్రయోగాల్లో ఇదే అత్యంత బరువైన ఉపగ్రహంగా నిలిచింది. అయితే, షెడ్యూల్ కంటే 90 సెకన్లు ఆలస్యంగా ప్రయోగం జరిగింది. శ్రీహరికోట మీదుగా అంతరిక్షంలో కొన్ని శాటిలైట్లు, శకలాలు వెళ్తుండటంతో వాటిని ఢీకొట్టే ముప్పును తప్పించడం కోసం ప్రయోగాన్ని కాస్త ఆలస్యం చేశామని, రాకెట్ ప్రయోగాల్లో ఇది సాధారణమేనని ఇస్రో తెలిపింది. కాగా, 43.5 మీటర్ల ఎత్తు, 640 టన్నుల బరువైన ఎల్వీఎం3 రాకెట్ లో ఎర్త్ ఆర్బిట్(160 నుంచి 800 కి.మీ. వరకు) లోకి 10 వేల కిలోల పేలోడ్ ను, భూస్థిర బదిలీ కక్ష్య(30 వేల కి.మీ. వరకు)లోకి 4,200 కిలోల పేలోడ్ ను మోసుకెళ్లగలదు. చివరిసారిగా పోయిన నెల 2న సీఎంఎస్3 శాటిలైట్ ను ఎల్వీఎం3ఎం5 రాకెట్ ద్వారా ప్రయోగించారు. అంతకుముందు చంద్రయాన్2, చంద్రయాన్3 ప్రయోగాలనూ ఈ రాకెట్ విజయవంతంగా పూర్తి చేసింది.
స్పేస్ నుంచి నేరుగా స్మార్ట్ ఫోన్లకు నెట్
అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్ మొబైల్ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఏ మూలన ఉన్నా.. స్మార్ట్ ఫోన్ లకు నేరుగా స్పేస్ నుంచి ఇంటర్నెట్ ను అందించేందుకు వీలుగా బ్లూబర్డ్ బ్లాక్2 శాటిలైట్ల నెట్ వర్క్ ను అంతరిక్షంలో ఏర్పాటు చేస్తోంది. శాటిలైట్ ఫోన్ ల మాదిరిగా కాకుండా సాధారణ స్మార్ట్ ఫోన్ లలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేకుండానే ఈ శాటిలైట్ల ద్వారా బ్రాడ్ బ్యాండ్ సేవలు అందనున్నాయి. ఇందులో భాగంగా ఇప్పటికే 5 కమ్యూనికేషన్ శాటిలైట్లను ప్రయోగించగా, అమెరికాతోసహా పలు దేశాల్లో సేవలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) వాణిజ్య విభాగం న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ తో ఒప్పందం చేసుకున్న ఆ కంపెనీ.. తన ఆరో శాటిలైట్ ను శ్రీహరికోట నుంచి అంతరిక్షానికి చేర్చింది.
ఇది అత్యుత్తమ ప్రయోగం: ఇస్రో చైర్మన్ నారాయణన్
ఎల్వీఎం3ఎం6 రాకెట్ ప్రయోగం పూర్తి కచ్చితత్వంతో విజయవంతం అయిందని ఇస్రో చైర్మన్ డాక్టర్ వి. నారాయణన్ ప్రకటించారు. బుధవారం ప్రయోగం అనంతరం ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మీడియాతో మాట్లాడారు. ‘‘భారత భూభాగం నుంచి ఇదే అతి బరువైన ఉపగ్రహ ప్రయోగం. ఎల్వీఎం3 రాకెట్ ద్వారా చేపట్టిన మూడో కమర్షియల్ మిషన్. ఇప్పటివరకూ అన్ని ప్రయోగాలనూ ఈ రాకెట్ విజయవంతంగా కంప్లీట్ చేసింది. తాజాగా ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రయోగాల్లో ఒకటిగా చెప్పుకోదగ్గ మిషన్ ను కూడా పర్ఫెక్ట్ గా పూర్తి చేసింది” అని నారాయణన్ వెల్లడించారు.
ఇండియా స్పేస్ సెక్టార్లో ముందడుగు: మోదీ
ఎల్వీఎం3ఎం6 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం దేశ అంతరిక్ష రంగంలో కీలక ముందడు గు అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అతి బరువైన ఉపగ్రహాన్ని పూర్తి కచ్చితత్వంతో కక్ష్యలోకి చేర్చడం పట్ల ఇస్రో సైంటిస్టులకు ఆయన అభినందనలు తెలిపారు. భారీ ఉపగ్రహాల ప్రయోగాల్లో అంతర్జాతీయ మార్కెట్ లో భారత్ పాత్ర మరింత పెరిగేలా ఈ ప్రయోగం దోహదం చేస్తుందని ఆయన ఆకాంక్షించారు.
