చంద్రుడిపై మళ్లీ కమ్ముకుంటున్న చీకట్లు.. విక్రమ్, ప్రజ్ఞాన్​లపై ఆశలు గల్లంతు!

చంద్రుడిపై మళ్లీ కమ్ముకుంటున్న చీకట్లు.. విక్రమ్, ప్రజ్ఞాన్​లపై ఆశలు గల్లంతు!
  • స్లీప్ మోడ్​లోనే ల్యాండర్, రోవర్​
  • ఇస్రో చేసిన ప్రయత్నాలు విఫలం

న్యూఢిల్లీ: చంద్రుడిపై సూర్యుడు అస్తమిస్తుండటంతో చీకట్లు కమ్ముకున్నాయి. రెండు వారాల పాటు పరిశోధనలు సాగించిన విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్‌‌‌‌లు ప్రస్తుతం శివ్ శక్తి పాయింట్ వద్ద స్లీప్ మోడ్‌‌లో ఉండిపోయాయి. వాటిని మేల్కొల్పేందుకు ఇస్రో సైంటిస్టులు చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. సెప్టెంబర్ 30 నుంచే అక్కడ మళ్లీ సూర్యాస్తమయం ప్రారంభం కావడంతో సూర్య కాంతి తగ్గడం ప్రారంభమైంది. ఈ నెల 6 కల్లా అక్కడ మళ్లీ పూర్తిగా చీకట్లు కమ్ముకుని లూనార్ నైట్ ప్రారంభం కానుంది.

అంతకుముందు లూనార్ డేలో విజయవంతంగా పని చేసిన ల్యాండర్, రోవర్ లు.. సెప్టెంబర్ 2 నుంచి స్లీప్ మోడ్ లోకి వెళ్లాయి. తర్వాత అక్కడ మళ్లీ సూర్యోదయం అయినా తిరిగి అవి స్లీప్‌‌ మోడ్‌‌ నుంచి బయటికి రాకపోవడంతో వాటిని మేల్కోల్పేందుకు ఇస్రో తీవ్రంగా ప్రయత్నించింది. అయితే, విక్రమ్, ప్రజ్ఞాన్ ఇప్పటికే మిషన్ ను పూర్తి చేశాయని, ఇప్పుడు అవి శాశ్వతంగా మూగబోయినా పెద్దగా చింతించాల్సిన పని లేదని ఇస్రో ఇదివరకే వెల్లడించింది. అవి చంద్రుడిపై మన గుర్తులుగా శాశ్వతంగా ఉండిపోతాయని పేర్కొంది.