ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఎత్తివేయాలి

V6 Velugu Posted on Sep 14, 2021

రాష్ట్రంలో ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఎత్తివేసి, వర్క్‌‌ ఫ్రమ్ ఆఫీస్ విధానాన్ని తిరిగి స్టార్ట్ చేయాలని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ (డీహెచ్) డాక్టర్ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఐటీ కంపెనీలను ఆధారంగా చేసుకుని బతుకుతున్న లక్షల మంది చిరు వ్యాపారుల గురించి ఐటీ యాజమాన్యాలు ఆలోచించాలని కోరారు. వారంతా ఉపాధి కోల్పోయి ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని డీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. కోఠిలోని తన ఆఫీసులో సోమవారం మీడియా సమావేశంలో డీహెచ్ మాట్లాడారు. వర్క్ ఫ్రమ్ ఆఫీస్ విధానం స్టార్ట్ చేస్తే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కూడా గాడినపడే అవకాశం ఉందన్నారు. కరోనా గురించి భయపడాల్సిన అవసరం లేదని, ఐటీ ఎంప్లాయీస్ అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారని చెప్పారు. అవసరమైతే ప్రత్యేకంగా వ్యాక్సినేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. దీనిపై ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌కు తాము నివేదిక కూడా ఇచ్చామన్నారు. 

కరోనా కంట్రోల్ అవుతోంది.. 

రాష్ట్రంలో కరోనా పూర్తిగా కంట్రోల్‌‌లోకి వచ్చిందని, థర్డ్ వేవ్ సూచనలు కూడా లేవని శ్రీనివాసరావు అన్నారు. జనాలు వ్యాక్సిన్లు వేయించుకుని, మాస్కులు ధరిస్తే చాలని.. ఇంకే రూల్స్ పాటించాల్సిన అవసరం లేదన్నారు. థర్డ్‌‌ వేవ్‌‌పై వచ్చిన సర్వేలు సైంటిఫిక్ గా లేవని డీహెచ్ స్పష్టం చేశారు. అయినా, తాము అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నామన్నారు. 250 టన్నుల ఆక్సిజన్ ప్లాంట్లు సిద్ధమయ్యాయని, మరో 250 టన్నులకు సంబంధించిన ప్లాంట్ల పనులు జరుగుతున్నాయన్నారు. పిల్లల కోసం 4 వేల బెడ్లు ఏర్పాటు చేశామని చెప్పారు. స్కూళ్లు స్టార్ట్ అయ్యాక 1.15 లక్షల మంది పిల్లలకు కరోనా టెస్టులు చేస్తే, 55 మందికి మాత్రమే పాజిటివ్ వచ్చిందన్నారు. పిల్లలను స్కూళ్లకు పంపడానికి భయపడొద్దన్నారు.  
 
వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచుతున్నం

కరోనా వ్యాక్సినేషన్ స్పీడ్ పెంచుతున్నామని, రెండ్రోజుల్లో స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ అవుతుందని డీహెచ్ తెలిపారు. ప్రస్తుతం 20 లక్షల డోసులు అందుబాటులో ఉన్నాయని, ఈనెలలో మరో 55 లక్షల డోసులు వచ్చే చాన్స్ ఉందన్నారు. రాష్ట్రంలో 2.8 కోట్ల మంది ఉండగా, ఇందులో 49% (1.36 కోట్లు) మంది కనీసం ఒక్క డోసు టీకా కూడా తీసుకోలేదన్నారు. 54,05,099 మందికి రెండు డోసులు, 89,46,022 మందికి సింగిల్ డోసు వ్యాక్సినేషన్ పూర్తయిందన్నారు. ప్రతి ఒక్కరూ రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకోవాలని కోరారు. వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్ కేసులు అస్సలు నమోదు కావడం లేదని తెలిపారు.

ప్రైవేట్ హాస్పిటళ్లు దోచుకుంటున్నయ్ 
 
ఇన్నాళ్లు కరోనా పేరిట, ఇప్పుడు డెంగీ పేరిట ప్రజలను ప్రైవేటు హాస్పిటళ్లు దోచుకుంటున్నాయని డీహెచ్ అన్నారు. ప్లేట్‌‌‌‌‌‌‌‌లెట్స్‌‌‌‌‌‌‌‌ తగ్గాయని ప్రజలను భయపెట్టి, భారీ దోపిడీకి పాల్పడుతున్నాయని చెప్పారు. ‘‘ప్లేట్‌‌‌‌‌‌‌‌లెట్ల కౌంట్ 10 వేల కంటే తగ్గితేనే, కొత్తవి ఎక్కించాల్సి ఉంటుంది. కానీ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ప్లేట్‌‌‌‌‌‌‌‌లెట్ కౌంట్ లక్ష ఉన్నవాళ్లకు కూడా ఎక్కిస్తున్నారు” అని శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటివరకూ 3,144 డెంగీ కేసులు, 613 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. డెంగీ, మలేరియా ఎక్కువగా ఉన్న కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో చర్యలు చేపట్టామన్నారు. వైరల్ ఫీవర్స్‌‌‌‌‌‌‌‌, డెంగీ, మలేరియా ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్ కు ప్రభుత్వ దవాఖాన్లలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అయితే, దోపిడీకి పాల్పడుతున్న ప్రైవేటు హాస్పిటళ్లపై తీసుకున్న చర్యలేమిటని డీహెచ్ ను ప్రశ్నించగా, ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. నైతిక విలువలు పాటించాలని ప్రైవేట్ హాస్పిటళ్ల యాజమాన్యాలకు సూచిస్తున్నామని చెప్పారు. 

Tagged IT Companies, lift , work from home policy

Latest Videos

Subscribe Now

More News