
ఈ ఏడాది చరిత్రలో ఎన్నడూ కనీవిని ఎరుగని స్థాయిలకు బంగారం, వెండి రేట్లు పెరిగాయి. ముందుగా బంగారం రేటు 63 శాతం పెరగగా.. వెండి రేటు ఏకంగా 100 శాతం పెరిగి గోల్డ్ కంటే ఎక్కువ రాబడిని ఇన్వెస్టర్లకు తెచ్చిపెట్టింది. దీంతో బంగారం కంటే వెండి 37 శాతం అధిక రాబడిని తెచ్చిపెట్టింది. పండుగల సీజన్ దీపావళి, ధనత్రయోదశి దగ్గరపడుతున్న కొద్దీ ఈ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయి. కొందరు అవసరం కోసం కొంటుంటే మరికొందరు భవిష్యత్తులో కొనలేమనే భయంతో బంగారం, వెండి షాపింగ్ చేస్తున్నారు.
పారిశ్రామికంగా వెండి వినియోగం పెరగటం ప్రధానంగా సిల్వర్ రేట్లు పెంచేస్తోంది. సోలార్, ఏఐ, ఎలక్ట్రిక్ కార్ల తయారీ రంగాల్లో వెండి వాడకం పెరిగిపోయింది. దీనికి అనుగుణంగా వెండి సరఫరా అంతర్జాతీయంగా లేకపోవటం రేట్ల ర్యాలీకి కారణంగా నిలుస్తోంది. వాస్తవానికి బంగారానికి ప్రత్యేకంగా గనులు ఉన్నట్లు వెండికి ఉండవు. అనేక దేశాల్లో ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పర్యవేక్షణలో భాగంగా మైనింగ్ నియంత్రణల కారణంగా సరఫరా తగ్గిందని తేలింది.
వాస్తవానికి 70 శాతం వెండి ఇతర లోహాల మైనింగ్ సమయంలో ఉప ఉత్పత్తిగా వస్తుంటుంది. ఉదాహరణకు రాకి, జింక్ వంటి తవ్వకాల్లో వెండి దొరుకుతుంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వెండి సరఫరా పెరగాలంటే రాగి మైనింగ్ పెరగాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడే మార్కెట్లో డిమాండ్ సప్లై స్థిరీకరణ కుదురుతుందని చెబుతున్నారు. దాదాపు 5 ఏళ్ల కింద దీపావళి సమయంలో కేజీ వెండి రేటు రూ.40వేల దగ్గరగా ఉంది. కానీ ప్రస్తుతం కేజీ సిల్వర్ ఏకంగా రూ.2 లక్షలు క్రాస్ చేసేసింది రెండు తెలుగు రాష్ట్రాల్లో.
ALSO READ : వజిర్ఎక్స్ క్రిప్టో ఎక్స్ఛేంజీ కేసులో బాంబేహైకోర్టు కీలక తీర్పు..
ఈ క్రమంలో స్వల్ప కాలం కోసం వెండిని కొనాలనుకుంటున్న పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే 100 శాతం పెరిగిన నేపథ్యంలో అగ్రసివ్ కొనుగోళ్లకు దూరంగా ఉండటం మంచిదని మరికొందరు సూచిస్తున్నారు. చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి ఊపందుకోవటంతో వెండి డిమాండ్ అనేక రంగాల్లో పెరిగిందని.. రేట్లు తగ్గినప్పుడు కొనుక్కోవటం మంచి ప్లాన్ అని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ నిపుణులు అంజు గుప్తా చెప్పారు. ప్రస్తుతం ప్రజలు భౌతిక వెండి, సిల్వర్ ఈటీఎఫ్, సిల్వర్ ఫ్యూచర్స్ అలాగే డిజిటల్ వెండి ఎస్ఐపీల్లో పెట్టుబడులు పెట్టొచ్చు.
చాలా మంది వెండి బంగారం కొనుగోళ్ల కోసం అప్పులు చేయటం లేదా తమ స్థలాలు, పొలాలను అమ్మటం లాంటి చర్యలకు దిగుతున్నారని.. ఇది సరైన పద్ధతి కాదని చాలా మంది నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం 10 నెలల్లోనే 100 శాతం రాబడి చూసి చాలా మంది పెట్టుబడిదారులు ఫోమోలో సిల్వర్ కొంటున్నట్లు తెలుస్తోంది.