గాయని బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు: సీఎం రేవంత్

గాయని బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు: సీఎం రేవంత్

హైదరాబాద్: తెలుగు చలనచిత్ర రంగం తొలి నేపథ్య గాయని రావు బాలసరస్వతి మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దక్షిణాదిలో తొలి నేపథ్య గాయనిగా, తెలుగు సినిమా రంగానికి లలిత సంగీతాన్ని పరిచయం చేసిన బాలసరస్వతి దేవి మరణం చలనచిత్ర రంగానికి తీరని లోటు అని పేర్కొన్నారు. శోకతప్తులైన వారి కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

కాగా, తెలుగు సినిమా స్వర్ణయుగానికి తన మధుర గానంతో పునాది వేసిన తొలితరం నేపథ్య గాయని, నటి రావు బాలసరస్వతీ దేవి (97) వయోభారం, అనారోగ్య సమస్యలతో బుధవారం (అక్టోబర్ 15) కన్నుమూశారు. లలిత సంగీత సామ్రాజ్ఞి'గా తెలుగు ప్రజల హృదయాలలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న ఆమె మృతితో సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. రావు బాలసరస్వతీ దేవి మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని సంతాపం తెలిపారు.

రావు బాలసరస్వతీ దేవి నేపథ్యం

రావు బాలసరస్వతీ దేవి ఆగష్టు 28, 1928, వెంకటగిరిలో జన్మించారు. ఆమె  చిన్న వయస్సులోనే కళారంగానికి అంకితమయ్యారు. నాలుగో ఏట నుంచే పాటలు పాడుతూ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. ఆరేళ్ల వయసులోనే 'హిస్ మాస్టర్స్ వాయిస్ (HMV)' సంస్థ తరఫున తొలి సోలో గ్రామ్‌ఫోన్ పాటను రికార్డు చేసి రికార్డు సృష్టించారు.  బాలసరస్వతీ దేవి 1944లో కోలంక రాజావారిని వివాహం చేసుకున్నారు.

 'సతీ అనసూయ' లో నటిగా.. 

1936లో ప్రఖ్యాత దర్శకుడు సి. పుల్లయ్య రూపొందించిన 'సతీ అనసూయ', 'భక్త ధ్రువ' చిత్రాలలో బాల నటిగా, గాయనిగా సినీరంగ ప్రవేశం చేశారు. తెలుగులో నేపథ్య గానానికి నాంది పలికిన ఘనత ఆమెకే దక్కుతుంది. 1943లో విడుదలైన 'భాగ్యలక్ష్మి' చిత్రంలో ఆమె పాడిన 'తిన్నె మీదా సిన్నోడా' పాట తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి ప్లేబ్యాక్ గీతంగా చరిత్రలో నిలిచిపోయింది. దీనితో పాటు ఆమె 'ఇల్లాలు' (1940), 'చంద్రహాస' (1941), 'స్వప్న సుందరి' (1950), 'దేవదాసు' (1953) వంటి అనేక చిత్రాలలో తన మధుర గాత్రాన్ని వినిపించారు.

తొలి లలిత సంగీత గాయనిగా ...

ఆమె కేవలం నటి, గాయనిగానే కాక, ఆకాశవాణిలో తొలి లలిత సంగీత గాయనిగా కూడా ప్రసిద్ధి చెందారు. తెలుగుతో పాటు తమిళం చిత్రాలలోనూ నటించి, పాటలు పాడారు. సంగీత ప్రపంచానికి ఆమె అందించిన సేవలకు గుర్తింపుగా రామినేని ఫౌండేషన్ అవార్డుతో సహా పలు పురస్కారాలను అందుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ చలనచిత్రాలను తన గానంతో, నటనతో ప్రభావితం చేసిన రావు బాలసరస్వతీ దేవి తెలుగు సినిమా చరిత్రలో ఒక చిరస్మరణీయ అధ్యాయాన్ని లిఖించారు. ఆమె మరణం సినీ రంగానికి తీరని లోటును మిగిల్చింది.