భారత్‌లోని చైనా మొబైల్ కంపెనీల పన్ను ఎగవేత!

భారత్‌లోని చైనా మొబైల్ కంపెనీల పన్ను ఎగవేత!

భారత్‌లో ఉన్న అనేక చైనా మొబైల్ తయారీ కంపెనీలపై ఇన్‌కమ్‌ ట్యాక్స్ (ఐటీ) అధికారులు రైడ్స్ చేశారు. ఆయా కంపెనీలు భారీ పన్ను ఎగ్గొట్టినట్లు  రిపోర్ట్స్ రావడంతో నిన్నటి నుంచి రెండ్రోజుల పాటు సుదీర్ఘంగా రైడ్స్ సాగాయని న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ పేర్కొంది. ఒప్పో, షియోమీ, వన్‌ ప్లస్ సహా పలు మొబైల్ తయారీ కంపెనీల్లో ఈ రైడ్స్ జరిగాయి. దాదాపు పన్నెండుకు పైగా కంపెనీలపై ఢిల్లీ, ముంబై, బెంగళూరు, గ్రేటర్‌‌ నోయిడా, కోల్‌కతా, గౌహతి, ఇండోర్, తమిళనాడులో పెరుంగుడి, కాంచీపురంలలో ఒకేసారి ఈ దాడులు సాగాయని తెలుస్తోంది. ఈ కంపెనీల తయారీ యూనిట్లు, గోడౌన్లు, కార్పొరేట్ ఆఫీసులు, సీఈవో కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేసి పన్ను ఎగవేతలకు సంబంధించి కంప్యూటర్లు, హార్డ్‌ డిస్కులను సీజ్‌ చేశారని సమాచారం. సీఈవోలను ఐటీ అధికారులు ఇంటరాగేషన్‌ కూడా చేశారని ఏఎన్‌ఐ పేర్కొంది. మొబైల్ తయారీ కంపెనీలతో పాటు కొన్ని ఫిన్ టెక్‌ కంపెనీలపైనా ఈ రైడ్స్ జరిగాయని వెల్లడించింది. చాలా కాలం నుంచి ఈ కంపెనీలపై నిఘా పెట్టి.. పన్ను ఎగవేతలపై పక్కా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్‌తోనే రైడ్స్ చేసినట్లు తెలిసింది. 

బోగస్‌ లెక్కలతో పన్ను ఎగవేత.. ఇదే తొలిసారి కాదు

భారత్‌లో పని చేస్తున్న చైనా కంపెనీలపై ఐటీ రైడ్స్ జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో ఈ ఏడాది ఆగస్టులోనే చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మొబైల్ కంపెనీ ZTE ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. దేశంలో ఉన్న కంపెనీ కార్పొరేట్ ఆఫీస్, మొబైల్ తయారీ యూనిట్స్, ఆ సంస్థ ఫారెన్ డైరెక్టర్ ఇల్లు, కంపెనీ సెక్రెటరీ ఇల్లు, అకౌంట్స్ సిబ్బంది ఇళ్లలోనూ నాడు రైడ్స్ జరిగాయి. ఆ సమయంలో ఇంపోర్ట్ బిల్స్, సేల్స్ బిల్స్ పరిశీలించగా.. కంపెనీకి 30 శాతం లాభం వచ్చినట్లు తేలింది. అయితే కంపెనీ మాత్రం చాలా ఏండ్లుగా నష్టాల్లోనే ఉన్నట్లు చూపిస్తూ వస్తోంది. ఖర్చుల్లో బోగస్ లెక్కలు చూపించి.. ఆ నష్టాలను లెక్కల్లో రాసినట్లు ఐటీ అధికారుల ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. కొన్ని చోట్ల సర్వీస్‌ చేసినట్లు చూపించిన బిల్లులను పరిశీలించగా.. అవన్నీ ఫేక్ అడ్రస్‌లని తేలినట్లు నాడు ఐటీ డిపార్ట్‌మెంట్ పేర్కొంది.