ఇబ్రహీంపట్నం : స్నేహితుడి వద్దకు వెళ్లి తిరిగివస్తున్న నలుగురు సాఫ్ట్వేర్ఇంజినీర్లు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరి కారు డివైడర్‌ను ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా.. ఇద్దరికి తీవ్ర, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. ఆదిభట్ల ఎస్సై సైదయ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా దొనకొండకు చెందిన పత్తి నారాయణస్వామి(31), మధుకుమార్‌రెడ్డి, విజయ్‌కుమార్, వంశీకృష్ణ స్నేహితులు. నారాయణస్వామి దొనకొండలోనే ఉంటుండగా.. మిగతావారు అల్మాస్‌గూడలో ఓ గది అద్దెకు తీసుకొని ఉంటున్నారు. శనివారం సాయంత్రం నారాయణస్వామి అల్మాస్‌గూడకు రాగా.. అందరూ కలిసి కారులో ఇబ్రహీంపట్నంలో ఉండే స్నేహితుడి వద్దకు వెళ్లారు. తిరిగి ఆదివారం తెల్లవారుజామున బీఎన్.రెడ్డి నగర్పైపు వెళ్తున్నారు.
రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ మాసబ్ చెరువు కట్టపై కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నారాయణస్వామి అక్కడికక్కడే మృతి చెందాడు. మధుకుమార్‌రెడ్డి, విజయ్‌కుమార్ తీవ్ర గాయాలయ్యాయి. వంశీకృష్ణ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మధుకుమార్‌రెడ్డి, విజయ్‌కుమార్ పరిస్థితి సీరియస్‌గా ఉన్నట్లు ఎస్సై తెలిపారు. వారు బీఎన్.రెడ్డి నగర్‌లోని ఓ ప్రైవేట్హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
