ఐశ్వర్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం..తక్షణ సాయంగా రూ.50వేలు

ఐశ్వర్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం..తక్షణ సాయంగా రూ.50వేలు

కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ లోని కస్తూర్బా పాఠశాలలో చనిపోయిన విద్యార్థిని ఐశ్వర్య కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇస్తామని జాయింట్ కలెక్టర్ రాజేశం ప్రకటించారు. ఐశ్వర్య కుటుంబానికి తక్షణ సాయం కింద రూ.50వేలు అందించారు. మరో రూ.15 లక్షల ఎక్స్ గ్రేషియా కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. కస్తూర్బా గాంధీ ఎస్ఓ స్వప్నతోపాటు రాత్రి విధుల్లో ఉన్న టీచర్ శ్రీలత, ఏఎన్ఎం భారతిని సస్పెండ్ చేశారు. దీంతో ఐశ్వర్య కుటుంబ సభ్యులు ఆందోళన విరమించారు. 

మంగళవారం రాత్రి స్కూల్ భోజనం తిన్న ఐశ్వర్యకు.. ఉదయం వేళ నోటి నుంచి నురగలు రావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పటల్ కు తీసుకెళ్లారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. మృతురాలు ఐశ్వర్యది కాగజ్ నగర్ మండలం అంకుశ్ పూర్ గ్రామం.

అంతకుముందు.. కాగజ్ నగర్ లోని కస్తూర్బా స్కూల్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఐశ్వర్య మృతదేహంతో కస్తూర్బా స్కూల్ ముందు కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. కస్తూర్బా గాంధీ ఎస్ఓ కార్యాలయంలోని ఫర్నీచర్ ధ్వంసం చేశారు. సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఐశ్వర్య మృతి చెందిందని ఆరోపించారు. ఐశ్వర్య కుటుంబానికి మద్దతుగా స్కూల్ వద్ద తల్లిదండ్రులు, స్థానికులు ధర్నా చేశారు. వర్షంలోనూ ఐశ్వర్య మృతదేహంతో ఆందోళన కొనసాగించారు. దీంతో బాధ్యులైన వారిని తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్టు జాయింట్ కలెక్టర్ రాజేశం ప్రకటించారు.