రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు మొదలై మూన్నెళ్లయినా ఇంకా పూర్తికాలె

రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు మొదలై మూన్నెళ్లయినా ఇంకా పూర్తికాలె
  • కొనాల్సింది 1.12 కోట్ల టన్నులు.. కొన్నది 64 లక్షల టన్నులే

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో వడ్ల కొనుగోళ్లు మొదలై మూన్నెళ్లయినా ఇంకా పూర్తికాలేదు. సర్కారు పెట్టుకున్న టార్గెట్‌‌‌‌‌‌‌‌లో కనీసం 60 శాతం వడ్లు కూడా కొనలేదు. గత వానాకాలంలో రికార్డు స్థాయిలో వరి పంట సాగు కాగా.. కొనుగోళ్లలో మాత్రం సర్కారు విఫలమైంది. గత ఏడాది అక్టోబర్​ప్రారంభంలో వరి కోతలు మొదలవగా.. అదే నెల 22న సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్​మెంట్ కొనుగోలు సెంటర్లు ఓపెన్​ చేసింది. కానీ, దాదాపు 20 రోజులు అసలు కొనుగోళ్లు చేపట్టకుండా నిర్లక్ష్యం చేసింది. ఆ తర్వాత కూడా అన్ని సెంటర్లు సరిగ్గా తెరవకపోవడంతో రైతులు ఇబ్బంది పడ్డరు. సర్కారు జాప్యంతో కొందరు రైతులు పొలాల్లోనే ప్రైవేటు వ్యాపారులకు అగ్గువ అమ్ముకున్నరు.

60 శాతం వడ్లు కూడా కొనలే

మూన్నెళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లో 9.76 లక్షల మంది రైతుల నుంచి 64.30 లక్షల టన్నుల వడ్లు మాత్రమే సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై డిపార్ట్​మెంట్ కొన్నది. మొత్తం 7,024 కొనుగోలు సెంటర్లు ఏర్పాటు చేయగా.. 6,375 కేంద్రాల్లో మాత్రమే కొనుగోళ్లు పూర్తయ్యాయి. ఇంకా 649 సెంటర్లలో కొనుగోళ్లు సాగుతూనే ఉన్నాయి. వానాకాలం వడ్లు 1.12 కోట్ల టన్నులు కొనాలని సర్కారు  టార్గెట్​గా పెట్టుకున్నప్పటికీ.. ఇప్పటి వరకు కేవలం 57శాతం వడ్లు మాత్రమే కొన్నది. రోజుకు లక్ష టన్నులు కొనాల్సి ఉండగా.. ఆ స్థాయిలో కొనలేదు.  దీన్ని బట్టి కొనుగోళ్లు 65 నుంచి 66 లక్షల టన్నులకు మించే పరిస్థితి కనిపించడం లేదని ఎక్స్​పర్ట్స్​అంటున్నరు. పోయినేడాది ఇదే సమయానికి 70.46 లక్షల టన్నులు కొనుగోలు చేశారు. 

రికార్డు స్థాయిలో సాగైనా.. కొన్నది కొంతే

గత వానాకాలంలో రాష్ట్రంలో 64.54 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. రాష్ట్ర చరిత్రలో ఇంత వరి ఎప్పుడూ సాగవ్వలేదు. ఎకరానికి యావరేజీగా 25 క్వింటాళ్లు వచ్చినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన 1.61 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని సర్కారు అంచనాలు ఉన్నాయి. రైతుల అవసరాలు, ప్రైవేటు వ్యాపారుల కొనుగోళ్లు పోగా.. 1.12 కోట్ల టన్నుల వడ్లు రైతుల నుంచి కొనాలని టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకుంది. కానీ సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లై శాఖ ఆ టార్గెట్​ను పూర్తి చేయలేకపోతోంది.

తరుగు, చార్జీల భయంతో వ్యాపారులకు అమ్ముకున్న రైతులు

సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ డిపార్ట్​మెంట్ ఏర్పాటు చేసిన సెంటర్లలో రైతు నిలువుదోపిడీకి గురయ్యాడు. తేమ, తాలు పేరుతో తరుగు తీయడం, హమాలీ చార్జీలు, లారీలు రాక బస్తాకు రూ.2 చొప్పున క్వింటాల్​కు రూ.5 వసూలు చేశారు. లారీ డ్రైవర్లకు భోజనాల ఖర్చులు రైతులే భరించాల్సి వస్తున్నది. హమాలీల ఖర్చు కింద క్వింటాల్​కు రూ.43పైగా తీసుకున్నరు. తాలు, తరుగు పేరుతో బస్తాకు 2 కిలోలు కోత పెడుతున్నారు. సుత్లీ, కాంటా, రవాణా, గన్నీ సంచులు, హమాలీ చార్జీలన్నీ సర్కారే​ భరించాలి. కానీ, ఆ ఖర్చంతా రైతులపైనే పడ్డది. దీంతో రైతులు అగ్గువకు వ్యాపారులకు అమ్ముకోవాల్సి వచ్చింది.