కమిషన్​లోని ఇంటి దొంగలే  ప్రధాన కారణం : సీపీఎం నాయకులు

కమిషన్​లోని ఇంటి దొంగలే  ప్రధాన కారణం : సీపీఎం నాయకులు
  •       దోషులను కఠినంగా శిక్షించాలని సీపీఎం నాయకుల డిమాండ్ 

ముషీరాబాద్, వెలుగు: టీఎస్ పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీపై సమగ్ర విచారణ జరపాలని సీపీఎం హైదరాబాద్ నగర కార్యదర్శి శ్రీనివాస్ డిమాండ్​ చేశారు. ఈ మేరకు గురువారం గోల్కొండ క్రాస్ రోడ్ లోని ఆ పార్టీ నగర కార్యాలయం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ వరకు నిరసన ప్రదర్శన చేపట్టారు. టీఎస్ పీఎస్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్ల కార్డ్స్ ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రశ్నపత్రాల లీకేజీ కారణంగా లక్షలాది మంది నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురయ్యారని అన్నారు. ఇందులో కమిషన్​లోని ఇంటి దొంగలే ప్రధాన కారణంగా కనిపిస్తున్నప్పటికీ.. ఈ ఘటనకు సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలన్నింటినీ విచారించాలని డిమాండ్​ చేశారు. కమిషన్ చైర్మన్, కమిటీ సభ్యులు నైతిక బాధ్యత వహించి పదవుల నుంచి తప్పుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వమే వారిని తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కార్యదర్శి వర్గ సభ్యులు ఎం. దశరథ్, కె. నాగలక్ష్మి, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.