భూములు కబ్జా చేశాననడం మతి లేని చర్య

భూములు కబ్జా చేశాననడం మతి లేని చర్య

నేను భూములు కబ్జా చేశాననడం మతి లేని చర్య అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. మంత్రి స్థాయిలో ఉన్న నేనే బెదిరించి అసైన్డ్ భూమి తీసుకుంటే .. మరి సీఎం స్థాయిలో ఉన్న కేసీఆర్ హైదరాబాద్ లో ఎన్ని వేల ఎకరాలు తీసుకొని ఉంటాడని అన్నారు. అధికారులు పిచ్చోల్లా..చట్టం ప్రకారం నడుచుకోవాలని అన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలో బీజేపీ  రెండు రోజుల శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఈటల...ఈ సందర్భంగా మాట్లాడారు.

ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని  కేసీఆర్ అపహాస్యం చేస్తున్నాడని విమర్శించారు ఈటల రాజేందర్. చిన్న లొసుగును ఆధారం చేసుకుని 2014 లో టీడీపీని..2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసి ఆ పార్టీని కేసీఆర్ మింగేసాడని ఆరోపించారు. చట్టసభల్లో ప్రశ్నించే గొంతు లేకుండా  చేశారన్నారు. రాష్ట్రంలో అంబేద్కర్ అందించిన రాజ్యాంగం అమలు కావడం లేదని.. కేసీఆర్ రాజ్యాంగం అమలు అవుతోందని అన్నారు. హుజురాబాద్ ఎన్నికల్లో ప్రపంచ చరిత్రలో మనిషి హోదాను బట్టి రేట్ నిర్ణయించి డబ్బు పంచారన్నారు. 600 కోట్లను అక్రమ సొత్తును, 4 వేల కోట్లు సంక్షేమ పథకాల పేరిట ఖర్చు చేసి.. పొలీస్ వ్యాన్లలో డబ్బు తెచ్చి పంచిన నీచ చరిత్ర కేసీఆర్ దన్నారు.

ఏనాడు MPTCలను పట్టించుకోని వారికి కేసీఆర్ మళ్లీ టిక్కెట్లు ఇచ్చారని అన్నారు ఈటల. స్వయంగా పోలీసు కమిషనర్, కలెక్టర్ బెదిరింపులకు గురి చేసి నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని తెలిపారు. నామినేషన్ వేసిన వాళ్ళను కేసులు పెట్టి విత్ డ్రా చేయించారని ఆరోపించారు. మండలి ఎన్నికల్లో ఓటు వేసి ఫొటో తీసుకోవాలని టీఆర్ఎస్ నేతలు ఓటర్లను బెదిరిస్తున్నారని అన్నారు. దయచేసి MPTC,MPP,ZPTCలు ఆలోచించి అంతరాత్మ సాక్షిగా ఓటు వేయలని కోరారు. 

రాజ్యాంగ ఉల్లంఘన కు పాల్పడుతున్న వ్యక్తి కేసీఆర్ అని అన్న ఈటల..హుజురాబాద్ తరహాలో కేసీఆర్ కి చెంపపెట్టు లాగా మండలిలో ఓటు వేయాలని ఓటర్లను కోరారు. ప్రజల విశ్వాసం కోల్పోయిన వాళ్లే బెదిరింపులకు దిగుతారని అన్నారు.