
వెజిటేరియన్‌గా మారిపోవాలని చాలామంది అనుకుంటారు. కానీ నాన్‌వెజ్ క్రేవింగ్స్‌ను అదుపు చేసుకోలేక ఇబ్బంది పడుతుంటారు. ఈ సమస్యకు చెక్ పెడుతూ కొత్తరకం మాంసం పుట్టుకొచ్చింది. దీన్ని ‘వెజ్ మీట్’ అని పిలుస్తున్నారు. ఇది అచ్చంగా చికెన్, మటన్ లాగానే ఉంటుంది. కానీ ఇది జంతువుల మాంసం కాదు, ప్లాంట్ బేస్డ్ మీట్.
దేశంలో వెజిటేరియన్, వీగన్ ట్రెండ్స్ బాగా పెరిగాయి. ఈ ట్రెండ్‌లో భాగంగానే వెజిటేరియన్ ఫుడ్స్‌లో కొత్తకొత్త రకాలు పుట్టుకొస్తున్నాయి. వెజిటేరియన్ మీట్ కూడా అలాంటిదే. ప్లాంట్ బేస్డ్ మీట్.. రుచిలో మాంసానికి ఏమాత్రం తీసిపోదు. ఒక సర్వే ప్రకారం వెజిటేరియన్ మీట్‌ను మాంసాహారులే ఎక్కువగా తింటున్నారని తేలింది. దీన్ని బట్టి వెజ్ మీట్ రుచి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు తాజాగా ప్లాంట్ బేస్డ్ సీ ఫుడ్ కూడా మొదలైంది. మొక్కల నుంచి తయారు చేసిన రొయ్యలకు డిమాండ్ మామూలుగా లేదు.
హెల్దీయేనా?
పోషకాల విషయంలో ఈ మాంసం ఎందులోనూ తక్కువకాదు. రెగ్యులర్ మాంసం కంటే ఇందులోనే ఎక్కువ పోషకాలుంటాయి. కావాలంటే తయారు చేసేటప్పుడే పోషకాల మోతాదు పెంచుకోవచ్చు కూడా. వ్యక్తుల ఆరోగ్యానికి, అవసరాలకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు. పైగా ఈ మాంసంలో ట్రాన్స్ ఫ్యాట్స్, కొలెస్ట్రాల్ లాంటివి ఉండవు. ప్లాంట్ బేస్డ్ మీట్‌లో ఉండే ప్రొటీన్స్‌ను.. సోయా, బటానీ, మష్రూమ్, ఆలూ, బ్రౌన్ రైస్ నుంచి సేకరిస్తారు. కూరగాయలు, నట్స్‌లో ఉండే పోషకాలన్నీ ఇందులో ఉంటాయి. విటమిన్స్, మినరల్స్, డైటరీ ఫైబర్‌కు ఎలాంటి లోటూ ఉండదు. హెల్త్ పరంగా చూస్తే రెగ్యులర్ మాంసం కంటే ప్లాంట్ బేస్డ్ మీట్ కచ్చితంగా ఒక మెట్టు పైన ఉంటుంది. డయాబెటిస్, కొలెస్ట్రాల్ లాంటి సమస్యలున్నవారికి ఇదొక మంచి ఆల్టర్నేటివ్.
ట్రెండ్ ఇదే
ప్లాంట్ బేస్డ్ మీట్ ఇప్పుడిప్పుడే ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అవుతోంది. మనదేశంలో కూడా ఈ ట్రెండ్ మొదలైంది. ప్లాంట్ బేస్డ్ ఫుడ్‌ను ఫాలో అయ్యే వీగన్స్‌కు ఇది ఎంతగానో నచ్చింది. అందుకే దీన్ని ‘వీగన్ మీట్’ అని కూడా అంటున్నారు. మనదేశంలో ముంబైలోని ‘బ్లూ ట్రైబ్ ఫుడ్స్’ సంస్థ.. సోయా, బటానీలతో చికెన్ నగ్గెట్స్, చికెన్ కీమా తయారుచేస్తోంది. ఢిల్లీలోని ‘అహింస ఫుడ్’ వెజిటేరియన్ ఫిష్, వెజ్ మటన్, వెజ్ చికెన్ హాట్ డాగ్స్ అమ్ముతోంది. హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో ఉన్న ‘ప్లాంటేరియం కేఫె’లో వంద శాతం ప్లాంట్ బేస్డ్ అంటూ చికెన్ కర్రీ, కీమా పులావ్, ఎగ్ రైస్, టోఫు బటర్ మసాలా, ఎగ్ బుర్జీ, చిల్లీ మాక్ చికెన్ వంటకాలు తయారు చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ నటులు జెనీలియా, రితేష్ దేశ్‌ముఖ్ జంట.. ‘ఇమాజిన్ మీట్స్’ పేరుతో వెజ్ మీట్ వెంచర్‌ను మొదలుపెడుతున్నట్టు చెప్పారు. అయితే అందరూ వండుకునే విధంగా వెజ్ మీట్.. మార్కెట్స్‌లోకి రావడానికి ఇంకా టైం పట్టొచ్చు.
ఇలా కూడా..
ప్లాంట్ బేస్డ్ మీట్‌తో పాటు రకరకాల ఇతర ఆర్టిఫిషియల్ మాంసాలు కూడా ఇటీవల పుట్టుకొచ్చాయి. మొక్క కణాలకు బదులు జంతు కణాలను వృద్ధి చేసి.. కల్చర్డ్ మీట్ లేదా కల్టివేటెడ్ మీట్ తయారు చేస్తున్నారు. అంటే జంతువులను చంపకుండా జంతు కణాలను ఉపయోగించి ల్యాబ్‌లో మాంసాన్ని తయారుచేయడం అన్నమాట. దీన్ని టెస్ట్ ట్యూబ్స్, బయోరియాక్టర్లతో తయారుచేస్తారు.
రుచి వెనుక..
వెజిటేరియన్ మీట్‌కు మాంసం ఫ్లేవర్ వచ్చేందుకు ఈస్ట్ ఎక్స్‌ట్రాక్ట్ వాడతారు. ఈస్ట్‌ను వాడడం వల్ల రుచి, వాసన అచ్చం మాంసం లాగానే ఉంటాయి. ఇక వండేటప్పుడు ఎలాగూ ఉల్లి, వెల్లుల్లి, అల్లం, మిరియాలను కచ్చితంగా వాడతారు. దీంతో వెజ్ మీట్ రుచి పర్ఫెక్ట్‌గా కుదురుతుంది.
తయారీ ...
ప్లాంట్ బేస్డ్ మీట్‌ను మొక్కల నుంచి సేకరించిన ప్రొటీన్ కణాలతో తయారుచేస్తారు. ప్రొటీన్ కణాలను లవణాలు, ప్రొటీన్లు, పిండిపదార్థాలతో కూడిన ద్రావణంలో ఉంచి, కణాలు డెవలప్ అయ్యేలా చేస్తారు. ఇలా చేయడం ద్వారా ప్రతి 24 గంటలకు కణాల సంఖ్య రెట్టింపు అవుతుంది. అలా కొంతకాలానికి ప్రొటీన్లతో కూడిన మాంసం తయారవుతుంది. కణాల నుంచి తయారయ్యే మాంసం చూడ్డానికి ఒక ముద్దలా ఉంటుంది. ఇది పది రోజుల పాటు నిల్వ ఉండగలదు. రెగ్యులర్ మాంసం.. సాల్మొనెల్లా, ఇ.కొలి వంటి బ్యాక్టీరియాలతో త్వరగా పాడవుతుంది. కానీ పరిశుభ్రమైన వాతావరణంలో తయారు చేసే ఈ వెజ్ మీట్ పాడయ్యే అవకాశం చాలా తక్కువ.