నేతలు పార్టీలు మారడం సరికాదు

నేతలు పార్టీలు మారడం సరికాదు

శంషాబాద్, వెలుగు: దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను పురస్కరించుకుని శంషాబాద్​ మండలం ముచ్చింతల్​ స్వర్ణ భారత్​ ట్రస్ట్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ట్రైనీ విద్యార్థులకు జాతీయ జెండాలు అందజేసి మాట్లాడారు. ఆజాదీ కా అమృత్​ మహోత్సవ్​లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొనాలని సూచించారు. ఎంతో మంది అమరుల త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని తెలిపారు. ఈ స్వాతంత్ర్య స్ఫూర్తిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందని వివరించారు. 

కలిసి ముందుకెళ్లాలి..

తాజా రాజకీయ అంశాలపై వెంకయ్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలతో ఒక పార్టీలో ఎన్నుకోబడిన లీడర్.. మరో పార్టీలో చేరడం సమంజసం కాదని వెంకయ్యనాయుడు అన్నారు. అలా చేరాలనుకుంటే.. స్వచ్ఛందంగా పదవికి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరి గెలవాలన్నారు. అధికార, ప్రతిపక్ష నేతలు కలిసి ప్రజా సమస్యలపై పని చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు వెళ్లాలని సూచించారు. ఐదేండ్లకోసారి కచ్చితంగా ఎన్నికలు జరగాలన్నారు. దేశ ప్రధాని ఒక్కడే నీతి మంతుడైతే సరిపోదని.. కింది స్థాయిలో ఉన్న ప్రతీ నాయకుడు నీతిగా వ్యవహరించాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమిష్టి కృషితోనే కరోనాను సమర్థవంతంగా ఎదుర్కున్నామన్నారు. 

ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి..

యువత చెడు అలవాట్ల బారినపడకుండా.. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని, విదేశీ మోజులు, విదేశీ తిండిపై కాకుండా.. సంప్రదాయ వంటకాలు తినడం అలవాటు చేసుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు. ఇలా చేయడంతో యువత ఆరోగ్యం బాగుంటుందని, రోగాలబారిన పడరని, యోగా చేస్తే మరింత హెల్తీగా ఉంటారని తెలిపారు. ఆరోగ్యమే మహా భాగ్యమన్న విషయం గుర్తు పెట్టుకోవాలని సూచించారు. అందరూ కలిసికట్టుగా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాల్సిన అవసరం ఉందన్నారు. దేశం అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నా.. ఇంకా దారిద్ర్య రేఖకు దిగువన 20శాతం మంది ఉన్నారని తెలిపారు. అక్కడక్కడ మతపరమైన గొడవలు, కుల వివక్ష, స్ర్తీ, పురుష లింగ బేధాలు కూడా ఉన్నాయన్నారు.